Business

అలాంటివి నాలుగైదు కావాలి-వాణిజ్యం

అలాంటివి నాలుగైదు కావాలి-వాణిజ్యం

* దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో బ్యాంకింగ్‌ వ్యవస్థ మరింత వేగంగా పని చేయాలంటే స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా లాంటి ‍ బ్యాంకులు నాలుగైదు కావాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. ముంబైలో జరిగిన ఇండియన్‌ బ్యాంక్‌ 74వ వార్షిక సమావేశంలో ఆమె మాట్లాడారు.కరోనా ప్యాండెమిక్‌ తర్వాత ఇప్పుడిప్పుడే ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుందని మంత్రి చెప్పారు. ఈ తరుణంలో పెరుగుతున్న అవసరాలకు తగ్గట్టుగా నగదు చలామనీ చేసేందుకు మరిన్ని బ్యాంకులు రావాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. ఆర్థిక లావాదేవీలు ఎ‍క్కువగా జరిగే ప్రతీ చోట డిజిటల్‌గా లేదా ప్రత్యక్షంగా బ్యాంకులు ఉండాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు.దేశంలో ఉన్న ప్రభుత్వ బ్యాంకులను విలీనం చేయడం వల్ల పెద్ద బ్యాంకులు ఏర్పడే అవకాశం కలిగిందని నిర్మలా సీతారామన్‌ వివరించారు. ఇప్పటి వరకు రెండు దశల్లో కేంద్రం పలు ప్రభుత్వ రంగ బ్యాంకులను పెద్ద బ్యాంకుల్లో విలీనం చేసింది. అందులో భాగంగా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ పేరుతో అన్ని బ్యాంకులు ఎస్‌బీఐలో విలీనం అయ్యాయి.

* గతకొంత కాలంగా మార్కెట్లలో ఐపీఓల జోరు కొనసాగుతోంది. రానున్న రెండు నెలల్లోనూ భారీ ఎత్తున కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూకు రానున్నట్లు సమాచారం. అక్టోబరు-నవంబరులో కనీసం 30 కంపెనీలు ఐపీఓకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో దాదాపు రూ.45,000 కోట్ల సమీకరణ జరిగే అవకాశం ఉంది. కొత్తగా ఐపీఓకి రానున్న కంపెనీల్లో మెజారిటీ ఐటీ రంగానికి చెందినవేనని తెలుస్తోంది. ఆన్‌లైన్ ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటో ఐపీఓ ఊహించని రీతిలో విజయవంతం కావడంతో టెక్‌ ఆధారిత కంపెనీలన్నీ పబ్లిక్ ఇష్యూ వైపు అడుగులు వేస్తున్నాయి.

* భారత్‌లో విద్యుత్తు వాహనాలపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ ఆడి కోరింది. దేశంలో విద్యుత్తు వాహన విపణి వృద్ధికి సుంకాలు అడ్డంకిగా మారాయని తెలిపింది. సుంకాల్ని తగ్గిస్తే భారత్‌లో కార్ల తయారీపై పెట్టుబడి పెట్టేందుకు తమ యాజమాన్యాన్ని ఒప్పించేందుకు అవకాశం ఉంటుందని ఆడి ఇండియా తెలిపింది.

* టెలికాం కంపెనీలను కొనుగోలు చేయడంపై ప్రభుత్వానికి ఎలాంటి ఆసక్తి లేదని వొడాఫోన్‌ ఐడియా లిమిటెడ్‌(వీఐఎల్‌) ఎండీ, సీఈఓ రవీందర్‌ టక్కర్‌ అన్నారు. బకాయిలపై వడ్డీలను ఈక్విటీల రూపంలో చెల్లించే సదుపాయం కల్పించిందన్నారు. తమ కంపెనీ మార్కెట్‌లో పోటీపడాలని సర్కార్‌ ఆశిస్తోందన్నారు. దేశంలో కనీసం మూడు ప్రైవేట్‌ టెలికాం సర్వీస్‌ ప్రొవైడర్లు ఉండాలని భావిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల టెలికాం రంగానికి పలు ప్రోత్సాహకాలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వంలో వివిధ హోదాల్లో ఉన్న వ్యక్తులతో మాట్లాడినప్పుడు తనకు ఈ విషయాలు అవగతమయ్యాయన్నారు. వీఐఎల్‌కు స్థూలంగా రూ.1.91 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. వీటిలో స్పెక్ట్రమ్‌ కేటాయింపుల చెల్లింపుల కింద రూ.1.06 లక్షల కోట్లు, సర్దుబాటు చేసిన స్థూల ఆదాయ(ఏజీఆర్‌) బకాయిల కింద రూ.62,180 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు రూ.23,400 కోట్ల బకాయి పడింది. ఈ నేపథ్యంలో బకాయిల చెల్లింపు కష్టంగా మారడంతో ఓ దశలో వీఐఎల్‌లో ప్రభుత్వం కొంత వాటా సొంతం చేసుకునే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. అయితే, వీటిని తాజాగా వీఐఎల్‌ ఖండించింది.