Politics

తనయుడి వీరవిధేయులకు పట్టం కడుతున్న సోనియమ్మ

తనయుడి వీరవిధేయులకు పట్టం కడుతున్న సోనియమ్మ

పంజాబ్‌లో 2017 నుంచి జరిగిన ప్రతి ఉపఎన్నిక, స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు విజయం సాధించిపెట్టిన ఘనుడు- కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌. అంతటి కాకలుతీరిన యోధుడిని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించడమంటే మాటలు కాదు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ అంతటి సాహసమూ చేశారు. మొదట అమరీందర్‌ ప్రత్యర్థి నవ్‌జ్యోత్‌ సింగ్‌ సిద్ధూను పంజాబ్‌ కాంగ్రెస్‌ శాఖకు అధ్యక్షుడిగా నియమించారు. తరవాత అమరీందర్‌ను తొలగించి రాహుల్‌ గాంధీ విధేయుడు చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీని సీఎం పీఠంపై కూర్చోబెట్టారు. చన్నీ పదోన్నతిపై నవ్‌జ్యోత్‌, అమరీందర్‌ ఇద్దరూ మండిపడ్డారు. అమరీందర్‌ దిల్లీ వెళ్లి భాజపా నేత, హోం మంత్రి అమిత్‌ షాను కలవగా, చన్నీ చేసిన నియామకాలు నచ్చక నవ్‌జ్యోత్‌ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. తరవాత చన్నీతో రాజీ కుదిరి పార్టీలోనే సిద్ధూ కొనసాగుతున్నారు.

కాంగ్రెస్‌లో 70 మందికిపైగా సీనియర్‌ నేతలను తోసిరాజని రాహుల్‌ విధేయులను పైకి తీసుకురావడానికి సోనియా కంకణం కట్టుకున్నారు. ఈ పని ఆమె ఏడాది క్రితమే మొదలుపెట్టారు. నిరుడు ఆగస్టులో 23 మంది అసమ్మతీయుల బృందం కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని లేఖ రాయడాన్ని తన నాయకత్వానికి సవాలుగా ఆమె పరిగణించారు. నెహ్రూ కుటుంబం కాంగ్రెస్‌లో అంతర్భాగంగా ఉండాలి తప్ప కేంద్ర భాగంగా వ్యవహరించకూడదని 23మంది గ్రూపు (జి23) తమ లేఖలో సూచించింది. జి23 సభ్యుడు గులాం నబీ ఆజాద్‌ తాజాగా రాసిన లేఖతో త్వరలో కాంగ్రెస్‌ కార్యవర్గాన్ని సమావేశపరచడానికి అధిష్ఠానం సమ్మతించింది. అంతకుముందు జి23 లేఖలో లేవనెత్తిన సమస్యల పరిశీలనకు సోనియా ఆరుగురు సభ్యులతో కమిటీ వేశారు. జి23 సభ్యుడైన ముకుల్‌ వాస్నిక్‌ను అందులో నియమించారు. దీన్ని ‘విభజించి పాలించు’ వ్యూహంలో భాగంగా పరిగణిస్తున్నారు. ఆర్థిక, విదేశాంగ, జాతీయ భద్రతా వ్యవహారాలపై పార్టీ విధానాల ఖరారుకు మూడు ప్రత్యేక కమిటీలను ఏర్పరచారు. వాటిలో ముగ్గురు జి23 అసమ్మతీయులు- గులాం నబీ ఆజాద్‌, ఆనంద్‌ శర్మ, శశి థరూర్‌లను నియమించారు. ఇలా కొందరికి తాయిలాలు పంచుతూనే జి23లో మరికొందరు సీనియర్‌ నేతలను పార్టీ పదవుల నుంచి సోనియా తప్పించారు. వారి స్థానంలో రాహుల్‌ విధేయులను నియమించసాగారు. ఈ ఏడాది ఆగస్టుకల్లా రాహుల్‌ అంతేవాసులతో కిక్కిరిసిపోయిన కాంగ్రెస్‌ అనుబంధ సంస్థలు, ఆయన్ను తిరిగి పార్టీ అధ్యక్షుడిగా నియమించాలని ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నాయి.

కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా ఈ ఆగస్టు పదోతేదీ నాటికి రెండేళ్లు పూర్తిచేసుకున్న సోనియా- ఈ ఏడాది చివరికల్లా ఆ పదవి నుంచి తప్పుకొంటానని స్పష్టంగా సూచించారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా రాహుల్‌ పునర్నియామకాన్ని వ్యతిరేకించేవారిలో కొందరిని తనవైపు తిప్పుకొన్నారు. అమరీందర్‌, గెహ్లోత్‌, బాఘెల్‌ల పట్ల కఠిన వైఖరిని అవలంబించిన సోనియా- కొందరు ముఖ్య నాయకులకు కీలక బాధ్యతలు అప్పగించారు. ప్రధాని నరేంద్ర మోదీ విధానాలకు వ్యతిరేకంగా దేశమంతటా ఉద్యమం నిర్వహించే బాధ్యతను దిగ్విజయ్‌కు అప్పగించారు. మధ్యప్రదేశ్‌లో రాహుల్‌ విధేయులు ఇప్పటికీ దిగ్విజయ్‌ని వ్యతిరేకిస్తున్నారు. ఆయన జిత్తులవల్లే జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌ను వీడి భారతీయ జనతా పార్టీలో చేరిపోయారని వారి ఆగ్రహం. కాంగ్రెస్‌లో వృద్ధ తరాన్ని తప్పించే వ్యూహంలో భాగంగా రాహుల్‌ 2017 ఏప్రిల్‌లో దిగ్విజయ్‌ను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించారు. ఇప్పుడు మళ్ళీ ఆయన్ను అధిష్ఠానం ఆదరిస్తోంది. గతంలో రాహుల్‌ను వ్యతిరేకించిన మల్లికార్జున ఖర్గే, కమల్‌ నాథ్‌ల మాదిరిగా దిగ్విజయ్‌నూ దగ్గరకు తీసుకొని మధ్యవర్తిత్వ పాత్ర అప్పగించనున్నారు. ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి బాఘెల్‌కు, ఆయన పదవిపై కన్నేసిన సింగ్‌దేవ్‌కు మధ్య రాజీ కుదర్చడానికి కమల్‌నాథ్‌ ప్రయత్నిస్తున్నారు. మరో వృద్ధ నేత పి.చిదంబరం గోవా ఎన్నికలకు కాంగ్రెస్‌ పరిశీలకుడిగా నియమితులయ్యారు. జి23లో భూపిందర్‌ సింగ్‌ హూడాకు రాహుల్‌ అంటే పడకపోయినా, ఆయనకూ ఓ కీలక పదవి అప్పగించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్వహిస్తున్న అమృతోత్సవానికి పోటీగా స్వాతంత్రోద్యమంలో కాంగ్రెస్‌ పాత్రను జనానికి గుర్తుచేసే కార్యక్రమాలు నిర్వహించే కమిటీలో హూడాతో పాటు గులాం నబీ ఆజాద్‌, ముకుల్‌ వాస్నిక్‌లనూ నియమించారు.

జి23లో మరో సభ్యుడు వీరప్ప మొయిలీ మూడు నెలలు తిరక్కుండానే ఆ బృందం నుంచి బయటికొచ్చి సోనియా నాయకత్వాన్ని సమర్థించారు. పార్టీని సంస్కరించడానికి సోనియా ఇప్పటికే చర్యలు మొదలుపెట్టడంతో ఇక జి23 అవసరమేమిటని ప్రశ్నించారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌(పీకే)ను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలపై విభేదిస్తున్నవారు సంస్కరణలకు వ్యతిరేకులని అభివర్ణించారు. కులగణనపై కాంగ్రెస్‌ నియమించిన కమిటీకి మొయిలీయే అధ్యక్షుడు. ‘సోనియాకు అహ్మద్‌ పటేల్‌ ఎలానో- రాహుల్‌ గాంధీకి ప్రశాంత్‌ కిశోర్‌ అలా’ అనే భావన పార్టీలో బలపడుతోంది. పీకే రాకను వృద్ధతరం నాయకులు వ్యతిరేకిస్తున్నారు. 2022 మొదట్లో రాహుల్‌ లాంఛనంగా పార్టీ పగ్గాలు చేపట్టేలోపే సోనియా కొన్ని ముఖ్యమైన నియామకాలు పూర్తిచేశారు. ప్రియాంకా గాంధీ, రణదీప్‌ సుర్జేవాలాలను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులుగా, కె.సి.వేణుగోపాల్‌ను సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా నియమించారు. మరోవైపు జి23లో కీలక నాయకుడైన కపిల్‌ సిబల్‌ ఇంటిపై కాంగ్రెస్‌ కార్యకర్తలు దాడి చేశారనే వార్తలు వచ్చాయి. దీన్ని ఆ గ్రూపు సభ్యులైన ఆనంద్‌ శర్మ, గులాం నబీ ఆజాద్‌, హూడా ప్రభృతులు తీవ్రంగా ఖండించారు. పార్టీలో రాహుల్‌గాంధీకి పట్టు కల్పించేందుకు శతవిధాలుగా సోనియా చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు సఫలీకృతమవుతాయన్నది ఆసక్తికరంగా మారింది.

పదవుల పందేరంలో సోనియా కదిపిన పావులు వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళనున్న పంజాబ్‌లో కలకలం రేపుతున్నాయి. అమరీందర్‌ తిరుగుబాటు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను దెబ్బతీసే అవకాశాలున్నాయని తెలిసినా సోనియా వెనక్కు తగ్గలేదు. అంతేకాదు, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌, ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్‌ బాఘెల్‌ మీదా కఠిన చర్యలు తీసుకొంటానని సంకేతాలు పంపుతున్నారు. నిజానికి అమరీందర్‌, గెహ్లోత్‌, బాఘెల్‌ ముగ్గురూ సోనియా విధేయులే. వారి ఏలుబడిలోని మూడు రాష్ట్రాల్లో రాహుల్‌ గాంధీ అనుయాయులైన నవ్‌జ్యోత్‌, సచిన్‌ పైలట్‌, టి.ఎస్‌.సింగ్‌దేవ్‌లను ఎదగనివ్వకుండా అణగదొక్కుతున్నారన్నది అధిష్ఠానం ఆగ్రహానికి కారణం.