Business

అమెరికాలో రాజీనామాల సంక్షోభం. విప్రో రికార్డు-వాణిజ్యం

అమెరికాలో రాజీనామాల సంక్షోభం. విప్రో రికార్డు-వాణిజ్యం

* కరోనా ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగులకు కొత్త పాఠం నేర్పింది. జీవితంలో భయంకర కోణాలను చూపించింది. కుటుంబం విలువను మరోసారి తెలియజేసింది. బంధాలను బలోపేతం చేసింది. అంతేకాదు.. డబ్బు లేకపోతే పరిస్థితి ఏమిటో చవిచూపింది. ఆయా సంస్థల్లో ఏళ్ల తరబడి నమ్మకంగా పని చేసినా కూడా కష్టకాలంలో యాజమాన్యాలు నిర్దాక్షిణ్యంగా వ్యవహరించడం వారి మనసును గాయపర్చింది. సుదీర్ఘమైన షిఫ్టులు.. లే ఆఫ్‌లు.. వేతన కోతలతో తమను కంపెనీలు ఎక్కువగా వాడుకుంటున్నాయన్న భావన ఉద్యోగుల్లో బలంగా నాటుకొంది. ఇప్పుడు కరోనా వ్యాప్తి తగ్గింది. వ్యాపారాలు పుంజుకున్నాయి. కంపెనీలు ఆకర్షణీయ వేతనాలు, ప్యాకేజీలు ఇస్తామన్నా ఉద్యోగులు ఉండటం లేదు. రాజీనామా చేసి కొత్త మార్గం వెతుక్కునే పనిలో పడ్డారు. రాజీనామాలు చేయడానికి ఏమాత్రం భయపడటం లేదు. భవిష్యత్తును భద్రం చేసుకొనేందుకు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొంటున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా అగ్రదేశాల్లో ‘ది గ్రేట్‌ రెజిగ్నేషన్‌’ సంక్షోభం మొదలైంది. ‘ది గ్రేట్‌ రెజిగ్నేషన్‌’ అనే పదాన్ని తొలిసారి 2019లో ఏ అండ్‌ ఎం ప్రొఫెసర్‌ ఆంటోనీ క్లాట్జ్‌ ప్రయోగించారు. కొవిడ్‌ తర్వాత ఉద్యోగులు కోట్ల సంఖ్యలో తమ కొలువులకు రాజీనామా చేస్తారని భవిష్యత్తు గురించి అంచనా వేశారు. ఇప్పుడు అది వాస్తవ రూపం దాల్చింది. ఒక్క అమెరికాలోనే ఆగస్టులో 43 లక్షల మంది తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. ఇది ఆ దేశ మొత్తం ఉద్యోగాల్లో 2.9 శాతం. ఈ విషయాన్ని అమెరికాలో గురువారం విడుదల చేసిన లేబర్‌ డిపార్ట్‌మెంట్‌ డేటా చెబుతోంది. కంపెనీలకు వెన్నులో చలిపుట్టించే మరో విషయాన్నీ ‘గాల్‌ అప్‌’ డేటా వెల్లడించింది. అమెరికాలో 50 శాతం మంది ఉద్యోగులు కొత్త ఉద్యోగాల కోసం చురుగ్గా వేట మొదలు పెట్టారని పేర్కొంది.

* సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం విప్రో షేరు ధర భారీగా పెరిగింది. నేటి ట్రేడింగ్‌లో జీవనకాల గరిష్ఠానికి చేరింది. నేటి ట్రేడింగ్‌లో 8శాతం విలువ పెరిగి రూ.723.65 మార్కును తాకింది. ఐటీ సేవల్లో ఆదాయంలో 8.1శాతం వృద్ధి నమోదు కావడంతో మదుపరుల్లో ఆశలను పెంచింది. దీంతో షేరు గతంలో ఉన్న రూ.698.95 విలువను దాటేసింది. దీంతో కంపెనీ మార్కెట్‌ విలువ రూ.4లక్షల కోట్లను తాకింది. భారత్‌లో ఈ మార్కును తాకిన 13వ లిస్టెడ్‌ సంస్థగా విప్రో నిలిచింది.

