Politics

తితిదే బోర్డులో 14మంది నేరచరితులు. TSHCలో రఘురామ మరో పిటీషన్-నేరవార్తలు

తితిదే బోర్డులో 14మంది నేరచరితులు. TSHCలో రఘురామ మరో పిటీషన్-నేరవార్తలు

* తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో నేర చరితులను సభ్యులుగా నియమించారని హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. ఈ పిటిషన్​పై వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను వాయిదా వేసింది.  బోర్డు సభ్యుల్లోని 24 మందిలో 14 మంది సభ్యులపై నేరచరిత్ర ఉందని పిటిషనర్‌ తెలిపారు. నలుగురిని రాజకీయ ప్రాధాన్యతతో నియమించారని పిటిషనర్‌ ఆరోపించారు. 14 మంది సభ్యులను ఇంప్లీడ్‌ చేయాలని పిటిషనర్‌ తరుపు న్యాయవాది అశ్వినీకుమార్‌ ధర్మాసనానికి వాదనలు వినిపించారు. 14 మంది సభ్యులకు నోటీసులు ఇచ్చిన హైకోర్టు ధర్మాసనం తదుపరి విచారణను దసరా సెలవుల తర్వాతకు వాయిదా వేసింది.

* రాష్ట్ర ప్రభుత్వం మధ్య నిషేధం కోసం కృషి చేస్తుండగా దానికి విరుద్ధంగా రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల కార్ల డ్రైవర్లు మద్యం సేవించి ప్రమాదకరంగా డ్రైవింగ్ చేస్తూ అధికారుల ప్రాణాలకు. ప్రజల ప్రాణాలకు భద్రత లేకుండా ప్రవర్తించడం ఆందోళన కలిగిస్తుంది. నిధులు కొరత లేమి వల్ల ప్రభుత్వ డ్రైవర్ల ఖాళీలు భర్తీ లేకుండా కాంట్రాక్టు విధానంలో అరకొర జీతాలతో డ్రైవర్లను నియమించుకుని అధికారుల ప్రాణాలకు పణ్ణఅంగా పెట్టడం ఆందోళన కలిగిస్తోంది. రెండేళ్ల క్రితం రాజమండ్రి కార్పొరేషన్లో ఎలక్ట్రికల్ కార్లను ప్రవేశపెట్టి ప్రైవేటు వ్యక్తులను డ్రైవర్లను నియమించుకున్నారు. అయితే వీరికి ఎటువంటి ప్రభుత్వ నియమ, నిబంధనలు క్రమశిక్షణ, జవాబుదారితనం లేకపోవడంతో ఇష్టారాజ్యంగా ప్రవర్తించడంపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. డైవర్లు డ్యూటీలో ఉండగా మద్యం సేవించడం , అధికారులను పలు కార్యక్రమాలకు తీసుకెళ్లి, తీసుకురావడం మామూలే. అయితే అధికారులకు డ్యూటీ లేనప్పుడు, డ్యూటీ ముగిసిన తర్వాత సంబంధిత కార్లను కార్పొరేషన్ ఆవరణలో నిలిపి ఉంచాల్సి ఉంది . డ్రైవర్లు అందుకు విరుద్ధంగా అధికారుల అనుమతి లేకుండా, వారి ప్రైవేట్ అవసరాలకు తీసుకెళ్తూ రోడ్లపై ప్రమాదకరంగా రేష్ డ్రైవింగ్ చేస్తూ, కార్లను ప్రమాదాలకు గురి చేయడంతో పాటు ప్రజలను గాయాలపాలు చేస్తుండడం వీరికి నిత్యకృత్యంగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఒక డ్రైవర్ మద్యం సేవించి కారు నడపడం తో ఒక అధికారి అతన్ని డ్యూటీ నుంచి తప్పించడం జరిగింది. ఈ సంఘటనను గుణపాఠంగా తీసుకోకుండా అధికారులు, డ్రైవర్లు ఇరువర్గాలు ఉదాసీనంగా వ్యవహరించడం పై విమర్శలు వస్తున్నాయి . మరో డ్రైవర్ అదే నిర్లక్ష్యంతో ఈ నెల నాలుగో తేదీ సాయంత్రం AP39AD6170 నెంబర్ గల కారు నడుపుతున్న డ్రైవర్ మద్యం సేవించి, రేష్ డ్రైవింగ్ చేస్తూ, రద్దీగా ఉండే రాజా థియేటర్ వద్ద రోడ్డుకు అడ్డంగా ఉన్న బారికేడ్లను, ప్లాస్టిక్ డ్రమ్స్ లను ఢీకొట్టి కారుకు నష్టం కలిగించడం జరిగింది. మద్యం సేవించిన డ్రైవర్ పరిస్థితి గమనించిన స్థానిక ప్రజలు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు లేదంటే ప్రాణ నష్టం జరిగి ఉండేదని స్థానికులు భయాందోళన వ్యక్తం చేశారు. ప్రమాదానికి గురైన కారు ను గుట్టుచప్పుడు కాకుండా మరమ్మతులు చేయించారని ,ప్రమాద సంఘటన పై అధికారులకు సమాచారం ఇవ్వ లేదని విమర్శలు వస్తున్నాయి. డ్రైవర్లు మద్యం సేవించి ప్రభుత్వ వాహనాల్లో అధికారులను తీసుకు వెళ్లడం పలు విమర్శలు వస్తున్నాయి. కాంటాక్ట్ డ్రైవర్ల పై చర్యలు తీసుకునే అధికారం లేకపోవడంతో అధికారులు సైతం ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోలేక పోతున్నారని తెలుస్స్తోంది గతంలో ఒక డ్రైవర్ ను మద్యం సేవించడనే కారణంతో డ్యూటీ నుండి తీసివేయగా, ఒక ప్రజా ప్రతినిధి అధికారులకు ఫోన్ చేసి ఆ డ్రైవర్ను డ్యూటీ లోకి తీసుకోవాలని సిఫార్సు చేయడంతో రాజకీయ అండతో డ్రైవర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని కార్పొరేషన్ అధికారి ఒకరు వాపోయారు. అధికారుల ప్రాణాలకు ప్రజల ప్రాణాలకు ప్రమాదకరంగా డ్రైవింగ్ చేస్తున్న మద్యం డ్రైవర్ల పై చర్యలు తీసుకోవాలని, అధికారుల సక్రమంగా పర్యవేక్షణ చేయాలని ప్రజలు ప్రజా సంఘాలు కోరుతున్నాయి.

