Business

చైనాలో లింక్డిన్ బంద్-వాణిజ్యం

చైనాలో లింక్డిన్ బంద్-వాణిజ్యం

* కియా ఇండియా కాంపాక్ట్‌ ఎస్‌యూవీ సోనెట్‌ మోడల్‌లో మొదటి వార్షికోత్సవ ఎడిషన్‌ను విడుదల చేసింది. నాలుగు పవర్‌ట్రైన్‌ సదుపాయాల్లో, మాన్యువల్‌, ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌లతో ఈ వాహనం లభించనుంది. పెట్రోల్‌ వెర్షన్‌లు రూ.10.79 లక్షలు, రూ.11.49 లక్షలతో, డీజిల్‌ వేరియంట్‌లు రూ.11.09 లక్షలు, రూ.11.89 లక్షల ధరలతో లభిస్తాయి. బీఎండబ్ల్యూ కొత్త 3 సిరీస్‌ గ్రాన్‌ లిమోసిన్‌ ‘దిగ్గజ ఎడిషన్‌’ను విపణిలోకి తీసుకొచ్చింది. బీఎండబ్ల్యూ చెన్నై ప్లాంట్‌లో ఈ మోడల్‌ను ఉత్పత్తి చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న కంపెనీ విక్రయశాలల్లో పెట్రోల్‌, డీజిల్‌ వేరియంట్లలో లభించనుంది. పెట్రోల్‌ వెర్షన్‌ ధర రూ.53.5 లక్షలు కాగా.. డీజిల్‌ వేరియంట్‌ ధర రూ.54.9 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌).

* ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ ఆధ్వర్యంలోని లింక్డిన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. చైనాలో లింక్డిన్‌ కార్యకలాపాలను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. టెక్‌ సంస్థలపై అక్కడి ప్రభుత్వం విధిస్తున్న ఆంక్షల నేపథ్యంలో లింక్డిన్‌ నిర్వహణ కష్టసాధ్యంగా మారిందని పేర్కొంది. ప్రత్యేకంగా ఉద్యోగుల కోసమే రూపొందించిన లింక్డిన్ సేవల్ని నిలిపివేయడం వల్ల ఆ వర్గం ఇబ్బందులు ఎదుర్కోనున్న నేపథ్యంలో మరో ప్రత్యామ్నాయ వేదికను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రత్యేకంగా ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునేలా ఓ ప్రత్యేక యాప్‌ను రూపొందించనున్నట్లు పేర్కొంది. అయితే, దీంట్లో నెట్‌వర్కింగ్‌ ఫీచర్లు మాత్రం ఉండబోవని సంస్థ ఇంజినీరింగ్‌ విభాగం ఉపాధ్యక్షుడు మొహక్‌ ష్రాఫ్‌ తెలిపారు. 2014లో చైనాలో కార్యకలాపాల్ని ప్రారంభించిన లింక్డిన్‌కు ఇటీవల చైనా ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసినట్లు సమాచారం. లింక్డిన్‌లో సమాచారాన్ని మరింత నియంత్రించాలని అక్కడి సర్కార్‌ ఓ డెడ్‌లైన్ కూడా విధించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే లింక్డిన్‌ తాజా నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతోంది.

* పండుగ రోజూ సామాన్యుడిపై పెట్రో బాదుడు ఆగలేదు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వరుసగా రెండో రోజూ పెరిగాయి. ఇప్పటికే నూనెలు, వంటగ్యాస్‌ సహా ఇతర నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో చమురు ధరల పెంపు నుంచి కనీసం పండగరోజైనా ఉపశమనం లభిస్తుందని ఆశించిన సామాన్యులకు నిరాశే మిగిలింది. గత మూడు వారాల్లో డీజిల్‌ ధరలు 17 సార్లు పెరగ్గా.. పెట్రోల్‌ ధరలు 14 సార్లు ఎగబాకాయి. తాజాగా శుక్రవారం లీటర్‌ పెట్రోల్ 35 పైసలు‌, డీజిల్‌పై 36 పైసలు చొప్పున పెరిగాయి. ఈ పెంపుతో దిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.105.14కు, ముంబయిలో రూ.111.09కు చేరుకుంది. లీటర్‌ డీజిల్‌ ధర ముంబయిలో రూ.101.78ను, దిల్లీలో రూ.93.87ను తాకింది. తెలుగు రాష్ట్రాల్లో గరిష్ఠంగా గుంటూరులో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.112.04, డీజిల్‌ రూ.104.44కి చేరింది.