* స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. త‌న‌ఖా పెట్టిన ప‌లు వాణిజ్య‌, నివాస ఆస్తులను ఇ-వేలం వేయ‌నుంది. ఈ మెగా ఇ-వేలం అక్టోబ‌రు 25 నిర్వ‌హించ‌నుంది. ఎస్‌బీఐ మెగా ఇ-వేలం ద్వారా మార్కెట్ ధ‌ర కంటే త‌క్కువ‌కే ఇల్లు, ఫ్లాట్లు, షాపుల‌ను బిడ్ వేసి గెలుచుకునే అవ‌కాశం ఉంది. ఆస్తుల‌ను కొనుగోలు చేయాల‌నుకునే వారు ఇ-వేలంలో జాయిన్ అయ్యి బిడ్ వేయ‌చ్చ‌ని ఎస్‌బీఐ త‌న సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్ ద్వారా తెలియ‌జేసింది. “బ్యాంకు వ‌ద్ద తాక‌ట్టు పెట్టి, అప్పు చెల్లించ‌లేని వారి ఆస్తుల‌ను ఇ-వేలం ద్వారా పార‌ద‌ర్శంగా విక్ర‌యిస్తున్నాం. వేలం వేసే ఆస్తుల‌కు సంబంధించి కోర్టు ఉత్తర్వులతో పాటు కావాల్సిన అన్ని పత్రాలు, వివరాలు బిడ్డ‌ర్ల‌కు అందజేస్తాం.” అని బ్యాంక్‌ తెలిపింది. వేలం కోసం ఉంచ‌బ‌డిన ఆస్తుల వివ‌రాల‌ను సామాజిక మాధ్యమాల ద్వారా ఇచ్చిన ప్ర‌కట‌న‌లో అందించిన లింక్‌ల ద్వారా యాక్సిస్ చేయ‌వ‌చ్చు. ఆశ‌క్తి ఉన్న వారు వేలం వేసే విధానం, అత‌ను/ ఆమె కొనుగోలు చేయాల‌నుకునే ఆస్తి గురించి సందేహాల నివృత్తి కోసం సంబంధిత బ్రాంచ్‌ల‌ను సంప్ర‌దించ‌వ‌చ్చు.

* పండుగలని దృష్టిలో ఉంచుకుని గృహ రుణాల వ‌డ్డీ రేట్ల‌ను అన్ని ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు చాలా వరకు త‌గ్గించాయి. ఇతర రుణాల వడ్డీ రేట్ల తో పోలిస్తే గృహ రుణాల వడ్డీ రేట్లే ఎప్పుడు తక్కువగానే ఉంటాయి. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు వడ్డీ రేట్లు కనిష్ట స్థాయిలో ఉన్నాయని చెప్పవచ్చు. ఇపుడు ఎన్‌బీఎఫ్‌సీ బ‌జాజ్ ఫిన్‌స‌ర్వ్ లిమిటెడ్ గృహ రుణాల‌పై వ‌డ్డీ రేటు త‌గ్గింపును ప్ర‌క‌టించింది. జీతం, వృత్తిప‌ర‌మైన గృహ రుణ ధ‌ర‌ఖాస్తుదారుల‌కు వ‌డ్డీ రేటు ఇపుడు సంవ‌త్స‌రానికి 6.70% నుండి ప్రారంభ‌మ‌వుతుంది. నిబంధ‌న‌లు అనుస‌రించి రూ. 5 కోట్ల వ‌ర‌కు కూడా రుణం పొందొచ్చు. ఈ వడ్డీ రేటు ప్రకారం ప్ర‌తి రూ. ల‌క్ష‌కు ఈఎమ్ఐ రూ. 645గా ఉంది. గృహ రుణం తీర్చే కాల‌వ్య‌వ‌ధి అత్య‌ధికంగా 25-30 సంవ‌త్స‌రాలు. మంచి క్రెడిట్ స్కోర్‌, ఆదాయ ప్రొఫైల్ ఉన్న ద‌ర‌ఖాస్తుదారుల‌కు 6.70% వ‌డ్డీ రేటుకే గృహ రుణం పొందే అవ‌కాశం ఉంటుంది.

* మైక్రోసాఫ్ట్‌ సీఈఓ, భారత సంతతికి చెందిన సత్య నాదెళ్లకు గ్లోబల్‌ బిజినెస్‌ సస్టెయినబిలిటీ లీడర్‌షిప్‌ విభాగంలో ప్రఖ్యాత సీకే ప్రహ్లాద్‌ అవార్డ్‌ దక్కింది. భారతీయ అమెరికన్‌ అయిన ప్రహ్లాద్‌ గౌరవార్థం 2010లో కార్పొరేట్‌ ఈకో ఫోరమ్‌(సీఈఎఫ్‌) ఏర్పాటు చేసిన ఈ అవార్డును అంతర్జాతీయప్రైవేటు రంగంలో పర్యావరణహిత కార్యక్రమాలను అసాధారణ రీతిలో, వినూత్నతతో నిర్వహిస్తూ, దీర్ఘకాల వ్యాపార విజయాలను కలిగి ఉన్న వారికి ఇస్తుంటారు. నాదెళ్లతో పాటు మైక్రోసాఫ్ట్‌ ప్రెసిడెంట్‌, వైస్‌ ఛైర్‌ బ్రాడ్‌ స్మిత్‌, సీఎఫ్‌ఓ అమీ హుడ్‌, చీఫ్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఆఫీసర్‌ లుకాస్‌ జొప్పలు కూడా ఈ గౌరవాన్ని అందుకున్నారు. 2030 కల్లా కర్బన రహిత సంస్థగా మైక్రోసాఫ్ట్‌ను మార్చడం; 2050 కల్లా చరిత్రాత్మక ఉద్గారాలన్నిటినీ తొలగించాలన్న లక్ష్యంతో కలిసికట్టుగా పనిచేస్తున్నందుకు ఈ ప్రఖ్యాత అవార్డు దక్కింది.