Business

ఐస్‌క్రీములపై భారీ GST-వాణిజ్యం

ఐస్‌క్రీములపై భారీ GST-వాణిజ్యం

* ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌(ఆర్‌ఐఎల్‌) సౌర విద్యుదుత్పత్తి రంగంలో ఓ ముందడుగు వేసింది. నార్వేకు చెందిన ‘ఆర్‌ఈసీ సోలార్‌ హోల్డింగ్స్‌ ఏఎస్‌’ అనే సంస్థను రిలయన్స్‌ అనుబంధ సంస్థ ‘రిలయన్స్‌ న్యూ ఎనర్జీ సోలార్‌ లిమిటెడ్‌(ఆర్‌ఎన్‌ఈఎస్‌ఎల్‌)’ కొనుగోలు చేసింది. ఈ డీల్‌ కోసం 771 మిలియన్‌ డాలర్లను వెచ్చించింది. నార్వేకు చెందిన ఈ కంపెనీ ఇప్పటి వరకు చైనా నేషనల్‌ బ్లూస్టార్‌ కో లిమిటెడ్‌ చేతిలో ఉంది. సింగపూర్‌లో ఆపరేషనల్‌ హెడ్‌క్వార్టర్స్ ఉంది. నార్త్‌ అమెరికా, ఐరోపా, ఆస్ట్రేలియా, ఆసియా-పసిఫిక్‌ ప్రాంతాల్లో ప్రాంతీయ కేంద్రాలు ఉన్నాయి. సౌరవిద్యుత్తు రంగంలో ఆర్‌ఈసీ లీడర్‌గా నిలిచింది. అధిక సామర్థ్యం ఉన్న సోలార్‌ ప్యానల్స్‌, సెల్స్‌ను ఈ కంపెనీ ఉత్పత్తి చేస్తోంది. దీనికి మూడు తయారీ కర్మాగారాలు ఉన్నాయి. వీటిలో రెండు నార్వేలో ఉన్నాయి. ఇవి సోలార్‌ గ్రేడ్‌ పాలీ సిలికాన్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. మరో కార్యాలయం సింగపూర్‌లో ఉంది. ఇది పీవీ సెల్స్‌, మాడ్యూల్స్‌ను తయారు చేస్తుంది. ఆర్‌ఈసీ కంపెనీ ఉత్పత్తి చేసే ఆల్ఫా, ఆల్ఫా ప్యూర్‌ మాడ్యూల్స్‌ పరిశ్రమంలో అత్యధిక డిమాండ్‌ ఉంది. ఆర్‌ఈసీ సంస్థ హెటెరోజెంక్షన్‌ టెక్నాలజీని వాడి వీటిని తయారు చేస్తోంది. సాధారణ మాడ్యూల్‌ కంటే ఇవి శక్తిమంతంగా పనిచేస్తున్నాయి.

* భారత్‌లో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఐపీఓల శకం నడుస్తోంది. భారత్‌లో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 72 కంపెనీలు ఐపీఓకి రాగా.. 9.7 బిలియన్‌ డాలర్లు సమీకరించాయని ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ ఈవై తెలిపింది. ఒక సంవత్సరంలో తొలి తొమ్మిది నెలల్లో ఐపీఓల ద్వారా ఈ స్థాయిలో నిధులు సమీకరించడం గత రెండు దశాబ్దాల్లో ఇదే అత్యధికమని పేర్కొంది. 2018లో జనవరి-సెప్టెంబరు మధ్య అత్యధికంగా 130 ఐపీఓలు వచ్చాయి. తర్వాత ఈ ఏడాదే అత్యధికం.

* దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వరుసగా ఆరోరోజూ పెరిగాయి. ఆదివారం (10-10-2021) లీటర్‌ పెట్రోల్‌పై 30 పైసలు, డీజిల్‌పై 35 పైసల వరకు పెరిగింది. దీంతో దేశ రాజధాని దిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.104.14, డీజిల్‌ రూ.92.82కి చేరింది. వాణిజ్య రాజధాని ముంబయిలో ఈ ధరలు వరుసగా రూ.110.12, రూ.100.66గా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరుగుతుండడంతో దేశీయంగా చమురు విక్రయ సంస్థలు ఇంధన ధరలను పెంచుతున్నాయి. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో లీటర్‌ డీజిల్‌ ధర సైతం ధర రూ.100 దాటింది. కరోనా ఆంక్షల నుంచి ప్రపంచం క్రమంగా బయటకు వస్తోంది. అన్ని రంగాల్లో సాధారణ కార్యకలాపాలు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో చమురుకు గిరాకీ పెరిగింది. మరోవైపు ఉత్పత్తిలో సమస్యలు సైతం ధరల పెరుగుదలకు దోహదం చేస్తున్నాయి.

* రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా సహా మరికొంత మంది కలిసి ప్రారంభించనున్న విమానయాన సంస్థ ‘ఆకాశ’తో చర్చలు జరుపుతున్నామని ఎయిర్‌బస్‌ తెలిపింది. ఎయిర్‌బస్‌ తయారు చేస్తోన్న ఏ320 విమానాలను కొనుగోలు చేయడంపై ‘ఆకాశ’ ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఇదే విషయంపై సంస్థ ప్రతినిధులతో గత కొన్ని రోజులుగా చర్చలు జరుపుతున్నట్లు ఎయిర్‌బస్‌ సీఓఓ క్రిస్టియన్‌ షెరర్‌ తెలిపారు.

* పార్లర్లు లేదా అలాంటి విక్రయ కేంద్రాల్లో అమ్మే ఐస్‌క్రీమ్‌లపై 18 శాతం వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) చెల్లించాల్సి ఉంటుందని కేంద్ర పరోక్ష పన్నులు, సుంకాల మండలి (సీబీఐసీ) వెల్లడించింది. గత నెల 17న జరిగిన 45వ జీఎస్‌టీ మండలి సమావేశంలో 21 వస్తు, సేవల పన్ను రేట్ల విషయంలో తీసుకున్న నిర్ణయాలపై అటు వాణిజ్య, పరిశ్రమ వర్గాల నుంచి వస్తున్న సందేహాలు నివృత్తి చేసేలా సీబీఐసీ 2 సర్క్యులర్లను విడుదల చేసింది. ఐస్‌క్రీం పార్లర్లు అలాంటి కేంద్రాల్లో అప్పటికే తయారైన ఐస్‌క్రీమ్‌లను విక్రయిస్తారని, వాటికి రెస్టారెంట్‌ లక్షణం లేదని తెలిపింది. ‘ఐస్‌క్రీమ్‌ పార్లర్లలో ఏ దశలోనూ ఎలాంటి కుకింగ్‌ జరగదని, రెస్టారెంట్‌ సేవల్లో కుకింగ్‌/తయారీ జరుగుతుంద’ని సీబీఐసీ తెలిపింది. ఐస్‌క్రీమ్‌ను వస్తువుగానే (తయారీ వస్తువు) పరిగణిస్తామని, అది సేవల కిందకు రాదని అందుకే 18 శాతం జీఎస్‌టీ విధిస్తామని వివరించింది.