Politics

పవన్‌తో సోము వీర్రాజు భేటీ-తాజావార్తలు

పవన్‌తో సోము వీర్రాజు భేటీ-తాజావార్తలు

* కడప జిల్లా బద్వేలు ఉపఎన్నికపై వైకాపా నేతలు, మంత్రులతో ఆ పార్టీ అధినేత, సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. దివంగత ఎమ్మెల్యే డాక్టర్‌ వెంకట సుబ్బయ్య సతీమణి డాక్టర్‌ సుధను పార్టీ అభ్యర్థిగా నిలబెడుతున్నట్లు సీఎం స్పష్టం చేశారు. ఉపఎన్నికకు వైకాపా తరఫున ఇన్‌ఛార్జ్‌గా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నియమిస్తున్నట్లు చెప్పారు. అతివిశ్వాసం వద్దు.. కష్టపడి ప్రజల ఆమోదం పొందాలని దిశానిర్దేశం చేశారు.

* ఉప ఎన్నికలో తెరాస గెలవలేదనే సీఎం కేసీఆర్‌ కొత్త ఎత్తుగడ వేస్తున్నారని మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్‌ అన్నారు. కేసీఆర్‌కు తాను లొంగిపోయినట్లు గతంలోనూ లేఖ సృష్టించారని చెప్పారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు తేల్చలేదన్నారు. తాను పేదల గొంతుకనని.. హుజూరాబాద్‌లో గెలిపించాలని ప్రజల్ని కోరారు.

* జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు భేటీ అయ్యారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఇరు పార్టీల నేతలూ సమావేశమయ్యారు. బద్వేలు ఉప ఎన్నిక, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. అక్టోబర్‌ 2న శ్రమదానం వివరాలను జనసేన నేతలు సోము వీర్రాజుకు వివరించారు.

* ఏపీలో జీవోఐఆర్‌ వెబ్‌సైట్‌లో కాకుండా ఏపీ ఈ- గెజిట్‌లో ప్రభుత్వ ఉత్తర్వులను ఉంచుతామంటూ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 100ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. జీవోలపై నూతన విధానం ఎందుకు తీసుకొచ్చారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. పూర్తి వివరాలతో అక్టోబర్‌ 27వ తేదీలోపు అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది.

* దేశంలో ఆరోగ్య రంగాన్ని పూర్తిగా మార్చేందుకు కేంద్రం కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాకు కనీసం ఒక మెడికల్‌ కాలేజీ లేదా పీజీ వైద్య విద్య కేంద్రం ఉండాలని కేంద్రం భావిస్తున్నట్లు వెల్లడించారు. రాజస్థాన్‌లోని నాలుగు జిల్లాల్లో మెడికల్‌ కాలేజీలకు ప్రధాని మోదీ ఇవాళ శంకుస్థాపన చేశారు.

* పంజాబ్‌ పీసీసీ చీఫ్‌గా రాజీనామా చేసిన కాంగ్రెస్‌ నేత నవజోత్‌ సింగ్ సిద్ధూ.. గురువారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్ చన్నీతో సమావేశమయ్యారు. చండీగఢ్‌లోని పంజాబ్‌ భవన్‌లో ఈ భేటీ జరుగుతోంది. కాంగ్రెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కుల్జీత్‌ నగ్రా, సీనియర్‌ నేతలు పవన్ హోయెల్‌, ప్రగత్‌ సింగ్‌, హరీశ్‌ చౌదరీ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సిద్ధూ అనూహ్య రాజీనామాతో పంజాబ్‌ కాంగ్రెస్‌లో తలెత్తిన సంక్షోభానికి పరిష్కారం దిశగా వీరిద్దరూ భేటీ అయ్యారు.

* పంజాబ్‌ ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ కేంద్ర హోంమంత్రితో భేటీ కావడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. దీంతో ఆయన భాజపాలో చేరుతున్నారనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో స్పందించిన కెప్టెన్‌ అమరీందర్‌.. తాను భాజపాలో చేరడం లేదని వెల్లడించారు. అలాగని కాంగ్రెస్‌లోనూ కొనసాగే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

* ఓ అమెరికా జనరల్‌ దేశ అధ్యక్షుడి ఆలోచనలను చైనా జనరల్‌కు ఫోన్‌ చేసి ముందే చెప్పేశారు. కొన్నాళ్లకు ఈ విషయం బయటకు వచ్చింది.. దీంతో యుద్ధాన్ని నివారించేందుకు అలా చేశానని ఇప్పుడా జనరల్‌ తాను చేసిన పని సమర్థించుకొంటున్నారు. అతనికి ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్‌ అండగా నిలుస్తున్నారు. తాజాగా ఆ జనరల్‌ అమెరికా కాంగ్రెస్‌ విచారణకు హాజరుకావడంతో ఈ విషయం మరోసారి చర్చకు వచ్చింది.

