Editorials

పోలీసుల తీరుపై జస్టిస్.ఎన్.వి.రమణ వ్యాఖ్యలు

పోలీసుల తీరుపై జస్టిస్.ఎన్.వి.రమణ వ్యాఖ్యలు

దేశంలో అధికారులు, పోలీసులు ఎలా ప్రవర్తిస్తున్నారన్న అంశంపై తనకు చాలా సందేహాలు ఉన్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ అన్నారు. క్రిమినల్‌ కేసుల నుంచి రక్షణ కోరుతూ ఛత్తీస్‌గఢ్‌ పోలీసు అదనపు డైరెక్టర్‌ జనరల్‌ గుర్జిందర్‌పాల్‌ సింగ్‌ దాఖలు చేసిన కేసుపై శుక్రవారం ఆయన ఆధ్వర్యంలోని, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా జస్టిస్‌ రమణ దేశంలో బ్యూరోక్రాట్లు ముఖ్యంగా పోలీసు అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై సునిశిత వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రజలను వేధించే బ్యూరోక్రాట్లు, ముఖ్యంగా పోలీసు అధికారులకు వ్యతిరేకంగా వచ్చే ఫిర్యాదులను పరిశీలించేందుకు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల ఆధ్వర్యంలో స్థాయీ సంఘం ఏర్పాటు చేయాలని ఓసారి అనుకున్నాను. దాన్ని నేను రిజర్వ్‌లో ఉంచాలని అనుకుంటున్నాను. ప్రస్తుతానికి ఏర్పాటు చేయాలని అనుకోవడంలేదు’’ అని అభిప్రాయపడ్డారు. గత వారం ఇదే అంశం విచారణకు వచ్చినప్పుడు కూడా ప్రధాన న్యాయమూర్తి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రభుత్వంతో సన్నిహితంగా మెలిగే సమయంలో పోలీసు అధికారులు అక్రమ వసూళ్లకు పాల్పడే కొత్తశైలి ప్రస్తుతం దేశంలో నెలకొంది. అందుకు మూల్యం చెల్లించుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు రక్షణ కోరుతున్నారు. ఇది చాలా అతి. అలాంటి అధికారులకు మేమెందుకు రక్షణ కల్పించాలి?’’అని ప్రశ్నించారు. అధికార పక్షం వైపు నిలిచిన పోలీసు అధికారులు తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రతిపక్షాలకు లక్ష్యంగా మారుతున్నట్లు కూడా వ్యాఖ్యానించారు. ‘‘ప్రస్తుతం దేశంలో పరిస్థితులు బాధాకరంగా ఉన్నాయి. ఓ రాజకీయపార్టీ అధికారంలో ఉన్నప్పుడు పోలీసు అధికారులు వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. తర్వాత కొత్త పార్టీ అధికారంలోకి వస్తే, ఆ ప్రభుత్వం ఆ అధికారులకు వ్యతిరేకంగా చర్యలకు ఉపక్రమిస్తోంది. ఇదో కొత్త ట్రెండ్‌ నడుస్తోంది. దీనికి అడ్డుకట్ట వేయాల్సి ఉంది’’ అని పేర్కొన్నారు. అక్రమ వసూళ్లతోపాటు, వివిధ నేరాల కింద తనపై నమోదు చేసిన మూడు ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలని కోరుతూ ఛత్తీస్‌గఢ్‌ మాజీ ఏడీజీ గుర్జిందర్‌ పాల్‌ సింగ్‌ ఆ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించగా, ఆ కోర్టు అందుకు నిరాకరించింది. దాంతో ఆయన సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ కేసు విచారణ సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ ‘‘మీరు ప్రభుత్వంతో సన్నిహితంగా ఉన్నందున వసూళ్లు మొదలు పెట్టారు. ప్రభుత్వంతో సన్నిహితంగా ఉండి, ఇలాంటి పనులు చేస్తే ఇలాగే ఉంటుంది. ఏదో ఒకరోజు అందుకు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అదే జరుగుతోంది’’ అని పేర్కొన్నారు.