DailyDose

చందానగర్‌లో దారుణం-నేరవార్తలు

చందానగర్‌లో దారుణం-నేరవార్తలు

* హైదరాబాద్‌లోని చందానగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధి పాపిరెడ్డి కాలనీలో విషాదం చోటు చేసుకుంది. తోటిపిల్లలతో ఆడుకుంటూ ఏడేళ్ల బాలుడు డ్రైనేజీ సంపులో పడి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. పాపిరెడ్డి కాలనీ రాజీవ్‌ గృహకల్ప ప్రాంతానికి చెందిన రాజు, అనుబాయి దంపతుల కుమారుడు అరవింద్‌(7). మంగళవారం సాయంత్రం ఆడుకుంటూ ఆదృశ్యమయ్యాడు.

* శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బడివానిపేట సమీపంలోని నల్ల చెరువులో ఓ ప్రైవేటు పాఠశాల బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందగా మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు బస్సులోని మిగతా విద్యార్థులను బయటకు తీసి చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో బడివానిపేట గ్రామానికి చెందిన మైలపల్లి రాజు(8) మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటన జరిగిన సమయంలో బస్సులో ఐదుగురు విద్యార్థులన్నట్లు పోలీసులు తెలిపారు. చెరువులో పడిన కొంగర గ్రామానికి చెందిన బస్సును జేసీబీ సాయంతో బయటకు తీశారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న విద్యార్థుల కుటుంబ సభ్యులు, సమీప గ్రామానికి చెందిన ప్రజలు చెరువు వద్దకు భారీగా చేరుకున్నారు.

* సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్‌ సర్క్యూట్‌తో విద్యుత్‌ ప్యానెల్‌ బోర్డులో మంటలు ఎగిసిపడ్డాయి. ఆందోళన చెందిన ఆస్పత్రి సిబ్బంది అగ్నిమాపకశాఖకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదం స్వల్పమైనదేనని అగ్నిమాపక అధికారులు తెలిపారు.

* తెలుగు అకాడమీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు కాజేసిన కేసులో పదహారో నిందితుడు కృష్ణారెడ్డిని హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు. తెలుగు అకాడమీకి చెందిన రూ.65.05కోట్ల ఎఫ్‌డీలను కొల్లగొట్టిన సాయికుమార్‌ ముఠాలో ఇతడు కీలకపాత్ర పోషించాడు. తనవాటాగా రూ.6 కోట్లు తీసుకున్నాడు. పోలీసులు సాయికుమార్‌ను అరెస్ట్‌ చేసిన విషయం తెలుసుకున్న కృష్ణారెడ్డి కొద్దిరోజుల క్రితం పారిపోయాడు. అతడి కదలికలపై నిఘా ఉంచి మియాపూర్‌లో అదుపులోకి తీసుకున్నామని ఏసీపీ మనోజ్‌ కుమార్‌ తెలిపారు. సాయికుమార్, డాక్టర్‌ వెంకట్, నండూరి వెంకటరమణలతో కృష్ణారెడ్డికి మూడేళ్ల నుంచి స్నేహం ఉందని, రియల్‌ వ్యాపారాలు నిర్వహించాడని ఏసీపీ వివరించారు. తెలుగు అకాడమీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను సొంతానికి వినియోగించుకుంటున్న సమయంలోనే… సాయికుమార్‌ ఆంధ్రప్రదేశ్‌ గిడ్డంగుల సంస్థ, ఆయిల్‌సీడ్స్‌ సంస్థలపై కన్నేశాడు. ఆరునెలల క్రితం ఆ సంస్థల్లోని నిధులు కాజేయాలని పథకం వేశాడు. బ్యాంక్‌ అధికారులతో మాట్లాడుకుని అంతా సిద్ధం చేసుకున్నాక కృష్ణారెడ్డిని పలుమార్లు విజయవాడకు పంపించాడు. అక్కడ బ్యాంక్‌ ఖాతాలను తెరిపించడం, బ్యాంక్‌ అధికారులతో మాట్లాడ్డం… ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను తమ ఖాతాల్లోకి బదిలీ చేసుకున్నాక కృష్ణారెడ్డి ఎవరి వాటాలు వారికి పంపించడంలో కీలకంగా వ్యవహరించాడని పోలీసులు గుర్తించారు.

* కారు ఆపి ధ్రువపత్రాలు చూపించమన్నందుకు ఏకంగా ట్రాఫిక్‌ పోలీస్‌నే ఓ ప్రబుద్ధుడు కిడ్నాప్‌ చేశాడు. కారులో పది కిలోమీటర్లు తిప్పి.. చివరికి ఎవరు లేని చోట వదిలేసి అక్కడి నుంచి పారిపోయాడు. సినిమాల్లో చూపించే కిడ్నాప్‌ సీన్స్‌ను తలదనేల్లా ఉన్న ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్‌ నొయిడాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రెండేళ్ల కిత్రం హరియాణాలోని గురుగ్రామ్‌లో ఓ కారు షోరూమ్‌లో మారుతి స్విఫ్ట్‌ డిజైర్‌ కారు కొనేందుకు నిందితుడు సచిన్‌ రావల్‌(29) వెళ్లాడు. టెస్ట్‌ డ్రైవ్‌కి వెళ్లొస్తా అని చెప్పి కారుతో సహా ఉడాయించాడు. అలా గ్రేటర్‌ నొయిడాలోని తన స్వగ్రామం ఘోడీ బచేడాకి చేరుకున్నాడు. కొత్తకారు కొన్నట్లు అందరికీ చెప్పుకున్నాడు. కారుకు ఓ నకిలీ నంబర్‌ ప్లేట్‌ని అమర్చుకున్నాడు. రెండు రోజుల క్రితం సుర్జాపుర్‌లో దొంగిలించిన కారులో రావల్‌ వెళుతున్నాడు. వాహన తనిఖీలో భాగంగా భాగంగా రావల్‌ కారును పోలీసులు ఆపారు. ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ వీరేందర్‌ సింగ్‌ వచ్చి డ్యాకుమెంట్స్‌ చూపించమని అడిగాడు. పత్రాలు లేవని, కారులో కూర్చుంటే మొబైల్ ఫొన్‌లో ఉన్న సాఫ్ట్‌కాపీ డాక్యుమెంట్స్‌ని చూపిస్తా అని నమ్మబలికాడు. కానిస్టేబుల్‌ కారు ఎక్కిన మరుక్షణం వెంటనే కారు లాక్‌ వేసేసి ముందుకు పోనిచ్చాడు. అలా 10 కి.మీ దాటాక ఆ ట్రాఫిక్‌ పోలీస్‌ను రోడ్డు మీద వదిలేసి పారిపోయాడు. సోమవారం సుర్జాపుర్‌ పోలీసుస్టేషన్లో ఈ ఘటనపై కేసు నమోదు అయింది. పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేసి నిందితుడిని అరెస్టు చేశారు. దొంగలించిన కారుని స్వాధీనం చేసుకున్నారు.