DailyDose

ఆర్యన్‌ఖాన్…ఖైది నెం.956-నేరవార్తలు

ఆర్యన్‌ఖాన్…ఖైది నెం.956-నేరవార్తలు

* గుజరాత్‌లోని దేవ్‌భూమి ద్వారకా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మూఢనమ్మకంతో అమానుషానికి ఒడిగట్టారు. కోపంతో ఉన్న దేవత పూనిందని.. ఆమె అందరినీ చంపేస్తుందేమోనని భయపడి ఓ మహిళను అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనలో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఆరంభదా గ్రామానికి చెందిన రమీలా సోలంకి అనే మహిళ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనేందుకు బుధవారం సమీపంలోని ఒఖంబది గ్రామానికి భర్తతో కలిసి వెళ్లింది. అయితే ఉత్సవాల్లో పాల్గొన్న రమీలా ఒక్కసారిగా పూనకం వచ్చినట్లు ప్రవర్తించింది. అయితే ఆమెకు కోపంతో ఉన్న అమ్మవారు పూనిందని అక్కడే ఉన్న భూతవైద్యుడు రమేశ్‌ సోలంకి అక్కడి ప్రజలను నమ్మించాడు. కోపంతో ఉన్న అమ్మవారిని పారద్రోలాలని.. లేదంటే ఆమె అందరిని చంపేస్తుందని భయపెట్టాడు. కోపంతో ఉన్న అమ్మవారిని వెళ్లగొట్టేందుకు రమీలాను కొట్టాలని సూచించాడు. దీంతో అక్కడ ఉన్న ఆమె బంధువులు కర్రలు, మంటల్లో వేడి చేసిన ఇనుప గొలుసులతో రమీలాను చావబాదారు. దీంతో ఆమె తీవ్ర గాయాలతో మృతిచెందింది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్యలో పాల్గొన్న ఐదుగురిని అరెస్టు చేశారు. దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు.

* బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ తరచూ డ్రగ్స్‌ తీసుకుంటుంటారని మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ (ఎన్‌సీబీ) కోర్టుకు తెలిపిన సంగతి తెలిసిందే. ఇక బెయిల్‌ ఇవ్వొద్దని వాదించింది. దీంతో బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును ఈ నెల 20కి కోర్టు వాయిదా వేసింది. అప్పటివరకూ ఆర్యన్‌ జైల్లోనే ఉండనున్నాడు. ఇక జైల్లో ఖైదీగా ఉన్న ఆర్యన్‌కు అధికారులు నెం.956ని కేటాయించారు. ఇంటి నుంచి తండ్రి షారుక్‌ పంపిన రూ.4500 మనీ ఆర్డర్‌ను అందుకున్నాడు. ముంబయిలోని ఆర్థర్ రోడ్ జైలులోని క్యాంటీన్ ఖర్చులు (ఆహారంతో పాటు ఇతరత్రా అవసరాలు) కోసం ఈ మొత్తాన్ని వినియోగించనున్నాడు. జైలు నియమ నిబంధనల ప్రకారం.. అరెస్టయి జైల్లో ఉన్నవారికి రూ.4500 మాత్రమే గరిష్ఠంగా ఇచ్చేందుకు అనుమతిస్తారు. బొంబే హైకోర్టు ఆదేశానికి అనుగుణంగా.. ఖైదీలు వారానికి ఒకసారి వారి కుటుంబసభ్యులతో మాట్లాడే అవకాశం ఉంటుంది. ఆ ప్రకారం ఆర్యన్‌ శుక్రవారం తన తండ్రి షారుక్‌, అమ్మ గౌరీఖాన్‌తో కాసేపు వీడియోకాల్‌లో మాట్లాడినట్టు సమాచారం. ఆర్థర్ రోడ్ జైలు సూపరింటెండెంట్‌ నితిన్‌ మాట్లాడుతూ… ఆర్యన్‌కు జైలు ఆహారం మాత్రమే ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. స్టార్‌హీరో కొడుకు అయినా సరే! కోర్టు ఉత్తర్వులు జారీ అయ్యేవరకూ ఇంటి భోజనాన్ని కానీ బయటి ఆహారాన్ని కానీ అనుమతించే ప్రసక్తే లేదన్నారు. కొవిడ్ పరీక్షల్లో నెగెటివ్‌ రిపోర్టు రావడంతో కామన్‌ సెల్‌కి పంపించామన్నారు. ఇక జైల్లో ఆర్యన్‌ చాలా అసౌకర్యంగా ఉన్నారని, టెన్షన్‌ పడుతూ కనిపిస్తున్నట్లు సమాచారం. జైలు ఆహారాన్ని ఏ మాత్రం ఇష్టపడట్లేదట.

