Business

టాటా పంచ్ మోడల్ విడుదల-వాణిజ్యం

టాటా పంచ్ మోడల్ విడుదల-వాణిజ్యం

* ప్రస్తుతం అన్ని బ్యాంకులూ కాంటాక్ట్‌లెస్‌ డెబిట్‌, క్రెడిట్‌ కార్డులను అందిస్తున్నాయి. బిల్లు చెల్లించేటప్పుడు దుకాణదారుడి చేతికి ఇవ్వకుండానే రూ.5,000 లోపు బిల్లును అలా కార్డు యంత్రానికి (పీఓఎస్‌) కాస్త దగ్గరగా చూపించి చెల్లించేయొచ్చు. పిన్‌ నమోదు చేయాల్సిన అవసరమూ ఉండదు. కానీ, ఇక్కడే కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

* సాధారణ చిప్‌ కార్డుతో పోలిస్తే.. ఈ కాంటాక్ట్‌లెస్‌ కార్డు సురక్షితమే. మీ కార్డు మీ చేతిలోనే ఉంటుంది కాబట్టి, ఎవరూ దీన్ని క్లోన్‌ చేయడానికి అవకాశం ఉండదు. అయితే, దీన్ని ఇతరుల చేతికి ఇవ్వకూడదు.

* పొరపాటున కార్డు పోతే.. రూ.5,000 వరకూ ఎవరైనా దాన్ని ఉపయోగించుకునే వీలుంటుంది. అందుకే, గుర్తించిన వెంటనే కార్డును బ్లాక్‌ చేయాలి.

* బ్యాంకు ఆన్‌లైన్‌ ఖాతాలో లేదా అధీకృత యాప్‌ ద్వారా కాంటాక్ట్‌లెస్‌ కార్డును నియంత్రించవచ్చు. అవసరం లేదు అనుకుంటే.. దాన్ని ఆఫ్‌ చేయొచ్చు.

* కార్డు లావాదేవీలు చేసేందుకు ఉపయోగించే రహస్య సంఖ్యను ఎవరికీ చెప్పకూడదు. నాలుగు అంకెల పిన్‌కు బదులుగా ఆరు అంకెల పిన్‌ను ఉపయోగించడం శ్రేయస్కరం.

* మీ క్రెడిట్‌ కార్డు వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ తెలియనివ్వకండి. ముఖ్యంగా పండగల వేళ మీ కార్డులను అప్‌గ్రేడ్‌ చేసుకోవాల్సిందిగా కోరుతూ ఫోన్లు వస్తుంటాయి. ఇవన్నీ నిజం కాదు. నిజంగా బ్యాంకు అధికారులు ఎప్పుడూ ఖాతాదారులకు ఫోన్లు చేయరు. వెబ్‌సైట్లు లేదా ఇ-మెయిల్‌ ద్వారానే బ్యాంకులు సమాచారాన్ని అందిస్తాయి. మీ కార్డు చివరి నాలుగు అంకెలు చెప్పినంత మాత్రాన మీకు ఫోన్‌ చేసిన వారు నిజమైన బ్యాంకు అధికారులు కారు.

* దేశీయ ఆటోమొబైల్‌ తయారీ సంస్థ టాటా మోటార్స్‌ సరికొత్త మైక్రో ఎస్‌యూవీని ఆవిష్కరించింది. ఇప్పటికే ఈ కారుకు సంబంధించిన బుకింగ్స్‌ స్వీకరణను ప్రారంభించింది. ఇందుకోసం రూ. 21వేలు చెల్లించాల్సి ఉంది. ఏఎల్‌ఎఫ్‌ఏ ఏఆర్‌సీ ప్లాట్‌ఫామ్‌పై కంపెనీ చెందిన ఇంపాక్ట్‌ 2.0 డిజైన్‌ను వాడి తయారు చేశారు. ఈ పండుగల సీజన్‌లో ధరను ప్రకటించవచ్చు. వాస్తవానికి టాటా ప్రదర్శించిన 2020 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన హెచ్‌బీఎక్స్‌ కాన్సెప్ట్‌ లైన్‌లోనే ఈ కారు ప్రొడక్షన్‌ వెర్షన్‌ ఉంది. సరికొత్త పంచ్‌ కారు బేబీ సఫారీ లుక్స్‌లో ఆకర్షణీయంగా ఉంది.

