Health

విజయవాడలో వింత వ్యాధి

Srange Disease Scrub Typhus In Vijayawada

ప్రాథమిక దశలో గుర్తించలేకపోతున్న వైద్యులు

కరోనా, డెంగీ లక్షణాలతో వణికిస్తున్న అరుదైన వ్యాధి

విజయవాడకు చెందిన ఓ యువకుడు తీవ్రమైన చలి, జ్వరం, తలనొప్పి, ఒళ్లునొప్పులు, కండరాల నొప్పులతో బాధపడుతున్నా ఫలితం లేకపోవడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాడు. ఆ రోగి వ్యాధి లక్షణాలను బట్టి డెంగీగా భావించి వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించారు. అయినా జ్వరం తగ్గకపోగా మరింత ఎక్కువైంది. కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతుండటంతో అన్ని రకాల వైద్యపరీక్షలు చేయించారు. అన్నీ నెగెటివ్‌ రావడంతో నిపుణులైన వైద్యులను సంప్రదించారు. చివరికి తేలిందేమంటే ఆ యువకుడికి సోకింది వైద్యుల ప్రాధాన్యక్రమంలో ఉన్న విషజ్వరాల జాబితాలోనిది ఏదీ కాదు. ఆ యువకుడు ‘స్క్రబ్‌ టైపస్‌’ వైరస్‌ బారిన పడ్డాడని వైద్యనిపుణులు గుర్తించారు. వెంటనే తగిన చికిత్స అందించి ఆ యువకుడిని ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడారు.
జిల్లాలో విష జ్వరాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఈ సీజన్‌లో డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌ తదితర విష జ్వరాలు రావడం సాధారణమే అయినా.. ఈ మధ్య కాలంలో ‘స్క్రబ్‌ టైపస్‌’ కేసులు ఎక్కువగా వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ దీని బారినపడుతున్నారు. అయితే ఎక్కువగా పిల్లల్లోనే ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ వ్యాధి లక్షణాలు కూడా దాదాపు డెంగీని పోలి ఉండటం వల్ల వైద్యులు కూడా ప్రాథమిక దశలో దీనిని గుర్తించలేకపోతున్నారు. ఆలస్యంగా గుర్తించి రక్తపరీక్షలు చేయిస్తున్నా.. వాటి రిపోర్టులు రావడానికి కొన్ని వారాల సమయం పడుతుండటంతో సకాలంలో తగిన చికిత్స అందక అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల జ్వరాలతో బాధపడుతూ ఆసుపత్రులకు వెళుతున్న రోగుల్లో కొందరు ‘స్క్రబ్‌ టైఫస్‌’ బారినపడినవారు ఉండడం వైద్యులను సైతం కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ వ్యాధికి సకాలంలో సరైన చికిత్స అందకపోతే 50 నుంచి 60 శాతం వరకు మరణాలు సంభవించే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.

స్క్రబ్‌ టైపస్‌ అంటే…?

ప్రాణాంతకమైన స్క్రబ్‌ టైపస్‌ వ్యాధి దోమలు కుట్టడం వల్ల రాదు. అదొక రకమైన కీటకం (టిక్స్‌) కుట్టడం వల్ల బ్యాక్టీరియా మనిషి శరీరంలోకి ప్రవేశిస్తుంది. దీని బారినపడినవారికి డెంగీ మాదిరిగానే తీవ్రమైన జ్వరం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, చర్మంపై ఎర్రటి దద్దుర్లు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. విజయవాడ నగరంతోపాటు జిల్లావ్యాప్తంగా ఈ బ్యాక్టీరియా వేగంగా విస్తరిస్తున్నట్టు వైద్యనిపుణులు భావిస్తున్నారు. ఈ స్క్రబ్‌ టైఫస్‌ వ్యాధిని అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోకపోతే ప్రమాదకరమైన పరిస్థితులు ఎదుయ్యే అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నారు. ఇతర జ్వరాల్లో కాక, టైఫస్‌ లక్షణాలున్న పురుగులు కుట్టడం ద్వారానే ప్రాణాంతకమైన ఈ బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతుంది. పెంపుడు జంతువులతో సహవాసం చేసేవారు, పొదలు, అటవీ ప్రాంతాల్లో నివాసించేవారిని ఈ స్క్రబ్‌ టైఫస్‌ సోకిన పురుగులు కుడితే, పది రోజుల తర్వాత వ్యాధి లక్షణాలు బయటపడతాయి. తొలుత పురుగు కాటు ఉన్న ప్రదేశంలో ఎర్రటి గాయం ఏర్పడుతుంది. క్రమంగా చలి, జ్వరం, తలనొప్పి, పొడి దగ్గు, వికారం, వాంతులు, విరేచనాలు, ఒళ్లు నొప్పులు, కాళ్ల వాపు, కండరాల నొప్పి, శరీరంపై ఎర్రటి దద్దుర్లు ఏర్పడటం, రక్తకణాలు పడిపోవడం, కిడ్నీలు, లివర్‌, గుండె, మెదడు తదితర అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి, తగిన చికిత్స అందించకపోతే ప్రాణాంతకం కావచ్చని వైద్యులు చెబుతున్నారు.

