Health

ఏపీలో స్థిరంగా కరోనా-తాజావార్తలు

ఏపీలో స్థిరంగా కరోనా-తాజావార్తలు

* మావోయిస్టు పార్టీ అగ్రనేత అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ ఆర్కే మృతిని ఆ పార్టీ కేంద్ర నాయకత్వం ధ్రువీకరించింది. ఆయన మృతి చెందినట్టు పార్టీ కేంద్ర కమిటీ శుక్రవారం మధ్యాహ్నం ప్రకటించింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ అధికారిక ప్రతినిధి అభయ్‌ పేరుతో ఓ ప్రకటన విడుదలైంది. నిన్న ఉదయం 6గంటలకు ఆర్కే కన్నుమూసినట్టు వెల్లడించారు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆర్కే.. డయాలసిస్‌ జరుగుతుండగా ప్రాణాలు విడిచారని పేర్కొన్నారు. ‘‘ఆర్కే మృతి మా పార్టీకి తీరని లోటు. 1978లో ఆయన పీపుల్స్‌ వార్‌ సభ్యత్వం తీసుకున్నారు. 1982 నుంచి పూర్తికాలం కార్యకర్తగా వచ్చారు. 1986లో గుంటూరు జిల్లా కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1992లో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా.. 2000లో ఆంధ్ర రాష్ట్ర కార్యదర్శిగా.. 2001లో కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2004లో ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో కీలక పాత్ర పోషించారు. చర్చల తర్వాత ఆర్కే హత్యకు ప్రయత్నాలు జరిగాయి. 2004 నుంచి పదేళ్ల పాటు ఏవోబీ కార్యదర్శిగా కొనసాగారు. అలాగే, 2018లో కేంద్ర కమిటీ పొలిట్‌బ్యూరోలో ఆర్కేకు స్థానం లభించింది. 2018లో ఆర్కే కుమారుడు మున్నా మృతి చెందారు ’’ అని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటనలో పేర్కొంది.

* తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో విజయదశమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎస్పీఎఫ్‌ సిబ్బంది ఆయుధ పూజ నిర్వహించారు. కొండ కింద వాహన పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రముఖ సినీ దర్శకుడు రాఘవేంద్రరావు ఉదయం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేసి స్వామివారి లడ్డూ ప్రసాదం అందజేశారు.

* మెగాస్టార్‌ చిరంజీవి ఓ గుడ్‌ న్యూస్‌ చెప్పారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి గత కొన్ని రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయినట్టు చిరు వెల్లడించారు.

* ట్విటర్‌ వేదికగా నిర్వహించిన ‘ఆస్క్‌ఎస్‌ఆర్కే’ సెషన్‌లో ఓ అభిమాని.. ఈ సారి కోల్‌కతా కప్ గెలుస్తుందా..? అని ప్రశ్నించాడు. దానికి సమాధానంగా.. ‘గెలుస్తుందనే అనుకుంటున్నా.. ఒకవేళ కోల్‌కతా కప్‌ గెలిస్తే ఆ కప్‌లోనే కాఫీ తాగుతాను’ అని షారుఖ్‌ ఖాన్‌ సమాధానం ఇచ్చాడు.

* రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజా సంక్షేమం ఉంటుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌ మెట్‌ మండలం బాటసింగారం లాజిస్టిక్స్‌ పార్క్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన పండ్ల మార్కెట్‌ ను మంత్రి చేతుల మీదుగా ప్రారంభించారు. గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ తరలించి బాటసింగారంలో తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, కిషన్‌రెడ్డి, మార్కెటింగ్‌శాఖ డైరెక్టర్‌ లక్ష్మీబాయి, జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పెరుగుతున్న జనాభా, ట్రాఫిక్‌ రద్దీని దృష్టిలో పెట్టుకుని గడ్డిఅన్నారం నుంచి బాటసింగారం లాజిస్టిక్‌ పార్క్‌లో తాత్కాలిక పండ్ల మార్కెట్‌ ఏర్పాటు చేసిన దృష్ట్యా కమీషన్‌ ఏజెంట్లు సహకరించాలని మంత్రి కోరారు.