* గోపన్‌పల్లి ప్రాంతంలో ఈ నెల 11న వెలుగు చూసిన మేస్త్రీ శేఖర్‌ హత్య కేసును గచ్చిబౌలి పోలీసులు చేధించారు. వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని భావించి ప్రియుడితో కలిసి కట్టుకున్న భార్యే.. భర్తను హత్య చేయించినట్లు తేలింది. దీంతో మృతుడి భార్యతోపాటు అతని ప్రియుడిని గురువారం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్‌ గోనె సురేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్‌ జిల్లా లింగాల మండలం ధర్మారం తండాకు చెందిన ముడావత్‌ శేఖర్‌ (30)కు అదే ప్రాంతానికి చెందిన ముడావత్‌ జ్యోతి (26)కు పదేళ్ల క్రితం వివాహమైంది. మూడేళ్ల క్రితం గచ్చిబౌలి గోపన్‌పల్లి తండాకు వలస వచ్చారు. శేఖర్‌ మేస్త్రీ పనిచేస్తుండగా జ్యోతి కూలి పనిచేస్తుండేది. రామచంద్రాపురం ఉస్మాన్‌ నగర్‌కు దుడ్డెల మాణిక్యం(42) తెల్లాపూర్‌కు చెందిన రాజీవ్‌రెడ్డి వద్ద కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

* గద్వాల జిల్లాలోని ఇటిక్యాల మడలం ధర్మవరం వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు బోల్తా పడి 20మందికి గాయాలయ్యాయి. ప్రమాదం సమయంలో బస్సులో 50మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ బస్సు హైదరాబాద్‌ నుంచి కర్నూలు వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

* భర్త పండగకు రానన్నాడని మనస్తాపంతో ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. ఆమనగల్లు ఎస్సై ధర్మేశ్‌ తెలిపిన వివరాల ప్రకారం మేడిగడ్డకి చెందిన వడ్త్యావత్‌ మౌనిక (20)కు అదే గ్రామానికి చెందిన మేనమామ కుమారుడు అనిల్‌తో ఆరు నెలల కిందట వివాహం జరిగింది. అనిల్‌ డీసీఎం డ్రైవర్‌. దసరా పండగకు ఊరికి రావాలని భార్య మౌనిక భర్తకు ఫోన్‌ చేసింది. పని ఉందని వెంటనే రావడానికి వీలు కాదని చెప్పడంతో మనస్తాపానికి గురైంది. పొలానికి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు వెంటనే కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.

* తెలుగు అకాడమీ కేసులో హైదరాబాద్‌ సీసీఎస్ పోలీసులు మరొకరిని అరెస్టు చేశారు. గుంటూరుకు చెందిన సాంబశివరావును అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులు హైదరాబాద్‌కు తీసుకొచ్చి రిమాండ్‌కు తరలించారు. కెనరా బ్యాంకు మేనేజర్ సాధనకు సమీప బంధువైన సాంబశివరావు.. డిపాజిట్లు గోల్‌మాల్‌ చేసిన ముఠాకు సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. వెంకటరమణ అనే వ్యక్తి ద్వారా ప్రధాన నిందితుడు సాయి కుమార్‌ను పరిచయం చేసుకున్న సాంబశివరావు.. బ్యాంకుల్లోని ప్రభుత్వ శాఖల డిపాజిట్లను కొల్లగొట్టేందుకు ప్రణాళిక రూపొందించారు. ఈ క్రమంలో సాయి కుమార్‌కు కెనరా బ్యాంకు మేనేజర్ సాధనను సాంబశివరావు పరిచయం చేశారు. ఆ తర్వాత కొల్లగొట్టిన నగదులో సాంబశివరావు తన వాటాగా రూ.50 లక్షలు తీసుకున్నట్లు సీసీఎస్ పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం కెనరా బ్యాంకు మేనేజర్ సాధనను సీసీఎస్ పోలీసులు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. మూడు రోజుల నుంచి ప్రశ్నిస్తున్నా.. సాధన సరైన సమాధానాలు చెప్పడం లేదని తెలుస్తోంది. నిధులు గోల్‌మాల్‌ చేసిన వ్యవహారంలో సాధన దాదాపు రూ.2 కోట్లకుపైగా తన వాటాగా తీసుకున్నట్లు సీసీఎస్‌ పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. వాటాగా తీసుకున్న దానిలో రూ.80 లక్షలు కాల్చేసినట్లు సీసీఎస్ పోలీసులకు సాధన పొంతన లేని సమాధానం చెప్పారు. అవసరమైతే నోట్లు కాల్చేసిన స్థలానికి క్లూస్ టీంను తీసుకొని ఆధారాలు సేకరించాలనే యోచనలో సీసీఎస్ పోలీసులు ఉన్నారు. రేపటితో ఆమె కస్టడీ ముగుస్తుండటంతో మరో నాలుగు రోజులు కస్టడీ పొడిగించాలని సీసీఎస్ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం.