Politics

చంద్రబాబు కారుపై బాంబు వేస్తా-తాజావార్తలు

చంద్రబాబు కారుపై బాంబు వేస్తా-తాజావార్తలు

* మంత్రి పెద్దిరెడ్డి జోలికొస్తే తెదేపా అధినేత చంద్రబాబు కారుపై బాంబు వేస్తానని వైకాపా నేత, గ్రామీణ విద్యుత్‌ సహకార సంస్థ (రెస్కో) ఛైర్మన్‌ సెంధిల్‌ హెచ్చరించారు. చిత్తూరు జిల్లా కుప్పంలో వైకాపా చేపట్టిన జనాగ్రహ దీక్షలో ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పక్కన ఉన్నవాళ్లు మైక్‌ లాక్కొనే ప్రయత్నం చేసినప్పటికీ సెంథిల్‌.. మరింతగా రెచ్చిపోయి తిట్ల దాడిని కొనసాగించారు.

* ఇంటర్‌ పరీక్షల్లో తాము జోక్యం చేసుకోలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టంచేసింది. ఈ నెల 25 నుంచి జరగాల్సిన ఇంటర్‌ మొదటి పరీక్షలు రద్దు చేయాలంటూ తెలంగాణ రాష్ట్ర తల్లిదండ్రుల సంఘం దాఖలు చేసిన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం అత్యవసర విచారణ చేపట్టింది. ఈ నెల 25 నుంచే పరీక్షలు ఉండగా పిటిషన్‌ వేస్తే ఎలా అని ప్రశ్నించింది. చివరి నిమిషంలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది.

* తన స్వలాభం కోసమే తెదేపా అధినేత చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీని మోసం చేశారని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఉత్తరాంధ్రలో మాదకద్రవ్యాలకు పురుడు పోసింది తెదేపా నేతలేనన్నారు. విశాఖలో జరిగిన వైకాపా జనాగ్రహ దీక్షలో విజయసాయి మాట్లాడారు. భాజపా పెద్దలకు చంద్రబాబు ప్రతిపాదనలు పంపారనీ.. వైకాపా సర్కారును గద్దె దించితే తెదేపాను భాజపాలో కలుపుతామన్నారంటూ విజయసాయిరెడ్డి ఆరోపించారు.

* హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో భాజపాతో పాటు ఆ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ అక్రమాలకు పాల్పడుతున్నారని తెరాస ఆరోపించింది. ఓటర్లకు డబ్బులు పంచేందుకు బ్యాంకు ఖాతాలు తెరుస్తున్నారంటూ ఆ పార్టీ ప్రతినిధి బృందం రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి శశాంక్‌ గోయల్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. చాలా మంది పేర్లతో బ్యాంకు ఖాతాలు తెరిచి గూగుల్‌ పే, ఫోన్‌పేల ద్వారా ఓటర్ల డబ్బు పంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

* ‘మా’ ఎన్నికల సీసీ ఫుటేజీ కావాలని ప్రకాశ్‌రాజ్‌ చేసిన ట్వీట్‌పై ఎన్నికల అధికారి కృష్ణ మోహన్‌ స్పందించారు. ‘మా’ ఎన్నిక‌ల నిర్వహణ‌తోనే త‌న బాధ్యత పూర్తయ్యింద‌ని, ఆ తర్వాత జోక్యం చేసుకోవడానికి తనకెలాంటి అధికారాలు లేవని స్పష్టం చేశారు. ‘ఫుటేజీ అడిగినప్పుడు పరిశీలించి చెప్తా అన్నాను. కానీ, ఇస్తానని అనలేదు’ అని అన్నారు. ఇకపై అధికారమంతా అధ్యక్షుడి చేతిలోనే ఉంటుందన్నారు.

* భారత సైన్యంలో మరో 39 మంది మహిళా అధికారులకు శాశ్వత కమిషన్‌ హోదా దక్కనుంది. ఈ హోదా కోసం వీరు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. అక్కడ అధికారిణులకు విజయం లభించింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం వారికి శాశ్వత కమిషన్‌ హోదా కల్పించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం నేడు కోర్టుకు వెల్లడించింది.