* తక్కువ బడ్జెట్‌లో మంచి ఫోన్ కోరుకునే వారి కోసం సీ31 పేరిట కొత్త మొబైల్‌ను పోకో భారత మార్కెట్లోకి గురువారం విడుదల చేసింది. ఒకసారి ఛార్జింగ్‌ చేస్తే రెండురోజుల పాటు ఛార్జింగ్‌ వచ్చే బ్యాటరీ, ట్రిపుల్‌ కెమెరా ఈ ఫోన్‌ ప్రత్యేకతలు. పోకో సీ31 రెండు వేరియంట్లలో ఈ ఫోన్‌ వస్తోంది. 3జీబీ+32జీబీ వేరియంట్‌ ధరను కంపెనీ రూ.8,499గా నిర్ణయించింది. 4జీబీ+64జీబీ వేరియంట్‌ ధరను రూ.9,499గా పేర్కొంది.

* రానున్న టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య.. జట్టులో ఎలాంటి పాత్ర పోషించాలి అనే విషయంపై భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడాడు. హార్దిక్ ఇప్పటికీ బౌలింగ్‌ చేయడానికి ఫిట్‌గా లేడు.. కాబట్టి టీ20 ప్రపంచకప్‌లో అతడు పూర్తిస్థాయి బ్యాటర్‌గా ఆడాలని చెప్పాడు. పాండ్య తనదైన రోజున ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించగల సమర్థుడని పేర్కొన్నాడు.

* ఉషాలక్ష్మి బ్రెస్ట్‌ క్యాన్సర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌ కేంద్రాన్ని దిల్లీ నుంచి వర్చువల్‌గా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రొమ్ము సంబంధ సమస్యలపై 12 భాషల్లో హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. ‘‘బ్రెస్ట్‌ క్యాన్సర్‌ విజేతలకు అవగాహన కల్పించడం సంతోషకరం. క్యాన్సర్‌ విజేతల మాటలు బాధితులకు భరోసానిస్తాయి. క్యాన్సర్‌ చికిత్సలో కౌన్సెలింగ్‌ది కీలకపాత్ర. రోగికి తెలిసిన భాషలో అవగాహన కల్పిస్తేనే సరిగా అర్థం చేసుకోవడంతో పాటు వారికి ధైర్యం వస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా 3.2 మిలియన్ల రొమ్ము క్యాన్సర్‌ కేసులు వెలుగు చూస్తున్నాయి. ఊపిరితిత్తుల క్యాన్సర్‌ కంటే ఎక్కువగా వ్యాపిస్తున్నట్టు 2020 నివేదికలు చెబుతున్నాయి. అత్యధిక భాగం క్యాన్సర్‌ రకాలను ముందుగానే గుర్తించే అవకాశం ఉంది. రొమ్ము సమస్యలతో బాధ పడుతున్న వారికి అండగా నిలిచి అవగాహన కల్పించడం హెల్ప్ లైన్ లక్ష్యం. క్యాన్సర్‌ రోగుల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. క్యాన్సర్‌ చికిత్సల వ్యయాన్ని తగ్గించాలి. ప్రజారోగ్య వ్యవస్థలో ఆయుష్మాన్‌ భారత్‌ చరిత్రాత్మక మార్పు. పథకంలో అర్హులందరూ పేర్లు నమోదు చేసుకోవాలి’’ అని వెంకయ్యనాయుడు సూచించారు. ఈ కార్యక్రమంలో యూబీఎఫ్‌ ఛైర్మన్‌ డా.రఘురామ్‌, డా.ఉషాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

* ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 58,054 మంది నమూనాలు పరీక్షించగా 1,010 కొత్త కేసులు నమోదయ్యాయి. 13 మంది మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 1,149 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 11,503 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది. కొవిడ్‌ వల్ల చిత్తూరు జిల్లాలో ఐదుగురు, గుంటూరు జిల్లాలో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, తూర్పుగోదావరి, కడప, కృష్ణా, నెల్లూరులో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు.

* రైల్వేజోన్‌ ఏర్పాటుపై సత్వరమే చర్యలు తీసుకోవాలని రాష్ట్రానికి చెందిన ఎంపీలు రైల్వే ఉన్నతాధికారులను కోరారు. విజయవాడలో రైల్వే ఉన్నతాధికారులతో సమావేశమైన రాష్ట్ర ఎంపీలు .. రైల్వే పరంగా చేపట్టాల్సిన పనులపై ప్రతిపాదనలు ఇచ్చారు. రాష్ట్రం నుంచి నిధులు రాలేదని, అందుకే పనులు ఆపేశామని దక్షిణ మధ్యరైల్వే జీఎం గజానన్‌ మాల్యా చెప్పారు. అయితే, పనులు ఆపొద్దని, పూర్తిగా రైల్వే నిధులతోనే చేపట్టాలని ఎంపీలు కోరారు. కొవ్వూరు-భద్రాచలం, నడికుడి-శ్రీకాళహస్తి రైల్వేలైన్‌ త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఎంపీలు భరత్‌, వంగా గీత, పిల్లి సుభాష్ చంద్రబోస్‌, తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం అనంతరం తెదేపా రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ మాట్లాడుతూ… లోపాయికారీ పోరాటం కాకుండా రాజీలేని పోరాటం చేస్తేనే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయన్నారు.