Politics

ఏపీలో జీతాలు ఆలస్యం నిజమే. 25న తెరాసకు కొత్త బాస్ ఎన్నిక-తాజావార్తలు

* నటుడు మంచు విష్ణు బుధవారం ఉదయం ‘మా’ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నరేశ్‌ మాట్లాడుతూ.. కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు అయ్యాక కూడా ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు? అంటూ నరేశ్‌ ప్రశ్నించారు. ‘‘ఈ రోజు నాకెంతో ఆనందంగా ఉంది. తదుపరి ‘మా’ అధ్యక్షుడిగా విష్ణుకి బాధ్యతలు అప్పగించడం సంతోషంగా ఉంది. ‘మా’ ఒక సేవా సంస్థ. అందరం కలిసి సమష్టిగా పనిచేద్దాం. కొత్త పాలకవర్గాన్ని ప్రశాంతంగా పనిచేసుకోనివ్వండి. విష్ణుని ఎవరైనా డిస్టర్బ్‌ చేస్తే బాగుండదు. ఎన్నికల సమయంలో అందరం కలిసి పనిచేద్దామని చెప్పి.. ఇప్పుడు ఎందుకు రాజీనామాలు చేస్తున్నారు. మోదీ గెలిచారని కాంగ్రెస్‌ దేశం వదిలి వెళ్లిపోలేదు కదా..! ‘మా’ సభ్యులెవరూ రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. ఎన్నికలయ్యాక కూడా ఈ ఆరోపణలు ఎందుకు?’’ అని నరేశ్‌ కామెంట్‌ చేశారు.

* అమెరికా పర్యటనలో ఉన్న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ లఖింపుర్ ఖేరి హింసాకాండపై స్పందించారు. అది పూర్తిగా ఖండించదగినదని చెప్పారు. భారత్‌ గురించి తెలిసిన ప్రతిఒక్కరు ఇతర ప్రాంతాల్లో చోటుచేసుకునే ఈ తరహా ఘటనల్ని కూడా లేవనెత్తాల్సి ఉందన్నారు. హార్వర్డ్ కెన్నడీ స్కూల్‌లో జరిగిన చర్చలో భాగంగా అడిగిన ప్రశ్నలకు ఆమెకు సమాధానమిచ్చారు.

* దేశంలో బహుముఖ అనుసంధానం కోసం ఉద్దేశించిన పీఎం గతిశక్తి కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు దిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మోదీ.. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే ఈ కార్యక్రమ లక్ష్యమన్నారు. రూ. 100లక్షల కోట్ల విలువతో ఈ కార్యక్రమాన్ని రూపొందించామని.. 25ఏళ్ల దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని అన్నారు. దాదాపు 16 మంత్రిత్వ శాఖల సమన్వయంతో చేపట్టే ఈ కార్యక్రమం ద్వారా రానున్న రోజుల్లో దేశ మౌలిక వసతుల ముఖచిత్రమే సమూలంగా మారిపోతుందని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.

* ఒక ఫొటో కారణంగా పాకిస్థాన్‌ ప్రధాని‌ – ఆ దేశ ఆర్మీ చీఫ్‌ మధ్య విభేదాలు తలెత్తాయి. అఫ్గాన్‌ ప్రభుత్వ ఏర్పాటుకు తాలిబన్లు – హక్కానీలు తన్నుకొంటున్న సమయంలో ఓ ఫొటో కలకలం రేపింది. కాబుల్‌లోని సెరీనా హోటల్‌లో పాక్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ ఐఎస్‌ఐ చీఫ్‌ ఫయాజ్‌ హమీద్‌ స్టైల్‌గా ఓ టీకప్పు పట్టుకొని దర్శనమిచ్చాడు. ఇది ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పాక్‌ నేరుగా అఫ్గాన్‌ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకొని తనకు అవసరమైన కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందనే విమర్శలు వెల్లువెత్తాయి. మరో పక్క పాక్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ కమర్‌ జావెద్‌ బజ్వా కూడా దీనిపై అంసంతృప్తి వ్యక్తం చేశారు. తాలిబన్ల వెనుక ఐఎస్‌ఐ ఉందన్న విషయం బహిర్గతం కావడమే దీనికి ముఖ్య కారణం. తన అనుమతి లేకుండా ఐఎస్‌ఐ చీఫ్‌ దేశం దాటడంపై నోటీసులు జారీ చేసి పంచాయతీ పెట్టారు. చివరికు రావల్పిండిలోని ఆర్మీ హెడ్‌ క్వార్టర్స్‌లో విచారణ జరిపి ఫయాజ్‌ చేత క్షమాపణలు చెప్పించారు.

