DailyDose

ఏపీ హైకోర్టు ఎదుట కిరోసిన్ పోసుకున్న దంపతులు-నేరవార్తలు

ఏపీ హైకోర్టు ఎదుట కిరోసిన్ పోసుకున్న దంపతులు-నేరవార్తలు

* ములుగు జిల్లా,ఏటూరునాగారం మండలం, శివాపురం గ్రామంలో లో రైతు పొలం వద్ద వైర్లు తెగి పడిందన్న సమాచారంతో విద్యుత్ అధికారుల కట్టర్ కు సమాచారం అందించారు. ఐతే కట్టర్ వెళ్లకుండా అదే గ్రామానికి చెందిన గౌతమ్ ను పంపించాడు. కరెంటు వైర్లు జాయింట్ చేసే క్రమంలో గౌతమ్ కు కరెంటు షాక్ కొట్టింది. దీంతో అతను అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. వెంటనే ఏటూరునాగారం సామాజిక ఆసుపత్రి కి తరలించగా పరిక్షించిన వైద్యులు గౌతమ్ మృతి చెందాడని తెలిపారు.

* హైకోర్టు ఉత్తర్వులిచ్చినా తమ స్థలం విషయంలో కొందరు బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ దంపతులు హైకోర్టు ఎదుట సోమవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గుంటూరు జిల్లా ధూళిపాళ్లకు చెందిన భార్యాభర్తలు చీలికోటి దేవేంద్రరావు, భానుశ్రీ కలిసి కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశారు. వెంటనే స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఎస్‌పిఎఫ్‌) అప్రమత్తం అవ్వడంతో ప్రమాదం తప్పింది. వారి నుంచి కిరోసిన్‌ డబ్బాను లాక్కున్నారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తళ్లూరు పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ధూళిపాళ్లలోని స్థలంలో 1997 నుంచి నివాసం ఉంటున్నామని, 2003లో ప్రభుత్వం పట్టా ఇచ్చిందని, ఆ స్థలంలో బస్టాండ్‌ కట్టేందుకు ప్రయత్నాలకు వ్యతిరేకంగా హైకోర్టులో కేసు వేస్తే తమకు అనుకూలంగా ఉత్తర్వులు వెలువడ్డాయని వారు చెప్పారు. కానీ కొందరు రాజకీయ నాయకులు హైకోర్టు ఉత్తర్వులు చెల్లవని, 10 రోజుల్లో స్థలం ఖాళీ చేయకపోతే తమ కుటుంబ సభ్యులకు హాని తలపెడతామని బెదిరిస్తున్నారని చెప్పారు.

* రెడ్డిగూడెం మండల పరిధిలోని మద్దులపర్వ గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ బోల్తా పడింది. రెడ్డిగూడెం వైపునుండి విస్సన్నపేట వైపు వెళ్తున్న కట్టెల లోడు లారీ రోడ్డుపై ఉన్న ప్రమాదకరమైన గోతులు కారణంగా అదుపుతప్పి ప్రక్కనే ఉన్న పంట పొలాల్లో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు. ఇప్పుడు ప్రమాదం జరిగిన ప్రాంతం అత్యంత ప్రమాదభరితంగా ఉన్నదని గతంలోనే ప్రజాశక్తి దినపత్రికలో ఒక కథల రూపంలో వచ్చింది. రెడ్డి గూడెం నుండి విస్సన్నపేట వెళ్లేందుకు ఈ రహదారి తప్ప వేరే మార్గం లేక పోవటం వలన అత్యవసరంగా ఈ రోడ్డుకు మరమ్మతులు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. సోమవారం నాడు జరిగిన ప్రమాదంలాంటివి ఇంకా జరిగే అవకాశం ఉన్నందున పాక్షికంగా అయినా మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

* తెలుగు అకాడమీ డిపాజిట్ల గోల్ మాల్ కేసులో ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది. దర్యాప్తులో భాగంగా తెలుగు అకాడమీ అధికారి రమేశ్‌, చందానగర్ శాఖ కెనరా బ్యాంకు అధికారులు, ఇతరులను సీసీఎస్‌ పోలీసులు ప్రశ్నించారు. చిన్నమొత్తంలో నగదు చెల్లించే సందర్భాల్లోనూ సంతకాలను పోల్చుకునే బ్యాంకు సిబ్బంది.. తెలుగు అకాడమీ నిధుల విషయంలో ఎందుకు నిర్లిప్తత వహించారని కెనరా బ్యాంకు అధికారులను ప్రశ్నించారు. డిపాజిట్‌ చేసిన ఖాతాకు కాకుండా మరో ఖాతాకు ఎలా బదిలీ చేశారని బ్యాంకు అధికారులను సీసీఎస్ పోలీసులు ప్రశ్నించారు. కేవలం లేఖల ఆధారంగా కోట్ల రూపాయల నగదును వేరే బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించడాన్ని బ్యాంకు అధికారుల వద్ద పోలీసులు ప్రస్తావించారు. తెలుగు అకాడమీ అధికారుల పేరుతో వచ్చిన లేఖలను నమ్మి డిపాజిట్లను అగ్రసేన్ బ్యాంకులోని ఏపీ మర్కంటైల్ సొసైటీ ఖాతాలోకి జమ చేసినట్లు కెనరా బ్యాంకు అధికారులు తెలిపారు. రూ.63 కోట్లు డిపాజిట్ చేసినప్పుడు కనీసం బ్యాంకుకు వెళ్లకుండా కేవలం ఏజెంట్ల మీద ఎందుకు ఆధారపడ్డారని తెలుగు అకాడమీ అకౌంట్స్ అధికారి రమేశ్‌ను ప్రశ్నించారు. కెనరా బ్యాంకు అధికారులు చెప్పిన వివరాల ఆధారంగా అకాడమీ అధికారుల సంతకాలు ఫోర్జరీ జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. బ్యాంకుల్లో డిపాజిట్లు చేయించే ఏజెంట్లు ఈ మోసానికి తెరలేపారా? లేకపోతే వీళ్ల వెనక ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో సీసీఎస్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

* దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసుకు సంబంధించి సిర్పూర్కర్‌ కమిషన్‌ విచారణ కొనసాగుతోంది. ఎన్‌కౌంటర్‌ జరిగిన స్థలంలో సేకరించిన ఆధారాల గురించి క్లూస్ టీం అధికారి వెంకన్నను కమిషన్ ప్రశ్నించింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ నిబంధనల ప్రకారం వ్యవహరించారా? లేదా? అని వెంకన్నను అడిగింది. ఎన్ కౌంటర్ జరిగిన స్థలానికి సంబంధించిన రఫ్ స్కెచ్‌ను వెంకన్న కమిషన్‌కు సమర్పించారు. సంఘటనా స్థలంలో రఫ్ స్కెచ్ గీశారా అని కమిషన్ ప్రశ్నించగా.. అక్కడ ఎక్కువగా జనాలు ఉండటంతో ఫొటోలు తీసుకొని కంప్యూటర్‌పై మ్యాప్ తయారు చేసినట్లు చెప్పారు. వెంకన్నను విచారించిన అనంతరం కేర్ ఆస్పత్రి వైద్యులను కమిషన్ విచారించనుంది. నిందితులు ఆరిఫ్, చెన్నకేశవులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. గాయపడ్డ పోలీసులను గచ్చిబౌలిలోని కేర్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. పోలీసులకు అయిన గాయాలు, అందించిన చికిత్స గురించి ఆస్పత్రి వైద్యులను కమిషన్ ప్రశ్నించనుంది.