Business

సింగరేణి బొగ్గుకు డిమాండ్-వాణిజ్యం

సింగరేణి బొగ్గుకు డిమాండ్-వాణిజ్యం

* దేశంలో బొగ్గుకు డిమాండు పెరగడంతో సింగరేణి కీలకంగా మారింది. దక్షిణాది రాష్ట్రాలే కాకుండా పశ్చిమ, ఉత్తర భారత రాష్ట్రాలు సైతం సింగరేణి బొగ్గును అడుగుతున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ రాష్ట్రాల విద్యుత్కేంద్రాలు అదనంగా బొగ్గు పంపాలని సింగరేణిపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. ఒక్కసారిగా గిరాకీ పెరిగినా, అందుకు తగ్గట్టు సింగరేణి సరఫరా చేయలేని స్థితి. కొత్త గనుల తవ్వకాలు, విస్తరణ, ఆధునికీకరణ తదితర అంశాల్లో జాప్యం వల్ల సంస్థ ఉత్పత్తిని పెంచలేకపోతోంది. విద్యుత్తు సంక్షోభ నివారణకు వీలైనంత అదనపు బొగ్గు పంపాలని సింగరేణి శతవిధాలా ప్రయత్నిస్తోంది.

* ఏపీలో విద్యుత్‌ కోతలు మొదలయ్యాయి. వాతావరణం కొంత చల్లబడినట్లే అనిపించినా గత ఏడాదితో పోలిస్తే విద్యుత్‌ వినియోగం అనూహ్యంగా 20 శాతం పెరిగింది. దీనికితోడు దేశవ్యాప్తంగా థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు బొగ్గు కొరత ఎదుర్కొంటున్నాయి. జెన్‌కో థర్మల్‌ ప్లాంట్లు సైతం ఇదే సమస్యతో కొన్ని యూనిట్ల నుంచి ఉత్పత్తి నిలిపేశాయి. దేశవ్యాప్తంగా విద్యుత్‌కు డిమాండ్‌ పెరగటంతో యూనిట్‌ రూ.20 వెచ్చించి బహిరంగ మార్కెట్‌లో కొందామన్నా దొరకటం లేదు. ముఖ్యంగా పీక్‌ డిమాండ్‌ (సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల) సమయంలో విద్యుత్‌ దొరకటం కష్టంగా ఉంది. లోడ్‌ సర్దుబాటు కోసం అవసరాన్ని బట్టి ఈ సమయంలో వ్యవసాయ, గ్రామీణ ప్రాంతాలు రేడియల్‌ ఫీడర్లకు సరఫరా నిలిపేస్తున్నారు.

* దేశవ్యాప్తంగా పలు పోర్టులను నిర్వహిస్తున్న అదానీ పోర్ట్స్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్‌, అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్‌ దేశాలకు సంబంధించిన సరకు రవాణాను తమ టెర్మినళ్ల నుంచి నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. నవంబర్‌ 15 నుంచి ఈ నిర్ణయం అమలు చేయనున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. ఇటీవల గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో పెద్దఎత్తున డ్రగ్స్‌పట్టుబడిన నేపథ్యంలో అదానీ గ్రూప్‌ నుంచి ఈ ప్రకటన వెలువడడం గమనార్హం.

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం ఆద్యంతం లాభాల్లో కొనసాగాయి. ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు క్రమంగా పుంజుకున్నాయి. ఇంట్రాడేలో జీవితకాల గరిష్ఠాల్ని నమోదు చేశాయి. నిఫ్టీ 18,000 మార్కును తొలిసారి దాటింది. చివరకు ఇంట్రాడే లాభాలను కోల్పోయిన సూచీలు నష్టాల్లోకి మాత్రం జారుకోలేదు. అంతర్జాతీయ సానుకూలతలతో పాటు దేశీయంగా రిలయన్స్‌, టాటా మోటార్స్‌ వంటి దిగ్గజ షేర్లు జీవితకాల గరిష్ఠానికి చేరడం సూచీలను ముందుకు నడిపించింది. రెండో త్రైమాసిక ఫలితాలపై ఆశాజనక వాతావరణం కూడా సూచీలకు దన్నుగా నిలిచింది. ఇక కరోనా నుంచి ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకుంటోందన్న పలు నివేదికలు సైతం మదుపర్లలో విశ్వాసాన్ని నింపాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే నేడు సూచీలు లాభాల్లో పయనించాయి.

* స్వల్పకాలంలో ఒడుదొడుకులు ఎదురైనప్పటికీ.. వ్యాపార అవసరాలకు అనుగుణంగా పెట్టుబడులు పెట్టడానికి ఏమాత్రం వెనుకాడబోమని టీసీఎస్‌ చీఫ్‌ ఫినాన్షియల్‌ ఆఫీసర్‌ సమీర్‌ సెక్సారియా తెలిపారు. లాభార్జనను కాపాడుకునేందుకు పెట్టుబడుల్లో ఎలాంటి క్షీణత ఉండదని పేర్కొన్నారు. అయితే, 26-28 శాతం నిర్వహణ లాభాలను ఆర్జించాలన్న లక్ష్యానికి అనుగుణంగానే నిర్ణయాలు ఉంటాయని తెలిపారు. వ్యాపారాల అవసరాలరీత్యా మాత్రమే స్వల్పకాలిక లక్ష్యాలు ఉంటాయని పేర్కొన్నారు.