* ఏపీ పరిధిలోని జల విద్యుత్‌ కేంద్రాలను కేఆర్‌ఎంబీకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. శ్రీశైలం కుడిగట్టున ఉన్న పవర్‌ హౌస్‌ను, సాగర్‌ కుడి కాల్వపై ఉన్న విద్యుత్‌ కేంద్రాన్ని అప్పగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. తెలంగాణ అప్పగించాకే తమ పవర్‌ హౌస్‌లను బోర్డు పరిధిలోకి తీసుకోవాలని షరతు విధించిన ఏపీ సర్కార్‌.. పవర్‌ ప్రాజెక్టుల్లోని భవనాలు, కట్టడాలు, యంత్ర సామాగ్రిని కేఆర్‌ఎంబీకి అప్పగించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.

* సమైక్యాంధ్ర ఉద్యమం తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఏ పార్టీ టికెట్‌ ఇచ్చినా .. ఇవ్వకపోయినా పోటీచేయడం మాత్రం ఖాయమన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ఘాటుగా స్పందించారు.

* ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 44,946 మంది నమూనాలు పరీక్షించగా 586 కొత్త కేసులు నమోదయ్యాయి. 9 మంది మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 712 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 6,453 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది. కొవిడ్‌ వల్ల చిత్తూరులో ముగ్గురు, ప్రకాశంలో ముగ్గురు కృష్ణాలో ఇద్దరు, నెల్లూరులో ఒకరు మృతి చెందారు.

* మధ్యతరగతి వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని వారికి అవసరమైన ఉత్పత్తులను తయారుచేస్తున్నామని సంఘం డెయిరీ ఛైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌ తెలిపారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని సంగం డెయిరీ ఆవరణలో దసరా పండుగను పురస్కరించుకొని ఉస్మానియా సాల్టెడ్‌ బిస్కట్లు, ఫ్లమ్‌ కేక్‌, ఎగ్‌లెస్‌ కేక్‌, హాయ్‌ అరోమా నెయ్యి 30, 50 గ్రాముల ప్యాకింగ్‌, 5 లీటర్ల ఆవునెయ్యి, గేదె నెయ్యి విడుదల చేశారు.

* పిజ్జా, చిప్స్‌, పేస్ట్రీ వంటి ఫాస్ట్‌ఫుడ్స్‌ను చూడగానే తినేయాలనేపిస్తుంది కదూ! అయితే.. ఈసారి మాత్రం అవి తినాలంటే ఆలోచించాల్సిందే. ఎందుకంటే…. ఇప్పటి వరకూ ఈ హైలీ ప్రాసెస్ట్‌ ఫుడ్స్‌ తింటే బరువు పెరగడం, మధుమేహం, రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయనే తెలుసు. ఇప్పుడా జాబితాలోకి జ్ఞాపకశక్తి తగ్గే అవకాశం ఉన్నట్లు తాజా పరిశోధనలో తేలింది. బ్రెయిన్‌, బిహేవియర్‌, ఇమ్యూనిటీ జర్నల్‌ ప్రచురించిన అధ్యయనంలో.. హైలీ ప్రాసెస్ట్‌ ఫుడ్స్‌ (నిల్వపదార్థాలు, కొవ్వు శాతం, ఆర్టిఫిషియల్‌ రంగు, ఫ్లేవర్‌ ఉండేవి) తీసుకున్నట్లే అవి మెమొరీ లాస్‌ వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

* మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్ ఆరోగ్యంగా ఉన్నారని, గురువారం కంటే ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని కాంగ్రెస్‌ వెల్లడించింది. ఈ మేరకు శుక్రవారం ఆ పార్టీ సెక్రటరీ ప్రణవ్ ఝా ట్వీట్ చేశారు. ‘మన్మోహన్‌ సింగ్‌జీ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారు. నిన్నటికంటే ఆయన ఆరోగ్యం మెరుగుపడింది. ఆయన వేగంగా కోలుకోవాలని మనమంతా కోరుకుందాం. అనవసరమైన ఊహాగానాలకు తావివ్వొద్దు. మాజీ ప్రధాని గోప్యతను మనమంతా గౌరవిద్దాం’ అంటూ ప్రణవ్‌ ఝా వెల్లడించారు.

