Politics

చంద్రబాబు కొత్త నాటకం-తాజావార్తలు

చంద్రబాబు కొత్త నాటకం-తాజావార్తలు

* రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పై అసభ్య వ్యాఖ్యలు చేయించడమే కాకుండా నిరసన దీక్ష పేరిట తెదేపా అధినేత చంద్రబాబు కొత్త నాటకానికి తెరలేపారని మంత్రి పేర్ని నాని అన్నారు. ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేకే చంద్రబాబు సానుభూతి కోసం ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు చేస్తున్నది దొంగ దీక్ష అని.. ఆ దీక్షకు కారణమేంటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. దీక్షపై చంద్రబాబు తన అంతరాత్మను ప్రశ్నించుకోవాలన్నారు. తెదేపాను కుట్రలు, కుతంత్రాలు, బూతులకు పెద్ద ఫ్యాక్టరీగా చంద్రబాబు తయారు చేశారని ధ్వజమెత్తారు. బంద్ వల్ల రాష్ట్రానికి ఆర్థికంగా నష్టం జరుగుతుందని గతంలో సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు చెప్పారని నాని గుర్తు చేశారు. ఇలాంటి నేతలకు బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు.

* అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సొంతగానే సోషల్‌ మీడియాను ప్రారంభించనున్నట్లు బుధవారం ప్రకటించారు. అమెరికాలో క్యాపిటల్‌ భవనంపై దాడి తర్వాత ఫేస్‌బుక్‌, ట్విటర్‌ వంటి సామాజిక మాధ్యమాలు ఆయన్ను బహిష్కరించాయి. దాదాపు తొమ్మిది నెలల పాటు ఆయన ఇంటర్నెట్‌లో చురుగ్గా లేరు. ఇందుకోసం ట్రంప్‌ మీడియా అండ్‌ టెక్నాలజీ గ్రూప్‌(టీఎంటీజీ)ను ఏర్పాటు చేశారు. టీఎంటీజీ సంస్థ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘ట్రూత్‌ సోషల్‌’ పేరుతో టీఎంటీజీ సామాజిక మాధ్యమాన్ని ఏర్పాటు చేయనుందని దానిలో పేర్కొంది. కొంత మంది అతిథుల కోసం వచ్చే నెల దాని బీటా వెర్షన్‌ ప్రారంభించనున్నట్లు పేర్కొంది. ప్రీ ఆర్డర్ల కోసం ఇది ఇప్పటికే యాపిల్‌ ‘యాప్‌స్టోర్‌’లో అందుబాటులో ఉందని తెలిపింది. వీడియో ఆన్‌ డిమాండ్‌ సేవలను కూడా ప్రారంభించాలని ఈ కంపెనీ భావిస్తోంది. ఈ కంపెనీ విలువను ప్రాథమికంగా 875 మిలియన్‌ డాలర్లుగా పేర్కొన్నారు. భవిష్యత్తులో వ్యాపారాన్ని బట్టి ఇది మరింత పెరుగుతుందని అంచనా వేశారు.

* బాలీవుడ్‌ ఇండస్ట్రీని డ్రగ్స్‌ వ్యవహారం కుదిపేస్తోంది. ఇప్పటికే ముంబయిలోని క్రూయిజ్‌ నౌకలో డ్రగ్స్‌ కేసుకు సంబంధించి ప్రముఖ నటుడు షారుక్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ అరెస్టయి జైల్లో ఉండగా.. తాజాగా మరో బాలీవుడ్‌ నటి పేరు తెరపైకి వచ్చింది. యువ నటి అనన్య పాండే నివాసంలో గురువారం ఎన్‌సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ ఉదయం అనన్య ఇంటికి వెళ్లిన ఎన్‌సీబీ అధికారులు అక్కడ సోదాలు చేపట్టారు. విచారణ నిమిత్తం ఆమెను మధ్యాహ్నం 2 గంటలకు హాజరుకావాలని సమన్లు జారీ చేశారు. ఆమె ఫోన్‌ను కూడా అధికారులు స్వాధీనం చేసుకొన్నట్లు సమాచారం.

* ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ (పీకే) కాంగ్రెస్‌లో చేరే విషయంలో అనిశ్చితి నెలకొంది. దివంగత సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌ మాదిరిగా అధ్యక్షురాలికి రాజకీయ కార్యదర్శి హోదాలో తాను ఉండాలని పీకే కోరుకుంటున్నారు. విధాన నిర్ణయాల యంత్రాంగంలో ఆయన జోక్యం చేసుకోవడానికి పార్టీలో ఎక్కువమంది నేతలు ఇష్టపడడం లేదు. తాను అనుకున్నది జరగకపోవడంతో ఇప్పుడు కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయడంపై పీకే దృష్టి సారించారు.

* వర్మ గురువారం ఉదయం ట్విటర్‌ వేదికగా ఏపీ రాజకీయాలపై కామెంట్స్‌ చేశారు. ‘‘ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పరిస్థితులు చూస్తుంటే అతిత్వరలో అక్కడ నాయకులు బాక్సింగ్‌, కరాటే, కర్ర యుద్ధం నేర్చుకోవాల్సి ఉంది’’ అని ఆర్జీవీ వ్యంగ్యంగా అన్నారు.

* క్రమంగా అదుపులోకి వస్తోందనుకుంటున్న కొవిడ్‌ మరోసారి విరుచుకుపడుతోంది. ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ ప్రమాదఘంటికలు మోగుతున్నాయి. అగ్రరాజ్యాల నుంచి చిన్న దేశాల వరకు అన్నిచోట్లా కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోంది. యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో రోజూ 50వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. వందల సంఖ్యలో మరణాలూ సంభవిస్తున్నాయి. డెల్టా ఉత్పరివర్తనంలోని ఏవై 4.2 రకం ఇక్కడ కేసుల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణం. సాధారణ డెల్టా కంటే ఇది 15శాతం అధిక వేగంతో వ్యాప్తి చెందుతుంది. రష్యాలోనూ రోజుకు 33వేల వరకు కేసులు వస్తుండగా, సుమారు వెయ్యి మరణాలు నమోదవుతున్నాయి. ఇప్పటివరకూ దేశ జనాభాలో 29శాతానికే రెండు డోసుల టీకా అందింది. ఆంక్షలు అంతగా లేకపోవడంతో మాస్కో, సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ వంటి నగరాల్లో ప్రజలు స్వేచ్ఛగా తిరిగేస్తున్నారు. మాస్కు పెట్టుకోవాలన్న నిబంధన అక్కడ కచ్చితంగా అమలు కావడం లేదు. దేశవ్యాప్తంగా కొవిడ్‌తో 4.18 లక్షల మంది మృత్యువాత పడినట్లు ప్రభుత్వ గణాంక సంస్థ రొస్టాట్‌ అంచనా వేస్తోంది. ప్రస్తుత విలయం నేపథ్యంలో అక్టోబరు 30 నుంచి నవంబరు ఏడు వరకు దేశవ్యాప్తంగా సెలవులు ప్రకటిస్తామని ప్రధాని మిఖాయిల్‌ మిషుస్తిన్‌ వెల్లడించారు. కేసుల తీవ్రత మరీ ఎక్కువగా ఉన్నచోట్ల అక్టోబరు 23నుంచే ఆంక్షలు విధించాలని ఉప ప్రధాని తత్యానా గొలికోవా సూచించారు. జూన్‌ చివరి వారం నుంచి ఆస్ట్రేలియాలో డెల్టా ఉత్పరివర్తనం దాడి మొదలైంది. విక్టోరియా వంటి ప్రాంతాల్లో కొవిడ్‌ జడలు విప్పుతోంది. రాజధాని కాన్‌బెర్రాతో పాటు ప్రధాన నగరాలు సిడ్నీ, మెల్‌బోర్న్‌ లాంటిచోట్ల కేసులు పెరుగుతున్నాయి.

* నాదెండ్ల బ్రహ్మం చౌదరికి మంగళగిరి కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. తెదేపా కార్యాలయంపై దాడి జరిగిన రోజు అక్కడికి వెళ్లిన తనను నిర్బంధించారని ఆర్‌.ఐ సక్రూనాయక్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళగిరి గ్రామీణ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయగా … అందులో బ్రహ్మం చౌదరి ఏ6గా ఉన్నారు.

