Business

నవంబరులో LIC IPO పనులు ప్రారంభం-వాణిజ్యం

నవంబరులో LIC IPO పనులు ప్రారంభం-వాణిజ్యం

* భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) కోసం ప్రభుత్వం తగిన ఏర్పాట్లను చురుగ్గా చేస్తోంది. వచ్చే నెలలో ఐపీఓకి సంబంధించిన ప్రాథమిక పత్రాలను మార్కెట్‌ నియంత్రణా సంస్థ సెబీకి సమర్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు ఆర్థికశాఖలోని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఎల్‌ఐసీని ఐపీఓకి తీసుకురావాలన్న లక్ష్యం తమ ముందుందన్నారు. అందుకు నిర్దిష్టమైన కాలపరిమితులు కూడా ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలోనే నవంబరులో సెబీకి ప్రాథమిక పత్రాలు సమర్పించేందుకు సిద్ధమవుతున్నామన్నారు. ఐపీఓకి వీలుగా ఇప్పటికే లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ నిబంధనలు-1956కు మార్పులు చేసిన విషయం తెలిసిందే. ఎక్స్ఛేంజీల్లో నమోదు కావడానికి అనువుగా, లిస్టింగ్‌ నిబంధనలు అనుసరించి బోర్డులో స్వతంత్ర డైరెక్టర్లను నియమించనున్నారు. దీంతోపాటు ఎల్‌ఐసీ ఛైర్మన్‌ పదవీ విరమణ వయసు నిబంధనలనూ సవరించారు. ప్రస్తుతం ఉన్న 60 ఏళ్లకు బదులుగా 62 ఏళ్లకు పెంచారు. మరవైపు ఐపీఓ నిర్వహణకు 10 మర్చంట్‌ బ్యాంకులను కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఎంపిక చేసింది. ఇందులో గోల్డ్‌మన్‌ శాక్స్‌, సిటీ గ్రూప్‌, కోటక్‌ మహీంద్రా, ఎస్‌బీఐ క్యాప్స్‌ ఉన్నాయి. ఎంపికైన మిగతా బ్యాంకుల్లో జేఎం ఫైనాన్షియల్‌, యాక్సిస్‌ క్యాపిటల్‌, నొమురా, బోఫా సెక్యూరిటీస్‌, జేపీ మోర్గాన్‌ ఇండియా, ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌లు ఉన్నాయని సమాచారం. సిరిల్‌ అమర్‌చంద్‌ మంగళ్‌దాస్‌ను న్యాయ సలహాదారుగా నియమించారు.

* డి-మార్ట్‌ విక్రయ కేంద్రాలు నిర్వహించే అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ జులై‌-సెప్టెంబరు త్రైమాసికానికి ఏకీకృత ప్రాతిపదికన కార్యకలాపాల ద్వారా రూ.7,649.64 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. కిందటేడాది ఇదే సమయంలో నమోదైన రూ.5,218.15 కోట్లతో పోలిస్తే ఆదాయం 46.6 శాతం పెరిగింది. సెప్టెంబరు 30, 2021 నాటికి మొత్తం 246 డి-మార్ట్‌ స్టోర్లు ఉన్నాయి.

* ఐదు ఈశాన్య రాష్ట్రాల‌ను క‌లుపుతూ స్పెష‌ల్ టూరిస్టు రైలును ప్రారంభించ‌డానికి గ‌ల అవ‌కాశాల‌ను ప‌రిశీలిస్తున్న‌ట్లు ఇండియ‌న్ రైల్వే క్యాట‌రింగ్ అండ్ టూరిజం కార్పొరేష‌న్ (ఐఆర్సీటీసీ) తెలిపింది. దేఖో అప్నా దేశ్ అనే ఇన్షియేటివ్‌లో భాగంగా తాము ఈ ప్రాజెక్టును చేప‌ట్ట‌నున్న‌ట్లు పేర్కొంది. ప్ర‌యాణికుల ర‌ద్దీ లేకుండా14 రాత్రులు, 15 ప‌గ‌ళ్లు నిరంత‌రాయంగా ఈ టూరిస్ట్ రైలు ప్ర‌యాణిస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు తాక‌ని, అన్వేషించ‌ని, అనూహ్య ప్రాంతాల‌కు ప్ర‌యాణికుల‌ను తీసుకెళ‌తామ‌ని ఐఆర్సీటీసీ వెల్ల‌డించింది. గువ‌హాటి ఆవ‌ల ఈశాన్య ప్రాంతాల ఆవిష్క‌ర‌ణ కోసం సాగే దేఖో అప్నా దేశ్ ఏసీ డీల‌క్స్ టూరిస్టు రైలులో అద్భుత‌మైన ప్ర‌యాణానికి సిద్ధం కావాలంటూ ఐఆర్సీటీసీ అధికారి పిలుపునిచ్చారు.

* ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రం మూడో త్రైమాసికంలో 2,41,300 కార్ల‌ను డెలివ‌రీ చేశామ‌ని గ్లోబ‌ల్ ఎల‌క్ట్రిక్ కార్ల త‌యారీ సంస్థ టెస్లా ప్ర‌క‌టించింది. మూడో త్రైమాసికంలో కార్ల త‌యారీ, కొనుగోలు దారుల‌కు కార్ల డెలివ‌రీలో నూత‌న రికార్డులు నెల‌కొల్పిన‌ట్లు తెలిపింది. గ‌మ్మ‌త్తేమిటంటే ప్ర‌స్తుతం సెమీ కండ‌క్ట‌ర్లు, చిప్‌ల కొర‌త‌తో గాడ్జెట్స్‌తోపాటు ఆటోమొబైల్ ప్ర‌త్యేకించి కార్ల త‌యారీ సంస్థ‌లు ఉత్ప‌త్తిలో కోత విధించాయి. క‌స్ట‌మ‌ర్ల‌కు కార్ల డెలివ‌రీ కూడా రీ షెడ్యూల్ చేస్తున్న త‌రుణంలో టెస్లా రికార్డు స్థాయిలో 2,43,300 ఎల‌క్ట్రిక్ కార్ల‌ను క‌స్ట‌మ‌ర్ల‌కు డెలివ‌రీ చేసిన‌ట్లు పేర్కొన‌డం గ‌మ‌నార్హం. ఇదే ఏడాది రెండో త్రైమాసికంలో 2,01,250 మందికి టెస్లా కార్ల‌ను డెలివ‌రీ చేసింది.

* భారతదేశంలో ఇటీవలి కాలంలో దాదాపు 20 లక్షల వాట్సాప్‌ ఖాతాలు మూసివేతకు గురయ్యాయి. భారతదేశంలోని ఐటీ నియమాలతోపాటు వాట్సాప్‌ నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించడంతో ఈ చర్యలకు ఉపక్రమించారు. అవాంఛిత సందేశాలను నిలిపివేసేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ సంస్థ స్పష్టం చేసింది.

* అమెరికాలోని త‌మ 40 వేల మంది క్ల‌యింట్ స‌ర్వీస్ ఉద్యోగుల‌ను శాశ్వ‌తంగా ఇంటి నుంచి ప‌ని ( Work from Home ) చేసేందుకు అనుమ‌తించిన‌ట్లు ప్ర‌ముఖ అకౌంటింగ్ అండ్ క‌న్స‌ల్టెన్సీ సంస్థ పీడ‌బ్ల్యూసీ వెల్ల‌డించింది. అకౌంటింగ్ ఇండ‌స్ట్రీలో ఉద్యోగుల‌కు రాత్రి పొద్దుపోయే వ‌ర‌కు ప‌నులు ఇచ్చే ధోర‌ణికి కరోనా మ‌హ‌మ్మారి చెక్ పెట్టింద‌నే చెప్పాలి. డెల్లాయిట్‌, కేపీఎంజీ వంటి ప్ర‌ధాన అకౌంటింగ్ సంస్థ‌లు క‌రోనా వేళ ఇండ్ల వ‌ద్ద నుంచి ప‌ని చేయ‌డానికే త‌మ ఉద్యోగుల‌కు చాన్స్ ఇచ్చాయి.