నివారణ పద్ధతులివీ..

స్రైబ్‌ టైఫస్‌ వ్యాధిని నివారించడానికి ఎలాంటి వ్యాక్సిన్‌ అందుబాటులో లేదు. దీని వ్యాప్తికి కారకాలైన పురుగుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఒక్కటే మార్గం. ఈగలు, పురుగులు, పేలు కుట్టినప్పుడు కూడా ఈ బ్యాక్టీరియా వ్యాపించే అవకాశాలున్నాయి. ఇది ఒకసారి రక్తంలోకి ప్రవేశిస్తే మెల్లగా పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఇంటి పరిసరాల్లో పురుగులు, కీటకాలకు ఆవాసంగా ఉండేలా మొక్కలు, పొదలు లేకుండా చర్యలు తీసుకోవాలి. ఆరుబయటకు వెళ్లేటప్పుడు చర్మంపైన, దుస్తులపైన క్రిమి వికర్షకమైన స్ర్పేలు, క్రీములను వాడవచ్చు. చిన్నపిల్లల శరీరం, చేతులు, కాళ్లు మొత్తం కప్పి ఉంచేలా దుస్తులను వేయాలి. లేదా దోమతెరలు, బేబీ క్యారియర్‌లలో వారిని నిద్రపుచ్చాలి. పిల్లలు, పెద్దలు కూడా వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం వల్ల వ్యాధిని మోసే పురుగుల నుంచి రక్షణ పొందవచ్చు.

డెంగీ, కరోనాలతో కలిసి కూడా ఉండొచ్చు

ఇటీవల డెంగీ జ్వరాలతో పాటు స్క్రబ్‌టైపస్‌ కేసులు పిల్లల్లోనూ పెరుగుతున్నాయి. ఇది డెంగీ, కరోనా వైరస్‌లతో కూడా కలిసి ఉండొచ్చు. ఇలాంటి కాంబినేషన్‌ ఆఫ్‌ డిసీజెస్‌ ఇటీవల పెరుగుతున్నాయి. స్క్రబ్‌టైపస్‌ను గుర్తించడానికి మన దగ్గర ప్రస్తుతం ‘వైల్‌ఫిలిక్స్‌’ అనే టెస్టు మాత్రమే అందుబాటులో ఉంది. అందులో కూడా 40 నుంచి 50 శాతం మాత్రమే ఫలితాలు తెలుస్తున్నాయి. అది కూడా వారం దాటితేగాని రిపోర్టులు రావడం లేదు. ఈ కారణంగానే ప్రాథమిక దశలో స్క్రబ్‌టైపస్‌ను గుర్తించలేకపోతున్నారు. ఈ వ్యాధిని గుర్తించడానికి క్వాలిటీ ఇన్వెస్టిగేషన్స్‌ చేయించాల్సిన బాధ్యత వైద్యులపైనే ఉంది. ఇందుకు క్వాలిటీ ల్యాబ్‌ సపోర్టు కూడా అవసరం. నిపుణులైన పెథాలజిస్టులు, మైక్రోబయాలజిస్టులు మాత్రమే ఇలాంటి అరుదైన వ్యాధులను గుర్తించగలుగుతారు. స్క్రబ్‌టైపస్‌ను పూర్తిస్థాయిలో గుర్తించడానికి ఈ మధ్యనే ‘మాలిక్యులర్‌’ టెస్టు అందుబాటులోకి వచ్చింది. ఇది కూడా మెట్రో నగరాల్లో మాత్రమే ఉంది. ఈ వ్యాధి లక్షణాలు దాదాపు డెంగీ మాదిరిగానే ఉంటున్నా.. స్క్రబ్‌టైపస్‌ సోకిన బాధితుల్లో రక్తంలో సోడియం తగ్గుతుంది. ప్రాథమిక దశలోనే ఈ వ్యాధిని గుర్తించి తగిన చికిత్స అందించకపోతే శరీరంలోని ఇతర అవయవాలను దెబ్బతీస్తుంది. – డాక్టర్‌ చలసాని మల్లికార్జునరావు, పిల్లల వైద్యనిపుణులు