Business

ఇండియాలో ఎలాన్ మస్క్ కొత్త వ్యాపారం-వాణిజ్యం

ఇండియాలో ఎలాన్ మస్క్ కొత్త వ్యాపారం-వాణిజ్యం

* జీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ శ‌నివారం బాంబే హైకోర్టు త‌లుపు త‌ట్టింది. సోనీలో జీ టీవీ విలీనానికి ఒప్పందం కుదిరిన నేప‌థ్యంలో అసాధార‌ణ వార్షిక స‌మావేశం (ఈజీఎం) నిర్వ‌హించాల‌ని ఇన్వెస్ట‌ర్లు ఇన్‌వెస్కో, ఓఎఫ్ఐ గ్లోబ‌ల్ చైనా ఫండ్ ఎల్ఎల్‌సీ డిమాండ్ చేస్తున్నాయి. అలాగే జీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఎండీ పునీత్ గోయెంకాను తొల‌గించ‌డంతోపాటు ప‌లు అంశాల‌పై చ‌ర్చించ‌డానికి ఏజీఎం జ‌రుపాల‌ని ప‌ట్టుబ‌డుతున్నారు. కానీ జీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఎండీగా పునీత్ గోయెంకా తొల‌గించాల‌న్న ఇన్వెస్ట‌ర్ల డిమాండ్ త‌ప్పిదం అని సంస్థ పేర్కొంది. ఇన్‌వెస్కో, ఎల్ఎల్‌సీ ప్ర‌తిపాద‌న‌కు వ్య‌తిరేకంగా జీ ఎంట‌ర్‌టైన్‌మెంట్.. హైకోర్టు త‌లుపు త‌ట్టింది.

* పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు శ‌నివారం వ‌రుస‌గా మూడోరోజూ పెర‌గ‌డంతో ఇంధ‌న ధ‌ర‌లు రికార్డు స్థాయిల‌కు చేరాయి. చ‌మురు మార్కెటింగ్ సంస్థ‌లు నేడు లీట‌ర్ పెట్రోల్ ధ‌ర 25 పైస‌లు, డీజిల్ ధ‌ర లీట‌ర్‌కు 30 పైస‌ల చొప్పున పెంచాయి. దీంతో ప‌లు మెట్రో నగ‌రాల్లో పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు ఆల్ టైం హైకి చేరాయి.

* హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న అరబిందో ఫార్మా మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌ గోవిందరాజన్‌ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో కంపెనీ నుంచి వైదొలుగుతున్నట్లు గోవిందరాజన్‌ రాజీనామా లేఖలో పేర్కొన్నారని, డైరెక్టర్ల బోర్డు ఇందుకు ఆమోదం తెలిపినట్లు అరబిందో ఫార్మా శుక్రవారం స్టాక్‌ ఎక్సేంజీలకు తెలిపింది. 2021 డిసెంబర్‌ 31న వ్యాపార వేళలు ముగిసిన తర్వాత ఈ రాజీనామా అమలులోకి వస్తుందని కంపెనీ పేర్కొంది. అలాగే తమ ఏపీఐ వ్యాపార విభాగానికి చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌గా ఎస్‌ దామోదరన్‌ నియామకానికి బోర్డు అంగీకారం తెలిపినట్లు ఆరబిందో ఫార్మా ప్రకటించింది.

* ప్రభుత్వ రంగ బ్యాంకులతోపాటు ప్రైవేట్‌ బ్యాంకులు కూడా వడ్డీరేట్లను క్రమంగా తగ్గిస్తున్నాయి. తాజాగా విదేశీ సంస్థయైన హెచ్‌ఎస్‌బీసీ..గృహ రుణాల బ్యాలెన్స్‌ ట్రాన్స్‌ఫర్‌పై వడ్డీరేటును పది బేసిస్‌ పాయింట్లు తగ్గించడంతో రుణ రేటు 6.45 శాతానికి దిగింది. బ్యాంకింగ్‌ రంగంలో అతి తక్కువ వడ్డీరేట్లలో ఇది కూడా ఒకటని పేర్కొన్నారు. అలాగే కొత్తగా రుణాలు తీసుకునేవారికి 6.70 శాతం వడ్డీకే ఇస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు, యెస్‌ బ్యాంక్‌ కూడా వడ్డీరేట్లలో కోత విధించింది. రుణాలపై ప్రాసెసింగ్‌ ఫీజును ఎత్తివేసింది. ఈ ఆఫర్‌ డిసెంబర్‌ 31 వరకు అమలులో ఉండనున్నది.

* ఎలాన్‌ మస్క్‌ నేతృత్వంలోని స్పేస్‌ఎక్స్‌కు చెందిన శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ విభాగం స్టార్‌లింక్‌ భారత్‌లో అడుగుపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. వచ్చే ఏడాది డిసెంబరు నుంచి 2 లక్షల యాక్టివ్‌ టెర్మినళ్లతో బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు ప్రారంభించాలని భావిస్తోంది. ఇందుకు ప్రభుత్వ అనుమతులు లభించాల్సి ఉంటుందని స్టార్‌లింక్‌ కంట్రీ డైరెక్టర్‌ (భారత్‌) సంజయ్‌ భార్గవ పేర్కొన్నారు. భారత్‌ నుంచి ముందస్తు ఆర్డర్లు 5000 దాటాయని, గ్రామీణ ప్రాంతాల్లో బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు అందించేందుకు కంపెనీ చూస్తున్నట్లు వెల్లడించారు. వినియోగదారుల నుంచి కంపెనీ డిపాజిట్‌గా 99 డాలర్లు లేదా రూ.7350 వసూలు చేస్తోంది. బీటా దశలో 50 నుంచి 150 ఎంబీపీఎస్‌ వేగాన్ని అందిస్తామని కంపెనీ చెబుతోంది. బ్రాడ్‌బ్యాండ్‌ విభాగంలో రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ ఐడియాలతో స్టార్‌లింక్‌ పోటీపడనుంది. భారతీ గ్రూప్‌నకు చెందిన వన్‌వెబ్‌తో ప్రత్యక్ష పోటీ నెలకొనే అవకాశం ఉంది.

* ఆగస్టులో దేశ ఎగుమతులు 21.35 శాతం పెరిగి 33.44 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.2.47 లక్షల కోట్ల)కు చేరాయి. దిగుమతులు సైతం 84.75 శాతం పెరిగి 56.38 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.4.18 లక్షల కోట్ల)కు పెరిగాయి. ఫలితంగా వాణిజ్య లోటు 22.94 బిలియన్‌ డాలర్లకు చేరింది. బంగారం దిగుమతులు ఏకంగా 750 శాతం పెరిగి 5.11 బిలియన్‌ డాలర్లకు చేరడమే వాణిజ్య లోటు పెరుగుదలకు ప్రధాన కారణం. వాణిజ్య శాఖ తాత్కాలిక గణాంకాల ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌- సెప్టెంబరులో వాణిజ్య లోటు 78.81 బిలియన్‌ డాలర్లకు చేరింది.