Business

“బండ” బాదుడు-వాణిజ్యం

“బండ” బాదుడు-వాణిజ్యం

* సామాన్యులపై మరో పిడుగు పడింది. ఓవైపు పెట్రోల్‌, నిత్యావసరాల ధరలు మోత మోగుతున్న వేళ గ్యాస్‌ సిలిండర్‌ ధరలు మళ్లీ పెరిగాయి. ఒక్కో సిలిండర్‌పై రూ.15 పెంచుతున్నట్లు బుధవారం చమురు సంస్థలు ప్రకటించాయి. పెంచిన ధరలు నేటి నుంచే అమలులోకి రానున్నట్లు వెల్లడించాయి. ఎల్పీజీ సిలిండర్ల ధరలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా ఉంటాయి. దేశ రాజధాని దిల్లీలో 14.2కేజీల రాయితీ లేని సిలిండర్‌ ధర ₹899.50 పలుకుతోంది. ఐదు కేజీల సిలిండర్‌ ధర కూడా ₹502కు పెంచుతూ ఆయిల్‌ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. 2021లోనే ₹205 వరకు గ్యాస్‌ సిలిండర్‌ ధర పెరిగింది…!!

* రైల్వే ఉద్యోగులకు కేంద్రం తీపికబురు చెప్పింది. నాన్‌ గెజిటెడ్‌ రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనాన్ని ఈ ఏడాది బోనస్‌గా ఇవ్వాలని నిర్ణయించింది. కేంద్ర కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల 11.56 లక్షల మంది ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. ప్రభుత్వ ఖజానాపై రూ.1985 కోట్ల మేర భారం పడనుంది. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశంలో బుధవారం ఈ నిర్ణయం తీసుకున్నారు. రైల్వే ఉద్యోగులకు బోనస్‌ సహా పలు అంశాలను ఈ భేటీలో చర్చించారు. కేబినెట్‌ భేటీ అనంతరం కేంద్రమంత్రులు అనురాగ్‌ ఠాకూర్‌, పీయూష్‌ గోయాల్‌ మీడియా సమావేశంలో కేబినెట్‌ నిర్ణయాలను వెల్లడించారు.

* భారత్‌లో రిలయన్స్‌ జియో మొబైల్‌ నెట్‌వర్క్‌ వాడుతోన్న వినియోగదారుల సేవలకు ఈ రోజు కొద్దిసేపు అంతరాయం ఎదురయినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ‘డౌన్‌డిటెక్టర్‌’ వెల్లడించింది. నెట్‌వర్క్ సమస్య గురించి వినియోగదారుల నుంచి ఫిర్యాదులు పెరిగినట్లు తెలిపింది. అయితే దీని ప్రభావం ఏమేరకు ఉందనేది తెలియాల్సి ఉందని పేర్కొంది.

* స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) రీవాంప్డ్‌ గోల్డ్ డిపాజిట్ స్కీమ్ (ఆర్‌-జీడీఎస్‌) కింద మూడు ర‌కాల డిపాజిట్ ప‌థ‌కాల‌ను అందిస్తోంది. ఎస్‌బీఐ వినియోగదారులు త‌మ బంగారాన్ని ఆర్‌-జీడీఎస్‌ కింద డిపాజిట్ చేయొచ్చు. ఈ పథకం కింద భ‌ద్ర‌త‌, వ‌డ్డీ, ఆదాయాలు వస్తాయి. ఆర్‌-జీడీఎస్‌ పథకం కింద దాచిన బంగారానికి ఫిక్స్‌డ్ డిపాజిట్ తరహాలో వడ్డీ లభిస్తుంది.

అర్హతలు ఇవీ…

ఈ ప‌థ‌కంలో పెట్టుబ‌డి పెట్ట‌డానికి భారతీయ ప్రజలు, యాజమాన్య సంస్థలు, భాగస్వామ్య సంస్థలు, హిందూ అవిభ‌క్త కుటుంబాలు (హెచ్‌యుఎఫ్‌), సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) కింద రిజిస్టర్‌ అయిన మ్యూచువ‌ల్ ఫండ్‌లు/ఎక‌్స్ఛేంజ్‌- ట్రేడెడ్ ఫండ్స్ వర్గాలకు అర్హత ఉంది. వీటితోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సంస్థలు, ధార్మిక సంస్థలు కూడా పెట్టుబడి పెట్టొచ్చు.