* తీవ్ర ఆర్థిక కష్టాల్లో ఉన్న ఎవర్‌గ్రాండే సంస్థ రుణదాతలకు చెల్లింపుల కోసం తన ప్రాపర్టీ మేనేజ్‌మెంట్‌ వ్యాపారంలో మెజార్టీ వాటాను విక్రయించేందుకు ముందుకొచ్చింది. ఎవర్‌గ్రాండే ప్రాపర్టీ సర్వీసెస్‌ గ్రూప్‌లోని 51 శాతం వాటాను ఎవర్‌గ్రాండే విక్రయించనుందని చైనా మీడియా తెలిపింది. చైనా ప్రభుత్వ మద్దతు ఉన్న హాప్సన్‌ డెవలప్‌మెంట్‌ ఈ వాటాను సొంతం చేసుకునేందుకు 5 బిలియన్‌ డాలర్లు చెల్లించనుందని కథనాలు వెలువడుతున్నాయి.

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మరోసారి అదరగొట్టాయి. ఈ వారం ట్రేడింగ్‌ను లాభాలతో ఆరంభించాయి. నాలుగు రోజుల వరుస నష్టాల నుంచి కోలుకుని భారీగా దూసుకెళ్లాయి. సోమవారం నాటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 500 పాయింట్ల మేర లాభపడింది. ముఖ్యంగా రియల్టీ, మెటల్‌, పవర్‌ సెక్టార్‌ షేర్లు రాణించడంతో సూచీలు పరుగులు పెట్టాయి.

* ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత రెగ్యుల‌ర్‌గా ఆదాయం పొందేందుకు ఉన్న 10 పెట్టుబ‌డి మార్గాలు..

1. ఫిక్స్‌డ్ డిపాజిట్లు: బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌లో పెట్టుబ‌డులు సురక్షితంగా ఉండ‌టంతో పాటు క‌చ్చిత‌మైన రాబ‌డిని అందిస్తాయి. ప‌ద‌వీ విర‌మ‌ణ కోసం డ‌బ్బు దాచుకోవాల‌నుకుంటున్న వారికి ఇది స‌రైన ఆప్ష‌న్‌. ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై వ‌డ్డీ రేట్లు బ్యాంకుల‌ను బ‌ట్టి వేర్వేరుగా ఉంటాయి. ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ బ్యాంకుల‌తో పాటు పోస్టాఫీస్‌లు, బ్యాంకింగేత సంస్థ‌లు కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌ను ఆఫ‌ర్ చేస్తాయి. అయితే కార్పొరేట్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల రాబ‌డిపై ఎలాంటి హామీ ఉండ‌దు.

2. సీనియ‌ర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్: సీనియ‌ర్ సిటిజన్స్‌ సేవింగ్ స్కీమ్ (ఎస్‌సీఎస్ఎస్‌)లో పెట్టుబ‌డులు కేవ‌లం 60 ఏళ్ల త‌ర్వాత‌నే ప్రారంభించాలి. వాలంట‌రీ రిటైర్మెంట్‌ స్కీమ్ కింద ప‌ద‌వీ విర‌మ‌ణ తీసుకున్న‌వారు 55 సంవ‌త్స‌రాల నుంచే ప్రారంభించొచ్చు. ఒక‌రు లేదా ఉమ్మ‌డిగా ఈ ఖాతాలో గ‌రిష్ఠంగా రూ.15 ల‌క్ష‌లు వ‌ర‌కు డిపాజిట్ చేయొచ్చు. సెక్ష‌న్ 80సీ కింద దీనిపై ప‌న్ను మిన‌హాయింపులు ల‌భిస్తాయి. అక్టోబ‌ర్-డిసెంబ‌ర్ త్రైమాసికంలో దీనిపై వ‌డ్డీ రేట్లు 7.4 శాతంగా ఉండ‌నున్నాయి.

