Politics

భూసర్వే త్వరితగతిన చేయాలన్న జగన్-తాజావార్తలు

* నిషేధిత భూముల వ్యవహారాలకు (22ఏ) చెక్‌ పెట్టాల్సిందేనని ఏపీ సీఎం జగన్‌ స్పష్టం చేశారు. వైఎస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్షపై మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు. నిర్ణీత వ్యవధిలో భూ సర్వే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భూక్రయ విక్రయాలు జరిగినప్పుడు రికార్డులు అప్‌డేట్‌ చేయాలని సూచించారు. ‘‘గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్‌ చేపట్టాలి. సర్వే డేటా భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలి. ఏటా ఒక వారంలో భూ రికార్డుల అప్‌డేషన్ చేపట్టాలి. భూ రికార్డుల అప్‌డేషన్‌, రిజిస్ట్రేషన్‌ పారదర్శకంగా ఉండాలి. సమర్థవంతమైన మార్గదర్శకాలను తయారు చేయాలి. లోపాలు లేకుండా ఆధీకృత వ్యవస్థలను బలోపేతం చేయాలి’’ అని సీఎం జగన్‌ అధికారులకు దిశానిర్దేశం చేశారు.

* అమ్మఒడి నిధులు జూన్‌కు మార్చడంతో ఒక ఏడాది ఎగ్గొట్టినట్టేనని నరసాపురం వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. గురువారం దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… జగన్‌ నవరత్నాల్లో ఒకటి రాలిపోయిందని విమర్శించారు. అమ్మ ఒడిని నమ్ముకున్న చిన్నారుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. రాష్ట్రంలో అప్పుల సేకరణపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

* ఏపీ మంత్రి కన్నబాబుకు చేదు అనుభవం ఎదురైంది. తూర్పుగోదావరి జిల్లా రాయుడుపాలెంలో సచివాలయం ప్రారంభోత్సవంలో సొంత పార్టీ కార్యకర్తల నుంచే ప్రతిఘటన ఎదురైంది. మంత్రి సచివాలయ ప్రారంభానికి సిద్ధమవుతుండగా వైకాపా నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. తన సామాజిక వర్గానికే మంత్రి పెద్దపీట వేస్తున్నారని వారంతా ఆరోపించారు.

* హైటెక్స్‌లో తెరాస ప్లీనరీ ఏర్పాట్లను మంత్రి కేటీఆర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన తెరాస నేతలు, వివిధ విభాగాల అధికారులతో భేటీ అయ్యారు. ఈ నెల 25న జరగనున్న ప్లీనరీ ఏర్పాట్లపై చర్చించారు. ‘‘ఈ నెల 25న తెరాస రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎన్నిక ఉంటుంది. ప్లీనరీ సజావుగా సాగేలా ఏర్పాట్లు చేస్తున్నాం. సభ ఏర్పాటుకు సంబంధించి పలు అంశాలపై చర్చించాం. ఆహ్వానం ఉన్నవారే సమావేశానికి రావాలి’’ అని కేటీఆర్‌ తెలిపారు.

* తొలగించిన ఆప్కాస్ (ఏపీ కార్పొరేషన్‌ ఫర్‌ అవుట్‌సోర్డ్స్‌ సర్వీసెస్‌) ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవటంతో పాటు 20 నెలల వేతన బకాయిలు తక్షణమే చెల్లించాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. సొంత వర్గాన్ని, పార్టీ కార్యకర్తలను కొలువుల్లో కూర్చోబెట్టేందుకు పోస్టులు అమ్ముకొని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించటం సరికాదన్నారు.

* ‘మా’ ఎన్నికలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ని ఇవ్వాలని ఎన్నికల అధికారి కృష్ణ మోహన్‌కి ప్రకాశ్‌రాజ్‌ లేఖ రాశారు. పోలింగ్‌ వేళ మోహన్‌ బాబు, నరేశ్‌ ప్రవర్తన ఎలా ఉందో చూశాం. కొందరు ‘మా’ సభ్యులపై వారు దాడి చేశారు. దానికి సంబంధించిన కొన్ని విజువల్స్‌ లీక్‌ అయ్యాయి. ‘మా’ సభ్యులు నిజం ఏంటో, పోలింగ్‌ ఎలా జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారు. మీరు వెంటనే స్పందించకపోతే అది డిలిట్‌ అయ్యే అవకాశాలున్నాయి’ అని పేర్కొన్నారు.