* పిల్లలు తప్పుచేస్తే తల్లిదండ్రులను శిక్షించేలా కొత్తచట్టాన్ని సిద్ధం చేసింది… చైనా! ‘ఫ్యామిలీ ఎడ్యుకేషన్‌ ప్రమోషన్‌ లా’ పేరుతో ఇప్పటికే ముసాయిదా బిల్లును రూపొందించింది. దీని ప్రకారం- పిల్లల ప్రవర్తన సరిగా లేకపోయినా, వారు నేరాలకు పాల్పడినా ముందుగా తల్లిదండ్రులకు సమాచారమిస్తారు. ఆ తర్వాత బిడ్డల్లో మార్పు తీసుకురావాల్సిన బాధ్యత కన్నవారిపైనే ఉంటుంది. అప్పటికీ పిల్లలు మారకపోతే, వారి తల్లిదండ్రులు పనిచేసే సంస్థలకు, లేదా యజమానులకు విషయం చేరవేస్తారు. తర్వాత తల్లిదండ్రులకు శిక్షణ ఇస్తారు. ఈ కార్యక్రమానికి వారు తప్పనిసరిగా హాజరుకావాలి. లేకుంటే 156 డాలర్ల (సుమారు రూ.11,600) జరిమానా, 5 రోజుల జైలు శిక్ష విధించే అవకాశముంటుంది. చిన్నారుల ప్రవర్తన సరిగ్గా లేకపోవడానికి చాలా కారణాలున్నా, వారి పట్ల తల్లిదండ్రులు శ్రద్ధ చూపకపోవడమే ప్రధాన కారణమని చైనా చట్టసభ వ్యవహారాల కమిషన్‌ అధికార ప్రతినిధి జాంగ్‌ తైవే పేర్కొన్నారు. ‘‘కమ్యూనిస్టు పార్టీని, దేశాన్ని, ప్రజలను, సామ్యవాదాన్ని ప్రేమించేలా పిల్లలకు బోధించడం తల్లిదండ్రుల విధి అని కొత్తచట్టం చెబుతోంది. పిల్లలు విశ్రాంతి తీసుకునేందుకు, వ్యాయామం చేసేందుకు ఎక్కువ సమయం ఇవ్వాలి. ట్యూషన్‌, హోంవర్క్‌ పేరుతో వారిపై ఒత్తిడి పెంచకూడదు’’ అని తైవే చెప్పారు. చిన్నారులు, యువతరం, కుటుంబాల కోసం డ్రాగన్‌ దేశం ఇటీవల కొత్త నిబంధనలను తీసుకొస్తోంది. మైనర్లు వారానికి గరిష్ఠంగా మూడు గంటలు మాత్రమే వీడియో గేమ్స్‌ ఆడాలని షరతు విధించింది.

* హుజూరాబాద్‌ ఉపఎన్నిక భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశారని ప్రజల కోసం కాదని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ఆరోపించారు. అలాంటప్పుడు ఈటలకు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. కరీంనగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. హుజూరాబాద్‌- జమ్మికుంట అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు రైల్వేలైన్ల కోసం ఎంతో శ్రమించానని గుర్తు చేశారు. జమ్మికుంట, హుజూరాబాద్‌ అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడించారు. కరీంనగర్ జిల్లా అభివృద్ధికి కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందో భాజపా నేతలు చెప్పాలని వినోద్ డిమాండ్ చేశారు. నియోజక వర్గ అభివృద్ధికి ఎవరు కృషి చేస్తారో వారికే ఓటు వేయాలని మిగతా విషయాల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.

* సీఎం జగన్‌పై తెదేపా నేత పట్టాభిరామ్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఏపీ వ్యాప్తంగా వైకాపా నేతలు దీక్షలు చేపట్టారు. ‘జనాగ్రహ దీక్ష’ పేరుతో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో నిరసనలు తెలుపుతున్నారు. సీఎంను అసభ్య పదజాలంతో దూషించారని.. కుట్ర రాజకీయాలు చేస్తూ తెదేపా నేతలు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని వైకాపా నేతలు ఆరోపించారు. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, ఆ పార్టీ నేతలు ఈ దీక్షల్లో పాల్గొన్నారు.