Business

TVS-TATA భాగస్వామ్యం-వాణిజ్యం

TVS-TATA భాగస్వామ్యం-వాణిజ్యం

* టీవీఎస్‌ మోటార్స్‌ – టాటా పవర్‌ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. ఈ ఎంవోయూ ప్రకారం దేశ వ్యాప్తంగా విద్యుత్తు వాహనాల ఛార్జింగ్‌ వ్యవస్థల వృద్ధి కోసం ఇరు కంపెనీలు కలిసి పనిచేస్తాయి. టీవీఎస్‌ మోటార్స్ సంస్థల ప్రాంగాణాల్లో సౌరశక్తితో విద్యుత్తు ఉత్పత్తి ఏర్పాట్లు చేయనున్నారు. భారత్‌లో విద్యుత్తు వాహనాల ఉత్పత్తిని వేగవంతం చేయడం కోసం భారీగా మౌలిక సదుపాయాలు కల్పించడమే ఈ ఒప్పందం ముఖ్య లక్ష్యం.

* సోమవారం సామాజిక మాధ్యమాలు ఫేస్‌బుక్‌, వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ స్తంభించిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఫేస్‌బుక్ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ సంపద కొన్ని గంటల వ్యవధిలోనే 7 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.52 వేల కోట్లు) తరిగిపోయింది. దీంతో ఆయన బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్స్‌ జాబితాలో మూడు నుంచి ఐదో స్థానానికి పడిపోయారు. ప్రస్తుతం ఆయన సంపద 122 బిలియన్‌ డాలర్లుగా ఉంది.

* చైనా ‘రియల్‌’ ప్రకంపనలు మొదలయ్యాయి.. ఇప్పటికే ఎవర్‌గ్రాండె దాదాపు 300 బిలియన్‌ డాలర్ల అప్పులు ఎగ్గొట్టే దిశగా అడుగులు వేస్తుండగా.. ఇప్పుడు దానికి ఫాంటాసియా అనే రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ తోడైంది. తాను కూడా బాండ్లపై చెల్లింపులు చేయలేనని చేతులెత్తేసింది. దీంతో చైనాలో రియల్‌ ఎస్టేట్‌ రంగం తీవ్ర కష్టాల్లో ఉన్న విషయం వెలుగులోకి వస్తోంది. ఇదే నిజమైతే చైనా వృద్ధిరేటు దారుణంగా దెబ్బతినే ప్రమాదం ఉంది.

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం భారీ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల మధ్య ఉదయం నష్టాలతో ట్రేడింగ్‌ ప్రారంభించిన సూచీలు మధ్యాహ్నం వరకు అదే బాటలో పయనించాయి. ఆ తర్వాత ఐరోపా మార్కెట్లు సానుకూలంగా ప్రారంభం కావడంతో సూచీలకు అండ లభించింది. పైగా గతవారపు గరిష్ఠాల నుంచి సూచీలు కిందకు రావడాన్ని అవకాశంగా భావించిన మదుపర్లు కొన్ని కీలక రంగాల్లో కొనుగోళ్లకు మొగ్గుచూపారు. మరోవైపు దేశీయంగా రెండో త్రైమాసికం ఫలితాలు రానుండడంతో మదుపర్లు ఉత్సాహంగా కనిపిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో నేడు సూచీలు ఉదయపు నష్టాల నుంచి భారీ లాభాల్లోకి ఎగబాకాయి.