3. పోస్టాఫీస్ నెల‌వారీ ఆదాయ స్కీమ్: ప్ర‌స్తుత వ‌డ్డీ రేటు 6.6 శాతం. దీనికి మెచ్యూరిటీ గ‌డువు 5 సంవ‌త్స‌రాలు. వ్య‌క్తిగ‌త ఖాతాలో అయితే గ‌రిష్ఠంగా రూ.4.5 ల‌క్ష‌లు, ఉమ్మ‌డి ఖాతాలో అయితే రూ.9 లక్ష‌లు పెట్టుబ‌డులు పెట్టొచ్చు. అయితే దీనిపై ప‌న్ను రేట్లు వ‌ర్తిస్తాయి.

4. నెలవారీ ఆదాయ ప్ర‌ణాళిక‌లు: ఎంఐపీ పెట్టుబ‌డులు ఎక్కువ‌గా డెట్ ఫండ్ల‌లోకి చేర‌తాయి. పెట్టుబ‌డులు సుర‌క్షితంగా ఉండేందుకు ప‌ద‌వీ విర‌మ‌ణ పొందేవారికి ఇది స‌రైన ఆప్ష‌న్. రిస్క్ త‌క్కువగా ఉండ‌టంతో పాటు లిక్విడిటీ ఎక్కువ‌గా ఉంటుంది. రెగ్యుల‌ర్‌గా డివిడెండ్ల‌ను అందిస్తుంది. ఎవ‌రైతే తాము క‌ష్ట‌ప‌డి సంపాదించిన డ‌బ్బును ఎటువంటి రిస్క్ లేకుండా సుక్షితంగా దాచుకొని నెల‌వారీ కొంత ఆదాయం పొందాల‌నుకుంటున్నారో వారికి ఇది స‌రైన మార్గం.

5. ఈక్విటీ పెట్లుబ‌డులు: రిటైర్మెంట్ కోసం ప్ర‌ణాళిక వేసేవారు మ్యూచువ‌ల్ ఫండ్ల ద్వారా లేదా నేరుగా ఈక్విటీల‌లో పెట్టుబ‌డులు పెట్టొచ్చు. మొద‌టిసారిగా మదుపు చేసేవారు మ్యూచువ‌ల్ ఫండ్ల ద్వారా పెట్ట‌డం మేలు. రిస్క్ తీసుకునే శాతాన్ని బ‌ట్టి ఈక్విటీ కేటాయింపులు ఉంటాయి. అయితే 20 నుంచి 25 శాతం వర‌కు ప‌ద‌వీ విర‌మ‌ణ నిధిని ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెడితే లాభాల‌ను పొందొచ్చు.

6. మ్యూచువ‌ల్ ఫండ్లు: మ్యూచువ‌ల్ ఫండ్లు.. నిపుణులు నిర్వ‌హ‌ణ‌లో ఉండ‌టంతో ఇవి చాలా సుర‌క్షిత‌మైన‌విగా చెప్పుకోవ‌చ్చు. మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో క్ర‌మానుగ‌తంగా విత్‌డ్రా చేసుకునే స‌దుపాయాన్ని (ఎస్‌డ‌బ్ల్యూపీ) ఎంచుకుంటే గ‌డువు పెరిగిన కొద్దీ ఆదాయం పెరుగుతూ వ‌స్తుంది. ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్లు అధిక ద్ర‌వ్యోల్బ‌ణాన్ని కూడా త‌ట్టుకొని దీర్ఘ‌కాలానికి మంచి లాభాల‌ను అందిస్తాయి. ఎస్‌డబ్ల్యూపీలో ఒకేసారి ఎక్కువ మొత్తంలో పెట్టుబ‌డుల‌కు వీలుండ‌దు. వాయిదాల ప‌ద్ధతిలో డిపాజిట్ చేస్తుండాలి. ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత నెల‌వారీ విత్‌డ్రా చేసుకోవాలి.

