Agriculture

రైతులకు “సుప్రీం” ప్రశ్నలు

రైతులకు “సుప్రీం” ప్రశ్నలు

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై ఇప్పటికే స్టే విధించామని.. అవి అమలులో లేనప్పుడు ఈ నిరసనలు తెలియజేయడం ఏమిటని భారత అత్యున్నత న్యాయస్థానం రైతు సంఘాలను ప్రశ్నించింది. అంతేకాకుండా సాగు చట్టాల చెల్లుబాటును సవాలు చేస్తూ కోర్టును ఆశ్రయించిన అనంతరం మళ్లీ నిరసనలు చేస్తామనే ప్రశ్న ఎందుకు ఉత్పన్నమవుతోందని అడిగింది. సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ దిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద శాంతియుత ‘సత్యాగ్రహం’ చేపట్టేందుకు అనుమతి ఇచ్చేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ రైతు సంఘాలు సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాయి. వీటిని విచారణను చేపట్టిన జస్టిస్‌ ఏఎం ఖాన్విల్కర్‌, జస్టిస్‌ సీటీ రవికుమార్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

రైతు సంఘాలు వేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగా ఉత్తరప్రదేశ్‌ లఖింపుర్‌ ఖేరీలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనను అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ కోర్టు ముందు ప్రస్తావించారు. దీనిపై స్పందించిన సుప్రీం ధర్మాసనం.. అలాంటి ఘటనలు జరిగినప్పుడు మాత్రం ఎవ్వరూ బాధ్యత వహించరని అభిప్రాయపడింది. ఏదైనా విషయంపై ఒకసారి అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన తర్వాత.. మళ్లీ అదే సమస్యపై వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలియజేస్తామంటే వీలుకాదని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కోర్టుకు విన్నవించారు. వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం ఈ కేసు తదుపరి విచారణ అక్టోబర్‌ 21న చేపడుతామని పేర్కొంది. వీటితో పాటు వ్యవసాయ చట్టాల చెల్లుబాటును సవాలు చేస్తూ రాజస్థాన్‌ హైకోర్టులో రైతు సంఘాలు దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా తమకే బదిలీ చేసుకొని విచారిస్తామని సుప్రీం ధర్మాసనం పేర్కొంది.

ఇదిలాఉంటే, వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు గడిచిన 11 నెలలుగా దిల్లీ సరిహద్దులో ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. తాజాగా దిల్లీ నగరంలో జంతర్‌ మంతర్‌ వద్ద శాంతియుత సత్యాగ్రహం చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో కనీసం 200 మంది రైతులు పాల్గొనేందుకు అవసరమైన స్థలానికి అనుమతి ఇచ్చేలా అధికారులను ఆదేశించాలంటూ ‘కిసాన్‌ మహాపంచాయత్‌’ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.