Politics

రేవంత్ రెడ్డి అరెస్టు-తాజావార్తలు

రేవంత్ రెడ్డి అరెస్టు-తాజావార్తలు

* టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి ని అరెస్ట్ చేసిన పోలీస్ లు.. ఉప్పల్ పోలీసు స్టేషన్ కు తరలింపు. భారత్ బంద్ లో భాగంగా ఉప్పల్ బస్ డిపో వద్ద బంద్ లో పాల్గొన్న రేవంత్ రెడ్డి.

* దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు పేరుతో పోస్టల్ స్టాంపును ఆవిష్కరించినట్లు పోస్టల్ సూపరింటెండెంట్ కరుణాకర్ బాబు వెల్లడించారు.

* రైతుల ఉద్యమానికి తొలుత మద్దతునిచ్చిన సీఎం కేసీఆర్ ఇప్పుడు మాత్రం మారుమాటైనా మాట్లాడడం లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. గతంలో నిర్వహించిన బంద్ లలో కేటీఆర్ కూడా పాల్గొన్నారని గుర్తు చేశారు. మోదీని కలిశాకే కేసీఆర్ లో మార్పు వచ్చిందన్నారు. ప్రధాని ఏం మాయ చేశారోగానీ.. సీఎం పూర్తిగా మారారని చెప్పారు. భారత్ బంద్ లో భాగంగా హైదరాబాద్ ఉప్పల్ డిపో ముందు నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో ఆయన కమ్యూనిస్ట్ పార్టీల నేతలతో కలిసి పాల్గొన్నారు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ పాలనలో పేదల బతుకు దుర్భరంగా మారిందని మండిపడ్డారు. ఇవాళ్టి బంద్ లో సీఎం కేసీఆర్ పాల్గొనలేదని, మోదీతో విందు చేసుకుంటున్నారని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ రభుత్వం రైతు శ్రేయస్సు కోసం పనిచేస్తే.. ఇప్పుడు మోదీ ప్రభుత్వం మాత్రం రైతులను బానిసలుగా మార్చిందని ఆరోపించారు. నూతన సాగు చట్టాలు రైతులకు మరణ శాసనాలేనని, వాటితో రైతుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగును అదానీ, అంబానీలకు మోదీ తాకట్టు పెట్టారని రేవంత్ ఆరోపించారు.

* బీజేపీ, కేసీఆర్ ఇద్దరు ఒక్కటేనని, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించాలంటే సీఎం కేసీఆర్ భయపడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నూతన వ్యవసాయ చట్టం మీద రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ఏంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి జుట్టు రాహుల్ గాంధీ చేతిలో… కేసీఆర్ చేతిలో రేవంత్ పిలక ఉంటుందని షర్మిల చేసిన వ్యాఖ్యలు అర్థ రహితమన్నారు. నిన్న మొన్న పార్టీ పెట్టిన వాళ్ళ గురించి పెద్దగా మాట్లాడల్సిన అవసరం లేదన్నారు. ఆమె ఎం మాట్లాడుతున్నారో ఆమెకే అర్థం కావడం లేదన్నారు. షర్మిల మాటలను తాము పెద్దగా పరిగణనలోకి తీసుకొమన్నారు. కాంగ్రెస్ పార్టీ మీద ఆమె ఆరోపణలను చూశాక స్పందిస్తానన్నారు. దేశంలో, రాష్ట్రంలో ఏకైక ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.

* దిశ కమిషన్ విచారణకు ఐపీఎస్ అధికారి సజ్జనార్ హాజరు కానున్నారు. ఈ మేరకు త్రిసభ్య కమిటీ సమన్లు జారీ చేసింది. కమిటీ మంగళవారం లేదా బుధవారం సజ్జనార్‌ను విచారించే అవకాశం ఉంది. కాగా సోమవారం త్రిసభ్య కమిటీ ముందు ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం హాజరుకానుంది. సజ్జనార్‌ను విచారించిన తర్వాత త్రిసభ్య కమిటీ మరోసారి సిట్‌ చీఫ్‌ మహేశ్‌ భగవత్‌‌ను విచారించనుంది.

* తెలంగాణలోని 14 జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌…తుపాను ప్రభావం దృష్ట్యా పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ జారీచేసింది.రాష్ట్రంలో 14 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, పెద్దపల్లి, కరీంనగర్, జనగామ, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు రెడ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేసినట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం సంచాలకులు డాక్టర్‌ నాగరత్న తెలిపారు.రెడ్ అలర్ట్ ప్రకటించిన జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హెచ్చరించారు.

* జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి 54,433  క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయానికి చేరుతోంది.ప్రాజెక్టులో ఆదివారం సాయంత్రం 6 గంటల సమయానికి  882.10 అడుగుల వద్ద 199.2737 టీఎంసీల నిల్వలు నమోదయ్యాయి.

* వైసిపిలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై వంగవీటి రాధా తీవ్ర ఆగ్రహాం.నిన్నటి గుడివాడ పరిణామాలపై అనుచరులతో మాట్లాడిన వంగవీటి రాధా.

* నగరంలో ఈనెల 25న రాత్రి కురిసిన వర్షానికి మణికొండలోని డ్రైనేజీలో గల్లంతైన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ రజనీకాంత్‌ మృతదేహం లభ్యమైంది. నెక్నాంపూర్‌ చెరువులో రజనీకాంత్ మృతదేహం లభ్యమైంది. సమచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. నాలాలు కలిసే చోట, నెక్నాంపూర్‌ చెరువు వద్ద గాలింపులో భాగంగా నెక్నాంపూర్‌ చెరువులో గుర్రపు డెక్క తొలగిస్తుండగా రజనీకాంత్‌ మృతదేహం బయటపడింది. రెండు రోజుల క్రితం పెరుగు ప్యాకెట్‌ కోసం వచ్చి మణికొండ డ్రైనేజీలో గల్లంతైన రజనీకాంత్‌ మృతదేహం దాదాపు మూడు కిలోమీటర్ల దూరం కొట్టుకొచ్చింది. గోపిశెట్టి రజనీకాంత్‌ (42) షాద్‌నగర్‌లోని నోవా గ్రీన్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు.