Business

Foxconn నుండి విద్యుత్ వాహనాలు-వాణిజ్యం

Foxconn నుండి విద్యుత్ వాహనాలు-వాణిజ్యం

* యాపిల్‌, ఇతర అంతర్జాతీయ బ్రాండ్ల కోసం స్మార్ట్‌ఫోన్‌లను తయారు చేసే ఫాక్స్‌కాన్‌ విద్యుత్‌ కార్లను ఉత్పత్తి చేసే ప్రణాళికలను ప్రకటించింది. కాంట్రాక్టు పద్ధతిలో వాహన సంస్థల కోసం విద్యుత్‌ కార్లను ఫాక్స్‌కాన్‌ తయారుచేయనుంది. చైనా, ఉత్తర అమెరికా, ఐరోపా, ఇతర విపణుల్లో వాహన సంస్థలకు కార్లు, బస్సులను ఫాక్స్‌కాన్‌ టెక్నాలజీ గ్రూప్‌ ఉత్పత్తి చేస్తుందని, మార్కెట్‌కు అనుగుణంగా ఖాతాదారులు డిజైన్‌, ఫీచర్లను మార్చుకోవచ్చని సంస్థ ఛైర్మన్‌ యంగ్‌ లూ వెల్లడించారు. హాన్‌ హయ్‌ ప్రెసిషన్‌ ఇండస్ట్రీగా సుపరిచిమైన ఫాక్స్‌కాన్‌.. విద్యుత్‌ వాహనాల ఉత్పత్తి కోసం పలు వాహన సంస్థలు, ప్రతిష్ఠాత్మక అంకుర సంస్థలతో చర్చలు జరుపుతోంది. ఇటలీ సంస్థ పినిన్‌ఫార్నియా అభివృద్ధి చేసిన ‘ఇ సెడాన్‌’ మోడల్‌ను 2023లో విడుదల చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. అయిదు సీట్లు కలిగిన ‘మోడల్‌ ఇ’ను ఒకసారి ఛార్జ్‌ చేస్తే 750 కిలోమీటర్లు ప్రయాణించొచ్చని కంపెనీ చెబుతోంది. ఫాక్స్‌కాన్‌ ఖాతాదారులుగా ఫిస్కర్‌, తైవాన్‌ సంస్థ యూలాంగ్‌ గ్రూప్‌లు ఉన్నట్లు లూ వెల్లడించారు. ఇతర ఖాతాదారులుగా స్టెల్లాంటిస్‌, ఫియట్‌ క్రిస్లర్‌, పిజియోట్‌ల విలీన సంస్థలు ఉండొచ్చని గతవారం తైవాన్‌ పత్రిక పేర్కొంది. కానీ దీన్ని లూ ధ్రువీకరించలేదు. ఫాక్స్‌కాన్‌ మొదటి విద్యుత్‌ బస్సు ‘మోడల్‌ టీ’పై ఒకసారి ఛార్జింగ్‌తో 400 కి.మీ వరకు ప్రయాణం చేయొచ్చని తెలిపింది.

* దేశీయ మార్కెట్ల లాభాల జోరుకు అడ్డుకట్ట పడింది. గత ఏడు సెషన్లలో దూకుడు మీదున్న బుల్‌.. మంగళవారం నాటి ట్రేడింగ్‌లో ఒడుదొడుకులను ఎదుర్కొంది. గరిష్ఠ స్థాయిలో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో నేటి ట్రేడింగ్‌లో సూచీలు స్వల్ప నష్టాలను చవిచూశాయి. దేశీయంగా ఉన్న బలమైన సానుకూల సంకేతాలతో ఈ ఉదయం సూచీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. దాదాపు 400 పాయింట్ల లాభంతో ట్రేడింగ్‌ను మొదలుపెట్టిన బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ సెన్సెక్స్‌ ఆరంభంలోనే 62వేల మైలురాయిని దాటింది. ఒక దశలో 62,245 వద్ద సరికొత్త జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. అయితే కాసేపటికే సూచీ జోరు నెమ్మదించింది. గరిష్ఠ స్థాయిలో మదుపర్లు లాభాల స్వీకరణకు దిగారు. దీంతో ఆరంభ లాభాలను కోల్పోయిన సెన్సెక్స్‌ నష్టాల్లోకి జారుకుంది. రోజులో చాలా వరకు లాభనష్టాల్లో ఊగిసలాడిన సూచీ.. చివరకు 49.54 పాయింట్లు కోల్పోయి 61,716.05 వద్ద ముగిసింది. అటు జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ కూడా 58.30 పాయింట్లు దిగజారి.. 18,418.75 వద్ద స్థిరపడింది.