* దేశ సరిహద్దుల్లో అలజడి సృష్టించేందుకు అనునిత్యం కుట్రలు చేస్తున్న పాకిస్థాన్‌కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా గట్టి వార్నింగ్ ఇచ్చారు. అతిక్రమణలకు పాల్పడినా, కశ్మీర్‌లోని అమాయక ప్రజల్ని పొట్టనపెట్టుకునేందుకు ఉగ్రవాదాన్ని ఎగదోస్తే మరిన్ని మెరుపుదాడులు తప్పవని హెచ్చరించారు. భారత్‌పై దాడుల్ని సహించబోమని గతంలో సర్జికల్‌ దాడులతో నిరూపించామన్నారు.

* ఓ కేసులో నిందితులుగా ఉన్న వారితో కుమ్మక్కయ్యారనే ఆరోపణలపై 28 మంది జైలు అధికారులు సస్పెండయ్యారు. దిల్లీలోని యునిటెక్‌ మాజీ ప్రమోటర్లు అజయ్‌ చంద్ర, సంజయ్‌ చంద్రలకు తిహాడ్‌ జైలు అధికారులు సహకరించారని ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది. దీంతో వారిపై చర్యలు తీసుకొని దర్యాప్తు చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించడంతో దిల్లీ జైళ్లశాఖ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.

* సరిహద్దు భద్రత దళం( బీఎస్‌ఎఫ్) అధికార పరిధిని విస్తృతం చేస్తూ బుధవారం రాత్రి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపై కాంగ్రెస్‌ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే పంజాబ్‌ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ చర్యను సమాఖ్య వ్యవస్థపై దాడిగా అభివర్ణించారు. ఈ నేపథ్యంలో గురువారం బీఎస్‌ఎఫ్ స్పందించింది. అంతర్జాతీయ సరిహద్దు వెంబటి ఉన్న రాష్ట్రాలు అంతటా అధికార పరిధికి ఏకరూపత కల్పించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టత ఇచ్చింది.

* పేరుకు అగ్రరాజ్యమే అయినా… అక్కడి పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలు రోజు గడవడం కోసం అన్నదాన శిబిరాలపై ఆధారపడక తప్పడం లేదు! కొవిడ్‌ ఉద్ధృతి నెమ్మదించి, టీకా కార్యక్రమం ఊపందుకోవడంతో వ్యాపారాలు, ఉద్యోగాలు క్రమంగా గాడిన పడుతున్నాయి. దీంతో ఆహార బ్యాంకులపై ఆధారపడేవారి సంఖ్య ఆరు నెలలుగా తగ్గుతూ వస్తోంది.

* తూర్పు ఆసియా దేశం తైవాన్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కాహ్సిఅంగ్‌ నగరంలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఘటనలో సుమారు 46 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. ఆ నగరంలో 13 అంతస్తుల భవనంలో ఈ ఘోర ఘటన చోటుచేసుకుందని స్థానిక మీడియా వెల్లడించింది.

* దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌ చివరి బంతి వరకు వెళ్తుందని అస్సలు ఊహించలేదని కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ బ్యాట్స్‌మన్‌ రాహుల్‌ త్రిపాఠి అన్నాడు. ఆఖరి రెండు బంతుల్లో ఆరు పరుగులు చేయాల్సిన స్థితిలో అతడు ‌(12; 11 బంతుల్లో 1×6) సిక్సర్‌తో కోల్‌కతాను గెలిపించాడు. మ్యాచ్‌ అనంతరం మాట్లాడుతూ.. ఉత్కంఠభరిత పరిస్థితుల్లో జట్టును గెలిపించడం గొప్పగా ఉందన్నాడు.