Videos

పట్టాభి నోటిదురుసు…దాడి చేసిన వైకాపా. ఏపీ బంద్‌కు తేదేపా పిలుపు-తాజావార్తలు

దాడులకు నిరసనగా రేపు ఏపీ బంద్‌కు తేదేపా పిలుపు-తాజావార్తలు

* ఏపీ రాజకీయాల్లో కొత్త సంస్కృతి మొదలైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీ కార్యాలయాలపైనే దాడులు జరుగుతున్నాయి. సీఎం జగన్‌ను తెదేపా నేతలు విమర్శించడాన్ని నిరసిస్తూ వైకాపా శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో తెదేపా కార్యాలయాలు, నేతల నివాసాలపై దాడులకు తెగబడ్డారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈదాడిలో కార్యాలయం అద్దాలు, ఫర్నిచర్‌ ధ్వంసమయ్యాయి. కార్యాలయం వద్ద నిలిపిఉంచిన వాహనాలపై కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేశారు. దీంతో కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. దాడి సమయంలో తెదేపా కార్యాలయంలో ఉన్న కెమెరా మెన్‌ బద్రీకి తీవ్రగాయాలయ్యాయి. దీంతో వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడిని నిరసిస్తూ ఆపార్టీ శ్రేణులు జాతీయరహదారిపై ధర్నాకు దిగారు. రేపు ఏపీ బంద్‌కు తెదేపా పిలుపునిచ్చింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయమేర్పడింది. తెదేపా కార్యాలయంపై దాడి విషయం తెలుసుకన్న తెదేపా శ్రేణులు మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి భారీగా తరలివచ్చారు.

* దళితబంధు విషయంలో తెరాస, భాజపాలు కపట నాటకాలు ఆడుతున్నాయని కాంగ్రెస్‌ శాసనసభ పక్షనేత భట్టి విక్రమార్క విమర్శించారు. బడుగు, బలహీన వర్గాలకు భాజపా వ్యతిరేకమన్న భట్టి.. అందుకే ఆ పార్టీ నిర్ణయాలు అలాగే ఉంటాయని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను ప్రజలు గమనించాలని కోరారు. హుజూరాబాద్‌ ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేసి భాజపాకు, తెరాసలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. హుజూరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉపఎన్నిక ముగిసేంత వరకు అక్కడ దళితబంధు పథకం అమలును నిలుపుదల చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం నిన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే.

* ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. టీడీపీ కార్యాలయాలపై దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారాయని ఆయన మండిపడ్డారు. టీడీపీ కార్యాలయాలపై దాడికి నిరసనగా బుధవారం ఏపీ బంద్కు టీడీపీ పిలుపునిచ్చారు.

* వైసీపీ దాడులకు నిరసనగా బంజారాహిల్స్ లోని టీడీపీ జాతీయ కార్యాలయం వద్ద భారీ ఆందోళన. జగన్ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన టీడీపీ కార్యకర్తలు.

* రాష్ట్రాన్ని వైసీపీ ఎటు తీసుకు పోతోంది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? టీడీపీ రాష్ట్ర కార్యాలయం, ఇతర కార్యాలయాల పై దాడి అమానుషం. ప్రతిపక్షాలకు ప్రశ్నించే హక్కు లేదా ? – ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్

* మోడల్‌, నటి షెర్లిన్‌ చోప్రాపై శిల్పాశెట్టి, రాజ్‌కుంద్రా దంపతుల తరఫు న్యాయవాదులు రూ. 50 కోట్ల పరువు నష్టం దావా వేశారు. రాజ్‌కుంద్రాపై షెర్లీ చేసిన ఆరోపణలు నిరాధారమని తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే రాజ్‌కుంద్రాపై కేసు పెట్టిన షెర్లిన్‌ లైంగికంగా, మానసికంగా తనని వేధిస్తున్నాడంటూ ఇటీవల మరోసారి ఎఫ్.ఐ.ఆర్‌. నమోదు చేయించింది. తాజాగా ఈ కేసు విషయమై రాజ్‌కుంద్రా దంపతుల తరఫు న్యాయవాదులు షెర్లిన్‌పై రూ. 50 కోట్ల పరువు నష్టం దావా వేశారు. రాజ్‌కుంద్రాపై ఆమె చేసిన ఆరోపణలు నిరాధారమని, వాటిల్లో ఏమాత్రం నిజం లేదని, అవన్నీ అవాస్తవమని, నిరూపించేందుకు ఆమె దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. వివాదాలు సృష్టించేందుకు, మీడియాని ఆకర్షించేందుకు ఇలా చేసిందంటూ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు. అశ్లీల చిత్రాలు తెరకెక్కిస్తున్నారనే కారణంగా రాజ్‌కుంద్రా అరెస్టయిన సంగతి తెలిసిందే.