7. పీపీఎఫ్‌: పీపీఎఫ్ పెట్టుబ‌డులపై పూర్తిగా ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది. అస‌లు, వ‌డ్డీ రెండింటిపై ప‌న్ను ఆదా చేసుకోవ‌చ్చు. వార్షికంగా 7.1 శాతం వ‌డ్డీ ల‌భిస్తుంది. ఈ ప‌థకంలో గ‌రిష్ఠంగా సంవ‌త్స‌రానికి రూ. 1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు పెట్టుబ‌డి పెట్టొచ్చు. ఖాతా నిర్వ‌హ‌ణ కోసం వార్షికంగా క‌నీసం రూ.500 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. పోస్టాఫీసులు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)లో మాత్ర‌మే కాకుండా కొన్ని ప్రైవేట్ రంగ బ్యాంకుల‌లోనూ పీపీఎఫ్ ఖాతాను తెర‌వొచ్చు. పీపీఎఫ్ ఖాతాకు 15 సంవ‌త్స‌రాల కాల‌ప‌రిమితి ఉంటుంది. కాల‌ప‌రిమితి పూర్తయిన అనంత‌రం కూడా 5 ఏళ్ళ చొప్పున ఖాతాను కొన‌సాగించొచ్చు.

8. ప‌న్ను ర‌హిత బాండ్లు: మార్కెట్‌లో చాలా ప‌న్ను ర‌హిత బాండ్లు అందుబాటులో ఉన్నాయి. ప‌ద‌వీ విర‌మ‌ణ నిధి కోసం పొదుపు చేస్తున్న‌వారికి క‌చ్చిత‌మైన రాబ‌డితో పాటు, పన్ను మిన‌హాయింపు ల‌భిస్తుంది. అయితే ఇందులో లిక్విడిటీ స‌దుపాయం త‌క్క‌వ‌గా ఉంటుంది. లాక్‌-ఇన్ పీరియడ్‌ కాలం ఎక్కువ‌ ఉంటుంది కాబ‌ట్టి, ఏదైనా అత్య‌వ‌స‌ర స‌మ‌యంలో నిధిని తీసుకోవ‌డం క‌ష్ట‌త‌ర‌మ‌వుతుంది. దీనిలో పెట్టుబ‌డుల‌కు కొంత ఆలోచించాల్సి ఉంటుంద‌ని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

9. జాతీయ పింఛ‌ను విధానం: ఉద్యోగులు ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌ర‌కు ఇందులో పెట్టుబ‌డులు చేస్తే ఆ త‌ర్వాత రెగ్యుల‌ర్‌గా పెన్ష‌న్‌ పొందేందుకు వీలుంటుంది. ప‌ద‌వీ విర‌మ‌ణ స‌మ‌యంలో ఉద్యోగులు 60 శాతం విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. మిగ‌తా 40 శాతాన్ని యాన్యుటీగా ఉప‌యోగిస్తారు. దీనిపై మ‌రో రూ.50 వేల‌ వ‌ర‌కు అద‌నంగా ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది.

10. యాన్యుటీ ప్లాన్స్: యాన్యుటీ ప్లాన్‌లు దీర్ఘకాలానికి స‌రిప‌డేవి. దీనిపై ప‌న్ను వ‌ర్తిస్తుంది. ఇందులో ఒకేసారి ఎక్కువ మొత్తం చెల్లించ‌కుండా, రెగ్యుల‌ర్ చెల్లింపుల‌కు అవ‌కాశ‌ముంటుంది. యాన్యుటీ ప్లాన్‌లు రెండు ర‌కాలు. డిఫ‌ర్డ్‌ యాన్యుటీ, ఇమ్మీడియ‌ట్ యాన్యుటీ ప్లాన్‌లు. డిఫ‌ర్డ్ యాన్యుటీలో ఒకేసారి ఎక్క‌వ మొత్తంలో లేదా రెగ్యుల‌ర్‌గా డిపాజిట్ చేసుకోవ‌చ్చు. ప్రీమియం చెల్లింపు గ‌డువు ముగిసిన‌ త‌ర్వాత లేదా మెచ్యూరిటీ త‌ర్వాత పెన్ష‌న్ రావ‌డం ప్రారంభ‌మ‌వుతుంది. ఇమ్మీడియ‌ట్ యాన్యుటీ ప్లాన్‌ల‌లో ఎక్కువ మొత్తంలో ఒకేసారి పెట్టుబ‌డులు పెట్టొచ్చు. పెన్ష‌న్ కూడా అప్ప‌టి నుంచే వ‌స్తుంది. మదుపు చేసిన మొత్తంపై ఆధార‌ప‌డి పెన్ష‌న్ ల‌భిస్తుంది.