Business

చైనాలో స్థిరాస్తి సంక్షోభం-వాణిజ్యం

చైనాలో స్థిరాస్తి సంక్షోభం-వాణిజ్యం

* రికార్డుల జోరు నుంచి మంగళవారం వెనక్కి తగ్గిన సూచీలు నేడూ అదే బాటలో పయనించాయి. ఇటీవలి గరిష్ఠాల నేపథ్యంలో మదుపర్లు లాభాలు స్వీకరించడంతో సూచీలు నేడు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ఒక్క టెలికాం మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాలు చవిచూశాయి. ఆసియా మార్కెట్లు నేడు మిశ్రమంగా కదలాడాయి. ఐరోపా సూచీలు సైతం మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్‌ ఉదయం 61,800.07 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించింది. ఇంట్రాడేలో 61,109.29 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని చేరింది. చివరకు 456.09 పాయింట్ల నష్టంతో 61,259.96 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 152.15 పాయింట్లు కోల్పోయి 18,266.60 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 18,209.35 వద్ద కనిష్ఠాన్ని నమోదు చేసింది.

* చైనా స్థిరాస్తి రంగంలో సంక్షోభం మరింత ముదురుతోంది. ఇప్పటికే ఆ దేశంలో రెండో అతిపెద్ద సంస్థ ఎవర్‌గ్రాండె బాండ్లు, రుణాలను చెల్లించలేనని చేతులెత్తేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మరో కంపెనీ ఫాంటాసియా కూడా బాండ్లకు చెల్లింపులు చేయలేకపోయింది. ఇప్పట్లో ఈ సంక్షోభం గట్టెక్కే సూచనలు కనిపించడంలేదు. తాజాగా మరో సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. కేవలం నెల రోజుల వ్యవధిలో చైనా రియల్‌ ఎస్టేట్ కంపెనీలు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోవడం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది.

* చైనా బిలియనీర్‌, ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ అలీబాబా వ్యవస్థాపకుడు జాక్‌ మా ఐరోపా పర్యటనలో ఉన్నారు. చైనా ప్రభుత్వంతో చిక్కుల్లో ఇరుక్కున్న తర్వాత జాక్‌ మాకు ఇదే తొలి విదేశీ పర్యటన. ఐరోపాకు బయలుదేరడానికి ముందు కొన్ని రోజులు ఆయన తన కుటుంబంతో కలిసి హాంకాంగ్‌లో గడిపారు. ప్రస్తుతం జాక్‌ మా స్పెయిన్‌లో ఉన్నారు. వ్యవసాయ, పర్యావరణ సంబంధిత సాంకేతికత అధ్యయనంలో భాగంగా ఆయన అక్కడికి వెళ్లినట్లు సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌ వెల్లడించింది.

* రెండు రోజుల విరామం తర్వాత దేశంలో ఇంధన ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. బుధవారం (20-10-2021) లీటర్‌ పెట్రోలు, డీజిల్‌పై గరిష్ఠంగా 35 పైసల చొప్పున ఎగబాకింది. దీంతో దేశ రాజధాని దిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.106.19, డీజిల్‌ రూ.94.92కు చేరింది. వాణిజ్య రాజధాని ముంబయిలో ఈ ధరలు వరుసగా రూ.112.11, రూ.102.89గా ఉన్నాయి. ఇప్పటికే అన్ని రాష్ట్ర రాజధానుల్లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.100 మార్క్‌ను దాటేయగా.. డీజిల్‌ ధర సైతం మెజారిటీ పట్టణాల్లో రూ.100 దాటింది. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో లీటర్‌ పెట్రోల్‌ ఏకంగా రూ.118.23గా నమోదైంది. ఇక్కడ డీజిల్‌ ధర రూ.109.04 గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ధర 84.53 డాలర్లుగా నమోదవుతోంది. ఇది ఏడేళ్ల గరిష్ఠం కావడం గమనార్హం. సెప్టెంబరు 24 తర్వాత డీజిల్‌ ధర రూ.6.50, పెట్రోల్‌ ధర రూ.5 పెరగడం గమనార్హం.