* బీఎస్‌ఈలో రూ.లక్ష కోట్ల మార్కెట్‌ క్యాపిటలైజేషన్ కలిగిన కంపెనీల జాబితాలో ‘ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌(ఐఆర్‌సీటీసీ)’ చేరింది. మంగళవారం ఈ కంపెనీ షేరు విలువ ఓ దశలో 8 శాతం పెరిగి రూ.6,332.25కు చేరడంతో ఈ ఘనత సాధించింది. గత ఐదు ట్రేడింగ్‌ సెషన్లలో షేరు ధర ఏకంగా 33 శాతం ఎగబాకడం విశేషం. ప్రస్తుతం బీఎస్‌ఈలో రూ.1,00,612 కోట్లతో ఈ సంస్థ మార్కెట్‌ విలువ పరంగా 57వ స్థానంలో ఉంది. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ వంటి సంస్థలను వెనక్కి నెట్టింది.

* వచ్చే నెలలో విడుదల కానున్న ‘ఆడీ క్యూ5’ కార్ల బుకింగులు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఎక్కడైనా ఆడీ డీలర్‌షిప్‌లలో రూ.రెండు లక్షలు చెల్లించి కారును బుక్‌ చేసుకోవచ్చు. రెండు లీటర్ల పెట్రోల్‌ ఇంజిన్‌తో వస్తున్న ఈ కారు 370 ఎన్‌ఎం టార్క్‌ వద్ద 249 హెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది. వెనుకభాగంలో రెండు ఎయిర్‌బ్యాగ్‌లు సహా మొత్తం 8 ఎయిర్‌బ్యాగ్‌లను అమర్చారు. ఆడీ పార్క్‌ అసిస్ట్‌, కంఫర్ట్‌ కీ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. సరికొత్త క్యూ5 ఎస్‌యూవీని విడుదల చేయనున్న ఆడీ.. భారత్‌లో విక్రయాలను పెంచేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. వాహనాలు బీఎస్‌-6లోకి మారిన సందర్భంగా గత ఏడాది క్యూ3, క్యూ7 సహా పాత క్యూ5 కార్ల విక్రయాలను నిలిపివేసింది. గత ఏడాది ఆడీ 1,639 యూనిట్లను విక్రయించింది. ఈ ఏడాది తొలి ఎనిమిది నెలల విక్రయాల్లో 115 శాతం వృద్ధి నమోదైంది.

* పోస్టాఫీస్‌లో పీపీఎఫ్‌, ఎన్ఎస్‌సీ వంటి చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కాల‌లో చేరిన ఖాతాదారులు ఇప్పుడు ఐవీఆర్ సేవ‌ల‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు. పోస్టాఫీస్.. త‌మ‌ సేవింగ్స్ బ్యాంక్‌(పీఓఎస్‌బి) ఖాతాదారుల కోసం “ఇంట‌రాక్టీవ్ వాయిస్ రెస్పాన్స్‌(ఐబీఆర్‌)” స‌దుపాయాన్ని ప్రారంభించింది. పోస్టాఫీస్ విడుద‌ల చేసిన స‌ర్క్యుల‌ర్ ప్ర‌కారం ఖాతాదారులు వివిధ ర‌కాల సేవ‌ల కోసం 18002666868 టోల్‌ఫ్రీ నెంబ‌రుకు డ‌య‌ల్ చేసి ఐవీఆర్ స‌దుపాయాన్ని ఉప‌యోగించుకోవ‌చ్చు. పోస్టాఫీసు అందిస్తున్న‌ వివిధ పొద‌పు ప‌థ‌కాల‌కు సంబంధించిన స‌మాచారాన్ని తెలుసుకోవ‌చ్చు.