* ఏపీలో ఉద్యోగుల పీఆర్సీ సమస్య ఈ నెలాఖరుకు కొలిక్కి వస్తుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. అడగక ముందే జగన్‌ ప్రభుత్వం ఐఆర్‌ ఇచ్చిందని చెప్పారు. జగన్‌ సీఎం అయ్యాక ఉద్యోగులకు ప్రాధాన్యం పెరిగిందన్నారు. ప్రభుత్వ పథకాల అమలు ఉద్యోగుల భుజస్కంధాలపైనే ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వేతన సవరణ, కరవు భత్యాల బకాయిల కోసం గళమెత్తిన ఉద్యోగ సంఘాలతో తాడేపల్లిలో ప్రభుత్వం చర్చలు జరిపింది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా చర్చల్లో పాల్గొన్నారు. చర్చల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఉద్యోగుల సంక్షేమంలో మా ప్రభుత్వం రెండు అడుగుల ముందే ఉంది. కరోనా తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో పడింది. ఆ కారణంగానే చిన్న చిన్న సమస్యలు వచ్చాయి. ఐఆర్‌ అమలులో కాస్త ఆలస్యం జరిగింది. వచ్చే నెలాఖరులోపు ఉద్యోగుల సమస్యలు పరిష్కారమవుతాయి. జీతాలు ఇటీవల ఆలస్యమవుతున్న మాట వాస్తవమే. ఉద్యోగ సంఘాలతో చర్చలు కొనసాగుతాయి. ఉద్యోగులను తన జట్టులో భాగంగా సీఎం భావిస్తారు’’ అని సజ్జల అన్నారు.

* భారత్‌ – చైనాల సైనిక ఉన్నతాధికారుల మధ్య 13వ దఫా చర్చలు సఫలం కాని నేపథ్యంలో.. అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌లతో కలసి భారత నౌకాదళం బంగాళాఖాతంలో ‘ఆపరేషన్‌ మలబార్‌’ విన్యాసాలు నిర్వహించడం ద్వారా డ్రాగన్‌కు గట్టి సందేశం పంపించింది. ఈ నెల 11 నుంచి 15 వరకు ఈ విన్యాసాలు జరుగుతున్న సమయంలోనే అమెరికా నౌకాదళ అధిపతి అడ్మిరల్‌ మైఖేల్‌ గిల్డే దిల్లీకి వచ్చి భారత నౌకాదళాధిపతి అడ్మిరల్‌ కరమ్‌బీర్‌ సింగ్‌తో చర్చలు జరపడం ప్రాధాన్యం సంతరించుకుంది. సాధారణంగా భారత్‌ – చైనా సైనిక ఉన్నతాధికారుల చర్చలు ముగిశాక విడుదల చేసే ప్రకటనల్లో సరిహద్దులో శాంతిసామరస్యాలు నెలకొనాలనే అభిలాష వ్యక్తమవుతూ ఉంటుంది. తాజా భేటీ తర్వాత మాత్రం సరిహద్దు చర్చల్లో చైనా సైన్యం వైఖరి తమకు సమ్మతంగా లేదని, పరిష్కారం కోసం ముందడుగు వేసే ప్రతిపాదనలేమీ రాలేదని భారత్‌ అధికార ప్రకటన పేర్కొంది. మరోవైపు చైనా సైన్యం (పీఎల్‌ఏ) కూడా.. భారత సైన్యం అవాస్తవిక, అసమంజస వైఖరిని అవలంబించిందని, చర్చలు ముందుకు సాగలేని స్థితి కల్పించిందని వ్యాఖ్యానించింది. ఈ భేటీ అనంతరం భారత్‌ క్వాడ్‌ దేశాలతో కలసి ఆపరేషన్‌ మలబార్‌ రెండో దశ విన్యాసాలను బంగాళాఖాతంలో ప్రారంభించింది. దీనికి ముందు మొదటి దశ విన్యాసాలు ఫిలిప్పీన్‌ సముద్రంలో ఆగస్టు 26-29 తేదీల మధ్య జరిగాయి. ఇండో-పసిఫిక్‌లో చైనా దూకుడుకు అడ్డుకట్ట వేయడానికి క్వాడ్‌ ఏర్పడిన సంగతి తెలిసిందే. దీనిపై చైనా రుసరుసలాడుతున్నా క్వాడ్‌ దేశాలు ఖాతరు చేయడం లేదు. బంగాళాఖాతంలో ఇటీవల చైనా యుద్ధనౌకలు, జలాంతర్గాముల సంచారం పెరిగింది. దీంతో క్వాడ్‌ దేశాలు శత్రు నౌకలు, జలాంతర్గాములను తుత్తునియలు చేసే అభ్యాసాలను నిర్వహిస్తున్నాయి. తమ నావికుల మధ్య సమన్వయం పెంచుకోవడం, అధునాతన ఆయుధాలను ప్రయోగించడంలో ఉమ్మడి అనుభవం సంపాదిస్తున్నాయి.

* బొగ్గు కొరతతో పాటు పలు రాష్ట్రాల్లో కరెంటు డిమాండు పెరుగుతుండటంతో కేంద్ర విద్యుత్‌, బొగ్గు శాఖలు అప్రమత్తమయ్యాయి. తెలంగాణ, బిహార్‌, ఝార్ఖండ్‌ తదితర రాష్ట్రాల్లో బొగ్గు గనులున్న ప్రాంతాల్లోని విద్యుత్కేంద్రాలను రోజువారీ విచారణ చేస్తున్నాయి. దేశంలోని మొత్తం 116 విద్యుత్కేంద్రాలకు రోజూ ఎంత బొగ్గు సరఫరా చేస్తున్నారు, ఎంత నిల్వలున్నాయో కేంద్ర ప్రభుత్వం ఆరా తీసింది. మొత్తం విద్యుత్కేంద్రాల్లో 4 చోట్ల మాత్రమే 13 రోజులపాటు కరెంటు ఉత్పత్తి అవసరానికి మించి బొగ్గు నిల్వలున్నట్లు తేలింది. అందులో భూపాలపల్లి విద్యుత్కేంద్రం ఒకటి. ఇక్కడ 15 రోజులపాటు విద్యుదుత్పత్తికి సరిపడా నిల్వలున్నాయి. ఈక్రమంలో కేంద్రప్రభుత్వం దానిపై దృష్టి పెట్టింది. అక్కడ అధిక నిల్వలున్నప్పటికీ రోజూ అక్కడికి ఎందుకు బొగ్గు పంపుతున్నారని సింగరేణిని ప్రశ్నించింది. కర్ణాటక, ఏపీ, మహారాష్ట్ర విద్యుత్కేంద్రాల్లో తీవ్ర కొరత ఉన్నందున అక్కడికి సరఫరా చేయాలని ఆదేశించింది.

* కరోనా వైరస్‌లో కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తుండటంతో వ్యాక్సిన్‌ను రెండు మోతాదుల్లో తీసుకున్నప్పటికీ.. మూడో డోసు అవసరమని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. అటు డబ్ల్యూహెచ్‌వో కూడా బూస్టర్ డోసు తీసుకోవడమే మంచిదని సూత్రప్రాయంగా తెలిపింది. ఈ నేపథ్యంలో భారత్‌లోనూ ఆ దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయి. హైదరాబాద్‌కు చెందిన ఫార్మా సంస్థ బయోలాజికల్‌ – ఇ.. తాము అభివృద్ధి చేస్తున్న కార్బివాక్స్‌ టీకాను బూస్టర్‌ డోసు కింద పంపిణీ చేయాలని భావిస్తోంది. ఇప్పటికే కొవాగ్జిన్‌ లేదా కొవిషీల్డ్‌ రెండు డోసులు తీసుకున్నవారికి కార్బివాక్స్‌ను బూస్టర్‌డోసుగా ఇచ్చేలా మూడో దశ క్లినికల్‌ ప్రయోగాలకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ డీసీజీఐకి దరఖాస్తు చేసుకుంది.

* ఈ నెల 25న తెరాస అధ్యక్షుడి ఎన్నిక నిర్వహించనున్నట్లు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ తెలిపారు. రెండేళ్లకోసారి పార్టీ అధ్యక్షుడి ఎన్నిక నిర్వహిస్తున్నామని చెప్పారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో అధ్యక్ష ఎన్నిక వివరాలను కేటీఆర్‌ వెల్లడించారు. ఈనెల 17 నుంచి 22 వరకు నామినేషన్లు స్వీకరణ ఉంటుందన్నారు. 23న నామినేషన్ల పరిశీలన, 24న నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ చేపడతామని చెప్పారు. 25న తెరాస అధ్యక్షుడిని ఎన్నుకుంటామన్నారు.

* యువతీయువకులు ప్రేమించుకోవడం తప్పు కాదని, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకొంటే వారి జీవితాలు ఎంతో బాగుంటాయని.. దీనికి తామే నిదర్శనమని మాజీ మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలంలోని వంచనగిరిలో యోయో ప్రొడక్షన్‌ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి జీవిత చరిత్ర ఆధారంగా దర్శకుడు రాంగోపాల్‌వర్మ నిర్మిస్తున్న ‘కొండా’ బయోపిక్‌ సినిమా షూటింగ్‌ మంగళవారం ప్రారంభమైంది. హనుమకొండలోని కొండా మురళి ఇంటి నుంచి కొండా దంపతులతోపాటు ఆర్‌జీవీ కాంగ్రెస్‌ కార్యకర్తలతో తరలి రావాల్సి ఉండగా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అనంతరం ఆర్‌జీవీ ఒక్కరే వచ్చి కోట మైసమ్మ ఆలయంతో పాటు గ్రామంలోని బొడ్రాయి వద్ద పూజలు నిర్వహించారు. కోట మైసమ్మ ఆలయం నుంచి ఆర్‌జీవీ, కొండా దంపతులు ర్యాలీగా గ్రామంలోకి వెళ్లారు. ‘కొండా నన్ను కరుణించారు.. కరిగించారు.. అనే పాటను విడుదల చేస్తుండగా సురేఖ ఉద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. మురళితో కళాశాలలో తన పరిచయంతోపాటు ప్రేమ స్మృతులను వివరించారు. మురళీ ప్రజల కోసం ఎన్నో మంచి పనులు చేశారన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును ఉద్దేశించి పలు వివాదాస్పద వాఖ్యలు చేశారు. మమ్ములను ఆయన అణచివేయాలని చూస్తే ముందే తాను మంత్రినయ్యానన్నారు. ఆర్‌జీవీ మాట్లాడుతూ.. కొండా మురళి దమ్మున్న నాయకుడని పొగడ్తలతో ముంచెత్తారు. మురళి ప్రసంగిస్తూ.. ఆర్‌జీవీ తన జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తీయడానికి ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. యోయో ప్రొడక్షన్‌ చిత్ర నిర్మాత మల్లారెడ్డి, వంచనగిరి ఫ్యాక్స్‌ మాజీ ఛైర్మన్‌ కొండా సుస్మితపటేల్, కాంగ్రెస్‌ నాయకులున్నారు.

* హుజూరాబాద్‌ ఉప ఎన్నికకు నామినేషన్ల ఉపసంహరణ గుడువు ముగిసింది. 12 మంది అభ్యర్థులు ఇవాళ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమున సైతం తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో ప్రస్తుతం 30 మంది అభ్యర్థులు ఉప ఎన్నిక బరిలో ఉన్నారు. ఈ నెల 30న హుజూరాబాద్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ జరగనుండగా.. నవంబర్‌ 2వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంటుంది.

* ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్‌, పలువురు న్యాయమూర్తులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం సీజే జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రకు గవర్నర్‌, సీఎం పుష్పగుచ్ఛాలతో అభినందించి శాలువాతో సత్కరించారు.

* డ్రగ్స్‌ దందాపై ఏపీ ప్రభుత్వాన్ని నిలదీసిన తెదేపా నేతలకు పోలీసులు నోటీసులు పంపడం ఏ మేరకు సబబు అని తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి ప్యాలెస్‌ పెద్దలను కాపాడేందుకే నోటీసులు పంపారా అని ప్రశ్నించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. క్షమాపణలు చెప్పాలంటూ పోలీసులు పంపిన నోటీసులు చిత్తుకాగితాలతో సమానమన్నారు. ‘‘డ్రగ్స్‌ దందాపై ప్రభుత్వాన్ని ప్రతిపక్షంగా నిలదీశాం. క్షమాపణలు చెప్పకుంటే చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నారు. రాష్ట్రం కోసం పోరాటం కొనసాగించి తీరుతాం. పోలీసు శాఖ వైఫల్యాలను త్వరలోనే కేంద్ర సంస్థలకు అందజేస్తాం’’ అని పట్టాభి అన్నారు.