Business

ఒక్క ఏడాదిలో నాలుగు రెట్లు పెరిగిన అదానీ సంపద-వాణిజ్యం

ఒక్క ఏడాదిలో నాలుగు రెట్లు పెరిగిన అదానీ సంపద-వాణిజ్యం

* ఒక్క ఏడాది.. ఒకే ఒక్క ఏడాదిలో వ్యాపార‌వేత్త గౌత‌మ్ అదానీ, ఆయ‌న కుటుంబ స‌భ్యుల మొత్తం సంప‌ద ఏకంగా నాలుగు రెట్లు పెరిగింది. 2019-20లో రూ.1.4 ల‌క్ష‌ల కోట్లుగా ఉన్న అదానీ సంపద‌.. 2020-21లో రూ.5.06 ల‌క్ష‌ల కోట్ల‌కు చేరింది. ఆ లెక్క‌న ఆ ఏడాది మొత్తం అదానీ రోజువారీ సంపాద‌న ఏకంగా రూ.1002 కోట్లు కావ‌డం గ‌మ‌నార్హం. ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ 2021 తేల్చిన లెక్క‌లివి. ఈ తాజా లిస్ట్ ప్ర‌కారం.. ఇండియాలోని 119 న‌గ‌రాల్లో క‌నీసం రూ.1000 కోట్ల సంప‌ద ఉన్న 1007 మంది వ్య‌క్తుల సంపద గ‌తేడాది 51 శాతం పెరిగింది. ఓవైపు క‌రోనాతో ప్ర‌పంచ‌మంతా విల‌విల్లాడుతుంటే.. మ‌న కుబేరులు మాత్రం భారీగా సంప‌ద పోగేసుకున్న‌ట్లు ఈ తాజా రిచ్ లిస్ట్ స్ప‌ష్టం చేస్తోంది.

* గ్లోబ‌ల్ ఈ-కామ‌ర్స్ దిగ్గ‌జం అమెజాన్ ఈ నెల మూడో తేదీ నుంచి క‌స్ట‌మ‌ర్ల కోసం అందుబాటులోకి తెస్తున్న గ్రేట్ ఇండియ‌న్ ఫెస్టివల్ (జీఐఏఫ్‌) వ‌ల్ల తెలంగాణ‌లో 31 వేల మందికి పైగా వ్యాపారుల‌కు ల‌బ్ధి చేకూర‌నున్న‌ది. రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్‌తోపాటు వ‌రంగ‌ల్‌, ఖ‌మ్మం, న‌ల్గొండ‌, గ‌ద్వాల్‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాల్లోని వ్యాపారుల‌కు ప్ర‌యోజ‌నం ల‌భించ‌నున్న‌ది. గ్రేట్ ఇండియ‌న్ ఫెస్టివ‌ల్ (జీఐఎఫ్‌-2021)ను అమెజాన్ దేశ‌వ్యాప్తంగా 450 న‌గ‌రాల ప‌రిధిలో 75 వేలపై చిలుకు స్థానిక దుకాణాల‌తోపాటు ల‌క్ష‌ల మంది చిన్న వ్యాపారుల‌కు అంకితం చేసింది. దేశ‌వ్యాప్తంగా ఎంపిక చేసిన వ‌స్తువుల‌పై ఆఫ‌ర్లు అందిస్తోంది అమెజాన్ జీఐఎఫ్‌.

* కరోనా మహమ్మారి ప్రభావం నుంచి నిర్మాణ రంగం కోలుకుంటున్నది. దేశంలోని టాప్‌-7 నగరాల్లో ఈ ఏడాది జూలై-సెప్టెంబర్‌ త్రైమాసికం (క్యూ3)లో నమోదైన ఇండ్ల అమ్మకాలే ఇందుకు నిదర్శనం. హైదరాబాద్‌సహా 7 ప్రధాన నగరాలపై ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెంట్‌ అనరాక్‌ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం గతేడాది జూలై-సెప్టెంబర్‌తో పోల్చితే ఈసారి హౌజింగ్‌ సేల్స్‌ రెండింతలకుపైగా పెరిగి 62,800 యూనిట్లకు చేరాయి. రెసిడెన్షియల్‌ ప్రాపర్టీల అమ్మకాలు నిరుడుతో చూస్తే 24,560 యూనిట్ల నుంచి 29,520 యూనిట్లకు పెరిగాయి. ఈ క్రమంలోనే గతంతో పోల్చితే అమ్మకాల్లో వృద్ధిపరంగా హైదరాబాద్‌ 408 శాతంతో టాప్‌లో ఉండగా, యూనిట్లపరంగా చూస్తే ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్‌ 20,965 యూనిట్లతో ప్రథమ స్థానంలో ఉన్నట్లు అనరాక్‌ తెలియజేసింది. ఇక ఈ జూలై-సెప్టెంబర్‌లో 7 ప్రధాన నగరాల వ్యాప్తంగా 64,560 కొత్త యూనిట్ల ప్రారంభం జరిగింది. నిరుడు 32,530 గానే ఉన్నాయి. అయినప్పటికీ అంచనాల కంటే తక్కువగానే ఉన్నాయి. 201 9లో ఈ నగరాల హౌజింగ్‌ సేల్స్‌ 2,61, 358 యూనిట్లుగా ఉన్నట్లు తెలిపింది. కరోనాతో 2020 లో అమ్మకాలు దారుణంగా పడిపోయిన విషయం తెలిసిందే.

* డిజిటల్‌ చెల్లింపుల్లో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలోకి దూసుకొచ్చింది. డిజిటల్‌ పేమెంట్స్‌ ప్లాట్‌ఫామ్‌ ఫోన్‌పే సర్వేలో ఈ విషయం తేటతెల్లమయ్యింది. తెలంగాణ రాష్ట్రంలో 44 శాతం మంది ఫోన్‌పే యూజర్లుగా నమోదయ్యారు. తమ యాప్‌ను ఓపెన్‌ చేసేవారు జాతీయ సగటు కంటే తెలంగాణలో 60 శాతం అధికమని ఫోన్‌పే తెలిపింది.

* పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని ఎస్బీఐ కార్డ్‌ తన క్రెడిట్‌ కార్డు వినియోగదారులకు బంపర్‌ ఆఫర్‌ను ప్రకటించింది. ఎస్బీఐ క్రెడిట్‌ కార్డు కలిగిన వారు ఆన్‌లైన్లో షాపింగ్‌ చేసిన వారికి 10 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ ఇవ్వనున్నట్లు బుధవారం ప్రకటించింది. ‘దూందార్‌ దస్‌’ పేరుతో ప్రకటించిన ఈ ఆఫర్‌ అక్టోబర్‌ 3 నుంచి మూడు రోజులు మాత్రమే అమలులో ఉండనున్నదని పేర్కొంది. ఈ మూడు రోజులు ఏ ఈ-కామర్స్‌ సంస్థ నుంచి కొనుగోలు చేసిన ఈ ఆఫర్‌ వర్తించనున్నది. ఆన్‌లైన్లో షాపింగ్‌ చేసేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటం వల్లనే ఈ ప్రత్యేక ఆఫర్‌ అందించినట్లు ఎస్బీఐ కార్డ్‌ సీఈవో, ఎండీ రామ్మోహన్‌రావు తెలిపారు. ఈఎంఐ ఆప్షన్‌ను ఎంచుకునే అవకాశాన్ని కూడా సంస్థ కల్పించింది.