* కొవిడ్‌ సంక్షోభాన్ని భారత్‌ ఓ అవకాశంగా మలుచుకుందని.. కేవలం ఉద్దీపన చర్యలకే పరిమితం కాకుండా నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. తద్వారా దేశ సుస్థిరాభివృద్ధికి ప్రభుత్వం బాటలు వేసిందన్నారు. ఆ ఫలితంగానే భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుందని తెలిపారు. వాషింగ్టన్‌లో జరుగుతున్న ప్రపంచ బ్యాంకు అభివృద్ధి కమిటీ సమావేశంలో గురువారం ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

* ఐసీసీ పురుషుల టీ20 క్రికెట్‌ ప్రపంచ కప్‌లో భారత్‌ ఆడే మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాన్ని తమ థియేటర్లలో ప్రదర్శిస్తామని మల్టీప్లెక్స్‌ల నిర్వహణ సంస్థ ఐనాక్స్‌ లీజర్‌ తెలిపింది. టీ20 ప్రపంచకప్‌ పోటీలను యూఏఈ, ఒమన్‌లలో నిర్వహించనున్నారు. మ్యాచ్‌లు ఈనెల 17న ప్రారంభమవుతాయి, నవంబరు 14న ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. అన్ని ప్రధాన నగరాల్లోని తమ మల్టీప్లెక్స్‌ల్లో లీగ్‌ దశ నుంచే భారత మ్యాచ్‌లను ప్రదర్శిస్తామని ఐనాక్స్‌ తెలిపింది. పెద్ద తెరలపై ప్రత్యక్ష ప్రసారం ద్వారా, క్రికెట్‌ మైదానంలోనే మ్యాచ్‌ను వీక్షిస్తున్న అనుభూతిని ప్రేక్షకులకు కలగజేయాలన్నదే దీని వెనక ఉద్దేశమని కంపెనీ పేర్కొంది. మ్యాచ్‌లను వీక్షిస్తూ ఆహార పదార్థాల కోసమూ క్రికెట్‌ అభిమానులు ఆర్డరు ఇస్తారు కనుక.. అది కూడా వ్యాపారపరంగా సంస్థకు ప్రయోజనమే. క్రికెట్‌ మ్యాచ్‌ల వీక్షణకు టికెట్టు ధర నగరాన్ని బట్టి రూ.200 నుంచి రూ.500 వరకు ఉంటుందని తెలిపింది. ఐనాక్స్‌కు 70 నగరాల్లో 56 మల్టీప్లెక్స్‌లు, 658 తెరలు ఉన్నాయి.

* వరుసగా ఆరో రోజూ సూచీలు లాభాల జైత్రయాత్ర కొనసాగించాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలు, దేశీయ ఆర్థిక గణాంకాలు మదుపర్లను మెప్పించడంతో సెన్సెక్స్‌ చరిత్రలోనే తొలిసారిగా 61000 పాయింట్ల ఎగువన ముగిసింది. గత ఆరు ట్రేడింగ్‌ రోజుల్లో సెన్సెక్స్‌ 2116 పాయింట్లు, నిఫ్టీ 692 పాయింట్ల మేర దూసుకెళ్లాయి. 60,000 పాయింట్ల నుంచి 61,000కు రావడానికి సెన్సెక్స్‌కు 14 ట్రేడింగ్‌ రోజుల సమయం పట్టింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 11 పైసలు పెరిగి 75.26 వద్ద ముగిసింది. ఆసియా మార్కెట్లలో సియోల్‌, టోక్యో లాభపడగా, షాంఘై డీలాపడింది. ఐరోపా సూచీలు సానుకూలంగా కదలాడాయి.