Politics

ఆడపిల్లలకు అద్భుత పథకం ప్రారంభించిన సీఎం జగన్

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో 7 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న దాదాపు 10లక్షల మంది విద్యార్థినులకు ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్ల అందించనున్నట్లు సీఎం జగన్‌ వెల్లడించారు. పీఅండ్‌జీ, హైజీన్‌ అండ్‌ హెల్త్‌కేర్‌, నైన్‌ కంపెనీకి చెందిన బ్రాండెడ్‌ శానిటరీ న్యాప్‌కిన్లను ప్రతి విద్యార్థినికి నెలకు 10 చొప్పున ఏడాదికి 120 ఇస్తామని తెలిపారు. వేసవి సెలవులకు సరిపడా సెలవులకంటే ముందే ఒకేసారి పాఠశాలల్లోనే పంపిణీ చేయనున్నట్లు వివరించారు. ఇందుకుగాను ఏడాదికి రూ.32 కోట్లు వ్యయమవుతుందన్నారు. గ్రామస్థాయిలోని మహిళలకు అందుబాటులో ఉండేలా తక్కువ ధరకే చేయూత దుకాణాల్లోనూ విక్రయిస్తామని చెప్పారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ‘స్వేచ్ఛ’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి మంగళవారం ప్రారంభించారు. అనంతరం స్వేచ్ఛ పోస్టరును విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ‘మహిళలు, కిశోర బాలికల ఆరోగ్యం, పరిశుభ్రతే ధ్యేయంగా స్వేచ్ఛ కార్యక్రమాన్ని అమలుచేస్తున్నాం. దేశంలో దాదాపు 23% మంది విద్యార్థినులు పాఠశాల మానేయడానికి రుతుక్రమం సమయంలో ఎదురవుతున్న ఇబ్బందులే కారణమని యునైటెడ్‌ వాటర్‌సప్లై అండ్‌ శానిటేషన్‌ కొలాబరేటివ్‌ కౌన్సిల్‌ నివేదిక చెబుతోంది. ఈ పరిస్థితి మారాలనే ఉద్దేశంతో చర్యలు తీసుకుంటున్నాం. రుతుక్రమానికి సంబంధించిన అంశాలు, పిల్లలు ఎదుర్కొనే సమస్యలు, వాటి పరిష్కారాల గురించి మాట్లాడుకోవడం తప్పు అనే ఆలోచన మారాలి’ అని సూచించారు.