* దుర్గా పూజల వేళ బంగ్లాదేశ్‌లో మత ఘర్షణలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆ దేశ ప్రధాని షేక్‌ హసీనా హామీ ఇచ్చారు. దుండగులు ఏ వర్గానికి చెందినవారైనా వదిలిపెట్టేది లేదన్నారు. ‘‘కుమిల్లాలో జరిగిన ఘటనపై క్షుణ్నంగా దర్యాప్తు చేస్తాం. కారకులను వదిలిపెట్టేది లేదు. వారు ఏ మతానికి చెందినవారైనా కఠిన చర్యలు తప్పవు. వారిని పట్టుకొని కఠినంగా శిక్షిస్తాం. ఈ ఘటనపై ఇప్పటికే చాలా సమాచారం అందింది. ఇది సాంకేతికయుగం. ఈ ఘటనకు కారణమైన ప్రతిఒక్కరినీ సాంకేతికత సాయంతో వీలైనంత త్వరగా పట్టుకొని తీరతాం’’ అని ఢాకాలోని ఢాకేశ్వరీ జాతీయ ఆలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ హసీనా ఈ వ్యాఖ్యలు చేశారు.

* బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ తరచూ డ్రగ్స్‌ తీసుకుంటుంటారని మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ (ఎన్‌సీబీ) కోర్టుకు తెలిపిన సంగతి తెలిసిందే. ఇక బెయిల్‌ ఇవ్వొద్దని వాదించింది. దీంతో బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును ఈ నెల 20కి కోర్టు వాయిదా వేసింది. అప్పటివరకూ ఆర్యన్‌ జైల్లోనే ఉండనున్నాడు. ఇక జైల్లో ఖైదీగా ఉన్న ఆర్యన్‌కు అధికారులు నెం.956ని కేటాయించారు. ఇంటి నుంచి తండ్రి షారుక్‌ పంపిన రూ.4500 మనీ ఆర్డర్‌ను అందుకున్నాడు. ముంబయిలోని ఆర్థర్ రోడ్ జైలులోని క్యాంటీన్ ఖర్చులు (ఆహారంతో పాటు ఇతరత్రా అవసరాలు) కోసం ఈ మొత్తాన్ని వినియోగించనున్నాడు.

* ఎలాంటి రాజకీయ నేపథ్యం, వంశపారంపర్య మద్దతు లేకున్నా దేశానికి సేవ చేసే అవకాశం ప్రజలు కల్పించారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఓ సామాన్య కుటుంబం నుంచి వచ్చిన తనకు గుజరాత్‌ సీఎం నుంచి నేడు ప్రధానమంత్రిగా సేవలందించే భాగ్యం కల్పించారన్నారు. సూరత్‌లో ఓ బాలుర వసతి గృహం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మోదీ.. కేవలం ప్రజల ఆశీస్సులతోనే గడిచిన 20ఏళ్లుగా ప్రభుత్వాధినేతగా కొనసాగుతున్నానని అన్నారు.

* రాబోయే టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్లతో చెలరేగాలని టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ యువ కీపర్‌ రిషభ్‌ పంత్‌కు సూచించాడు. ధనాధన్‌ బ్యాటింగ్‌తో జట్టుకు విజయాలందించాలని కోరాడు. లేదంటే తనకు చాలా మంది కీపర్లు ఉన్నారని హెచ్చరించాడు. దీనికి స్పందించిన యువ బ్యాట్స్‌మన్‌, కీపర్‌.. అందుకు తగ్గట్టే తాను సన్నద్ధమవుతున్నానని చెప్పాడు. రెండు రోజుల్లో టీ20 ప్రపంచకప్‌ ప్రారంభమవుతున్న నేపథ్యంలో టోర్నీ ప్రసార హక్కుదారులు తాజాగా ఓ సరదా యాడ్‌ రూపొందించారు. అందులో కోహ్లీ, పంత్‌ మధ్య ఇలాంటి సరదా సంభాషణ చోటుచేసుకుంది.