ScienceAndTech

గ్రహాంతర సంకేతాలు తొలిసారి పసిగట్టిన “లోఫర్”

World's Strongest Radio  LOFAR Detects Outer Radio Signals For First Time

ఖగోళశాస్త్ర పరిశోధనల్లో ఒక కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. సౌర కుటుంబం వెలుపల సుదూర నక్షత్రాలు వెదజల్లుతున్న రేడియో సంకేతాలను శాస్త్రవేత్తలు తొలిసారిగా పసిగట్టారు. దీన్నిబట్టి వాటి చుట్టూ గ్రహాలు దాగి ఉండొచ్చని స్పష్టమవుతోందని వారు తెలిపారు. ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన రేడియో యాంటెన్నా ‘ద డచ్‌ లో-ఫ్రీక్వెన్సీ అరే’ (లోఫర్‌) దీన్ని పసిగట్టింది. ఇది నెదర్లాండ్స్‌లో ఉంది. సాధారణ విధానాల్లో బయటపడని గ్రహాలను గుర్తించడానికి ఇది ఉపయోగపడుతుందని పరిశోధకులు పేర్కొన్నారు. 19 ‘అరుణ మరుగుజ్జు నక్షత్రాల’ నుంచి తాజా సిగ్నళ్లను గుర్తించారు. వాటిలో నాలుగు తారల చుట్టూ గ్రహాలు ఉండొచ్చని తెలిపారు. ‘‘సౌర కుటుంబంలోని గ్రహాలు శక్తిమంతమైన రేడియో తరంగాలను వెదజల్లుతాయని మనకు తెలుసు. సౌర వాయువులు అయస్కాంత క్షేత్రాలతో చర్య జరిపినప్పుడు ఇవి ఉద్భవిస్తుంటాయి. భూమిపై అరోరాల రూపంలో ఉత్పన్నమవుతుంటాయి. అయితే సౌర కుటుంబం వెలుపలి గ్రహాల నుంచి ఈ సంకేతాలను ఇంతవరకూ గుర్తించలేదు’’ అని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అరుణ మరుగుజ్జు నక్షత్రాల్లో తీవ్రస్థాయి అయస్కాంత చర్యలు ఉంటాయి. ఫలితంగా సౌర జ్వాలలు, రేడియో తరంగాలు వెలువడుతుంటాయి.