* తెలుగు అకాడమీ నిధుల స్కాం కేసులో 10 మందిని అరెస్ట్ చేసినట్టు సీపీ అంజనీకుమార్ వెల్లడించారు. యూనియన్ బ్యాంక్ ద్వారా సెప్టెంబర్ 27న ఫిర్యాదు వచ్చిందన్నారు. ఈ స్కాంలో మూడు కేసులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి విచారించామన్నారు. రూ.64.50 కోట్ల వరకు నిధుల గోల్‌మాల్ జరిగిందని సీపీ అంజనీకుమార్ వెల్లడించారు. డిసెంబర్ నుంచి ఇప్పటివరకు విడతలుగా నిధులను డ్రా చేశారన్నారు. అకాడమీ అకౌంట్స్ ఆఫీసర్ రమేష్, చందానగర్ కెనరా బ్యాంక్ మేనేజర్ సాధన, రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకటకోటి సాయికుమార్‌లను అరెస్ట్ చేసినట్టు సీపీ వెల్లడించారు. ఈ స్కాంలో సాయికుమార్ ప్రమేయం చాలా కీలకంగా ఉందన్నారు. 2015 ఏపీ హౌసింగ్ బోర్డ్ స్కాంలో సాయికుమార్‌ను సీఐడీ విచారించిందన్నారు. రూ.25 కోట్ల మోసం కేసులో సాయికుమార్‌ను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారని సీపీ వెల్లడించారు.

* పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎక్లాస్‌పూర్‌ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బెల్లంపల్లి నుంచి హనుమకొండకు వెళ్తున్న పరకాల డిపో బస్సు కారును ఢీకొని అదుపు తప్పి రోడ్డు పక్కన లోయలో పడింది. ప్రమాదంలో కారులో ఉన్న ఖాన్‌సాయిపేటకు చెందిన వినీత్‌ అనే వ్యక్తి మృతిచెందాడు. బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్రగాయాలయ్యాలు కాగా 16 మంది స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

* జగన్ బెయిల్ రద్దు చేయాలని తెలంగాణ హైకోర్టులో రఘురామ పిటిషన్. విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని రఘురామ పిటిషన్. హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన వైకాపా ఎంపీ రఘురామ. సీబీఐ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్.