* యాదాద్రి ఆలయం పునః ప్రారంభం ఎప్పుడెప్పుడా అని తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఇవాళ యాదాద్రిలో పర్యటించిన సీఎం కేసీఆర్‌ మహూర్తం తేదీని ప్రకటించారు. వచ్చే ఏడాది మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ ఉటుందని సీఎం తెలిపారు. మహాకుంభ సంప్రోక్షణ కోసం వివిధ పీఠాలకు ఆహ్వానం పంపనున్నట్టు చెప్పారు. మహాకుంభ సంప్రోక్షణకు 8 రోజుల ముందు మహా సుదర్శనయాగం ఉంటుందని సీఎం వివరించారు.

* రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దినదినగండంలా మారిందే తప్ప నూరేళ్ల ఆయుష్షు లేదని.. మున్ముందు ప్రతి నెలా జీతాలు, పింఛన్లు ఇవ్వడం కష్టమవుతుందని రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ప్రధాన కార్యదర్శి, భాజపా నాయకులు ఐవైఆర్‌ కృష్ణారావు ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలోని భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఆందోళన కలిగించేలా ఉందని, ఇలాంటి స్థితి దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదన్నారు. గృహనిర్మాణ పథకాల కొనసాగింపునకు సిమెంట్‌, ఇనుము డీలర్లతో ఓ ఆర్డీఓ సమావేశం నిర్వహించి తమకు అప్పుగా ఇవ్వాలని, ప్రభుత్వం నుంచి నిధులు వచ్చిన తర్వాత సర్దుబాటు చేస్తామని కోరారని చెప్పారు. ఈ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు జీతాలు, పింఛన్ల చెల్లింపు ఆలస్యం సర్వ సాధారణంగా మారిందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో దారం, ఇతర పరికరాల కొరత, ఆదాయం కోసం విశాఖలో ఆస్తులు తాకట్టుపెడుతుండటం వంటివి రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి అద్దంపడుతున్నాయని చెప్పారు.

* సరిహద్దుల్లో పాకిస్థాన్‌ చర్యల వల్ల భారత సైనికులు ప్రాణాలు కోల్పోతుంటే ఆ దేశంతో టీ20 ఆడతారా? అని ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ప్రధాని మోదీని ప్రశ్నించారు. అంతేకాకుండా దేశంలో పెరుగుతున్న ఇంధన ధరలు, సరిహద్దుల్లో చైనా ఆక్రమణలపై ప్రధాని ఎందుకు మాట్లాడం లేదన్నారు. చైనా గురించి మాట్లాడాలంటే మోదీకి భయమని ఒవైసీ విమర్శించారు.

* జలాంతర్గామి నుంచి ప్రయోగించినట్లు అనుమానిస్తున్న ఓ క్షిపణిని ఉత్తరకొరియా ప్రయోగించింది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా సైన్యం ధ్రువీకరించింది. మంగళవారం దక్షిణ కొరియా జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ మాట్లాడుతూ ఉత్తరకొరియాలోని ‘పోర్ట్‌ ఆఫ్‌ సిన్పో’ నుంచి దీనిని ప్రయోగించినట్లు పేర్కొన్నారు. ఈ పోర్టులో తరచూ సబ్‌మెరైన్లను నిలుపుతుంటారు. ఇక్కడి నుంచి ప్రయోగించిన క్షిపణి జపాన్‌ సముద్రంలో పడింది. ఈ నేపథ్యంలో దీనిని సబ్‌మెరైన్‌ నుంచి ప్రయోగించినట్లు అనుమానిస్తున్నారు. ఈ క్షిపణి 60 కిలోమీటర్ల ఎత్తులో 450 కిలోమీటర్లు ప్రయాణించింది. ఈసందర్భంగా జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిద మాట్లాడుతూ ఈ పరీక్షలపై విచారం వ్యక్తం చేశారు. దక్షిణ కొరియా, జపాన్‌లు ఈ క్షిపణి పరిధిలోకి వచ్చాయి. వాస్తవానికి ఈ క్షిపణి 1900 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు.

* బంగ్లాదేశ్‌లో చోటుచేసుకుంటున్న హింసాత్మక సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్‌ పేర్కొన్నారు. ముఖ్యంగా అక్కడి మదర్సాలు ఛాందసవాదానికి కేంద్ర బిందువులుగా మారుతున్నాయన్న ఆమె.. షేక్‌ హసీనా ప్రభుత్వం మతాన్ని రాజకీయాలకు వాడుకుంటోందని ఆరోపించారు. అంతేకాకుండా బంగ్లాదేశ్‌లో హిందూ, బౌద్ధమతస్థులను మూడో తరగతి పౌరులుగా మారడంతో పాటు అక్కడి పౌరుల్లో హిందూ వ్యతిరేక భావజాలం పెరిగిపోతుండడం ఆందోళన కలిగించే విషయమని తస్లీమా నస్రీన్‌ అభిప్రాయపడ్డారు.