DailyDose

చిట్యాల వద్ద ₹4కోట్ల హవాలా నగదు పట్టివేత-నేరవార్తలు

చిట్యాల వద్ద ₹4కోట్ల హవాలా నగదు పట్టివేత-నేరవార్తలు

* క్రూజ్‌ నౌక డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన తన కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ను చూసేందుకు గురువారం బాలీవుడ్ ప్రముఖ నటుడు షారుక్ ఖాన్ ముంబయిలోని ఆర్థర్ రోడ్డు జైలుకు వచ్చారు. తనయుడితో కొద్దిసేపు మాట్లాడి తిరిగి వెళ్లిపోయారు. ఆయన పోలీసులు అదుపులో ఉన్న ఆర్యన్‌ను కలుసుకోవడం ఇదే మొదటిసారి. అక్టోబర్ 2న అరెస్టయిన ఆర్యన్ బెయిల్ కోసం పలుమార్లు అభ్యర్థనలు పెట్టుకున్నారు. అయితే, ఈ కేసు విచారిస్తోన్న ప్రత్యేక న్యాయస్థానం మాత్రం వాటిని తోసిపుచ్చింది. నిన్న కూడా బెయిల్ నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కుమారుడిని చూసేందుకు షారుక్‌ జైలుకు వచ్చారు. గతవారం ఆర్యన్ తన తల్లిదండ్రులతో వీడియో కాల్‌లో మాట్లాడిన సంగతి తెలిసిందే.

* హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీ ఎత్తున హవాలా డబ్బు పట్టుబడింది. చిట్యాల పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తుండగా ఓ కారు అనుమానాస్పదంగా కనిపించింది.దీంతో పోలీసులు ఆ వాహనాన్ని తనిఖీ చేసేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసుల తనిఖీలను పసిగట్టిన కారు డ్రైవర్ రూటు మార్చి తప్పించుకునే ప్రయత్నం చేయబోయి.. చివరకు పోలీసులకు దొరికిపోయాడు.కాగా టీఎస్ 10 EY 6160 నెంబర్ గల కియా కారును పోలీసులు తనిఖీ చేయగా అందులో రూ.4 కోట్ల నగదు పట్టుబడింది.దీంతో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పట్టుబడ్డ నగదు హవాలా మనీగా పోలీసులు గుర్తించారు.

* కడప పట్టణంలోని నకాశ్‌ వీధిలో దారుణం చోటు చేసుకుంది. తల్లి, కుమార్తెను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఖుర్షీదా (47)ను కత్తితో పొడిచి, ఆమె కుమార్తె అలీమా (14)ను చున్నీతో ఉరేసి చంపేశారు. కుటుంబ కలహాలతో బంధువులే చంపారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

* టెలివిజన్‌ నటితో ఓ వ్యాపారవేత్త అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నటి ఫిర్యాదుతో సదరు వ్యాపారవేత్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు బుధవారం అతడిని కోర్టులో హాజరుపరిచారు. పోలీసుల వివరాల ప్రకారం.. టెలివిజన్‌ ఇండస్ట్రీకి చెందిన ఓ నటి అక్టోబర్‌ 3న విమానంలో దిల్లీ నుంచి ముంబయి వెళ్లింది. విమానం ముంబయి విమానాశ్రయంలో ల్యాండ్‌ అవడంతో ఓవర్‌హెడ్‌ కంపార్ట్‌మెంట్‌లో ఉన్న తన బ్యాగు తీసుకునేందుకు నటి సీటులో నుంచి పైకి లేచింది. అయితే పక్క సీట్లో ఉన్న ఓ వ్యాపారవేత్త నటి నడుం పట్టుకొని ఒక్కసారిగా ఒళ్లోకి లాక్కున్నాడు. ఆమె ప్రతిఘటించడంతో బుకాయించాడు. పురుషుడు అనుకొని అలా చేశానని ఆమెకు క్షమాపణలు తెలిపాడు.

* పంజాబ్‌లోని భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో అధికారులు భారీగా ఆయుధాలు, డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్‌ సరిహద్దులోని తార్న్‌తరణ్‌ జిల్లా ఖేంకరన్‌ ప్రాంతంలో వీటిని స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. అమృత్‌సర్‌ కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌, సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌) సంయుక్తంగా జరిపిన ఆపరేషన్‌లో 22 తుపాకులు, 44 మ్యాగజీన్లు, 100 రౌండ్ల తూటాలతో పాటు కిలో హెరాయిన్‌ సీజ్‌ చేసినట్టు తెలిపారు. వీటిని నల్లరంగుతో ఉన్న కిట్‌ బ్యాగ్‌తో వరిపొలంలో దాచి ఉంచారన్నారు. తమకు వచ్చిన రహస్య సమాచారం ఆధారంగా ఈ సంయుక్త ఆపరేషన్‌ జరిపి వాటిని స్వాధీనం చేసుకున్నట్టు డీజీపీ ఇక్బాల్‌ ప్రీత్‌ సింగ్‌ సహోట వెల్లడించారు. ప్రాథమిక దర్యాప్తులో ఇది పాకిస్థాన్‌ స్మగ్లర్ల పనిగా తెలుస్తోందన్నారు. దీనిపై అమృత్‌సర్‌లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయని ఆయన వివరించారు.