ప‌రిమాణం…

ఈ పథకంలో చేరడానికి క‌నీసం 10 గ్రాముల ముడి బంగారాన్ని డిపాజిట్‌ చేయాలి. గరిష్ఠ పరిమితి లాంటిది ఏమీ ఉండదు. ముడి బంగారం అంటే నాణేలు, కడ్డీలు నగలు (రాళ్లు, ఇతర మెటల్స్‌ ఉంటే వాటి బరువు లెక్కించరు).

డిపాజిట్ల ర‌కాలు…

ఎస్‌బీఐ రీవాంప్డ్‌ గోల్డ్ డిపాజిట్ స్కీమ్ (ఆర్‌-జీడీఎస్‌) మూడు ర‌కాల డిపాజిట్ల‌ను అందిస్తోంది. స్వ‌ల్ప‌కాలిక బ్యాంక్ డిపాజిట్ (ఎస్‌టీబీడీ) కాల‌వ్య‌వ‌ధి 1 నుంచి 3 సంవ‌త్స‌రాలు. మ‌ధ్య‌ కాలిక ప్ర‌భుత్వ డిపాజిట్ (ఎమ్‌టీజీడీ) కాల‌వ్య‌వ‌ధి 5-7 సంవ‌త్స‌రాలు. దీర్ఘ‌కాలిక ప్ర‌భుత్వ డిపాజిట్ (ఎల్‌టీజీడీ) కాల‌వ్య‌వ‌ధి 12-15 సంవ‌త్స‌రాలు.

వ‌డ్డీ రేట్లు…

స్వ‌ల్ప‌కాలిక బ్యాంక్ డిపాజిట్ (ఎస్‌టీబీడీ)కి సంవ‌త్స‌రానికి 0.50%. ఒక సంవ‌త్స‌రం నుంచి 2 సంవ‌త్స‌రాల వ‌ర‌కు డిపాజిట్ల‌కు 0.55%. రెండు సంవ‌త్స‌రాల నుంచి మూడు సంవ‌త్స‌రాల వ‌ర‌కు డిపాజిట్ల‌కు 0.60% చెల్లిస్తారు. మ‌ధ్య‌కాలిక ప్ర‌భుత్వ డిపాజిట్‌పై వ‌డ్డీ రేటు సంవ‌త్స‌రానికి 2.25%. దీర్ఘ‌కాలిక ప్ర‌భుత్వ డిపాజిట్‌పై వ‌డ్డీ రేటు ఒక సంవ‌త్స‌రానికి 2.50%గా ఉంది.

తిరిగి చెల్లింపు…

స్వ‌ల్ప‌కాలిక బ్యాంక్ డిపాజిట్ (ఎస్‌టీబీడీ) మెచ్యూరిటీ తేది నాటికి బంగారం లేదా దానికి స‌మాన‌మైన న‌గ‌దును బ్యాంక్‌ చెల్లిస్తుంది. మ‌ధ్య‌కాలిక ప్ర‌భుత్వ డిపాజిట్, దీర్ఘ‌కాలిక ప్ర‌భుత్వ డిపాజిట్ (ఎమ్‌టీజీడీ & ఎల్‌టీజీడీ) మెచ్యూరిటీ తేది నాటికి ప్ర‌స్తుత ధ‌ర ప్ర‌కారం బంగారం విలువ‌కు స‌మాన‌మైన విలువ‌ను క‌ట్టి రూపాయ‌ల‌లో అందిస్తారు. 0.20% ప్రాసెసింగ్ ఛార్జీలు విధిస్తారు.

ముంద‌స్తు ఉప‌సంహ‌ర‌ణ…

ఎస్‌టీబీడీ: సంవ‌త్స‌రం లాక్‌-ఇన్ వ్య‌వ‌ధి త‌ర్వాత వ‌ర్తించే వ‌డ్డీ రేటుపై పెనాల్టీతో ముందస్తు ఉపసంహరణకు అనుమతిస్తారు.

ఎమ్‌టీజీడీ: వ‌డ్డీపై పెనాల్టీతో మూడు సంవ‌త్స‌రాల త‌ర్వాత ఎప్పుడైనా ఉపసంహరించుకునే అవకాశం ఇస్తారు.

ఎల్‌టీజీడీ: వ‌డ్డీపై జ‌రిమానాతో ఐదు సంవ‌త్స‌రాల త‌ర్వాత ఎప్పుడైనా ఉప‌సంహ‌రించుకోవ‌డానికి అవకాశం ఉంటుంది.