* చైనా- తైవాన్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ చైనా దాడికి దిగితే.. తైవాన్‌ను తాము రక్షిస్తామని స్పష్టం చేశారు. ఈ విషయమై తైవాన్‌తో కమిట్‌మెంట్‌ ఉందని వెల్లడించారు. ‘అగ్రరాజ్యం సైనిక బలం గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చైనా, రష్యా సహా ఇతర దేశాలకూ తెలుసు.. తాము ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన మిలిటరీ దేశం అని’ ఆయన పేర్కొన్నారు.

* చైనాలో ఒక్కసారిగా కరోనా కలవరం..! వందల కొద్దీ విమానాల రద్దు, పాఠశాలల మూసివేత, పెద్దఎత్తున సామూహిక పరీక్షలు, ఇళ్ల నుంచి బయటకు రావొద్దంటూ ఆంక్షలు..! వృద్ధ దంపతులు సహా పదుల సంఖ్యలో పర్యాటకులకు కరోనా పాజిటివ్‌ రావడమే దీనంతటికీ కారణం. వీరంతా షాంఘై నుంచి మొదలై గ్జియాన్‌, గాన్సు ప్రావిన్స్‌, ఇన్నర్‌ మంగోలియాలో పర్యటించారు. ఈ క్రమంలో రాజధాని బీజింగ్‌ సహా ఐదు ప్రావిన్స్‌ల్లో పెద్దఎత్తున ప్రజలతో కాంటాక్టు అయినట్లు భావించి చైనా చర్యలు చేపట్టింది. అనుమానం ఉన్న ప్రాంతాల్లో విహార కేంద్రాలు, పర్యాటక ప్రాంతాలను మూసివేసి స్థానిక ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. వాయువ్య చైనాలోని 40 లక్షల జనాభా ఉన్న లాన్‌జూ నగరంలో అవసరమైతే తప్ప బయటకు రావొద్దంటూ ప్రజలకు ఆదేశాలిచ్చారు. గ్జియాన్‌, లాన్‌జూల్లో 60 శాతం విమాన సర్వీసుల ను రద్దు చేశారు. ఇన్నర్‌ మంగోలియాలోని ఎరెన్‌హట్‌కు రాకపోకలను నిలిపివేశారు. ఈ ప్రాంతంలో కరోనా ప్రభావం బొగ్గు దిగుమతులపై పడనుంది. కాగా, చైనాలో వరుసగా ఐదో రోజు కరోనా కేసులు నమోదయ్యాయి. గురువారం స్థానిక వ్యాప్తి ద్వారా 13 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. వీటిలో అధిక శాతం ఈశాన్య, వాయువ్య ప్రాంతాలవే.

* తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుక్రవారం విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి, స్వాత్మానందేంద్ర స్వాములను కలిశారు. చందా నగర్ వేంకటేశ్వరస్వామి ఆలయ రజతోత్సవములకు హాజరై స్వామీజీ ఆశీస్సులు అందుకున్నారు. తెలంగాణ గవర్నరుకు స్వరూపానందేంద్ర స్వామి జగద్గురు ఆదిశంకరాచార్య ప్రతిమను బహూకరించారు. గవర్నరు నుదుట తిలకం దిద్ది రాజశ్యామల అమ్మవారి రక్షారేఖను కట్టారు. ఈ సందర్బంగా గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి, స్వాత్మానందేంద్ర స్వాములను కలిసి ఆశీస్సులు అందుకోవడం ఎంతో ఆనందాన్నిచ్చిందని అన్నారు. లోక కళ్యాణం కోసం ఆధ్యాత్మిక మార్గంలో విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు చేపడుతున్న కృషి అభినందనీయమని చెప్పారు. కరోనా విపత్కర పరిస్థితుల నుంచి ప్రజలంతా బయటపడాలని స్వామీజీని కోరుకున్నట్లు తెలిపారు. చందానగర్ వెంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు శోభాయమానంగా ఉన్నాయని అన్నారు

* బద్వేలు ఉప ఎన్నికల్లో ప్రజలు విజ్ఞనతో ఓటు వేయాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ కోరారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నర సంవత్సరాల్లో రాష్ట్రం ఏమైందో ఆలోచించాలని అన్నారు. బద్వేలు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినిగా పోటీలో ఉన్న కమలమ్మ విజయాన్ని కోరుతూ ఆయన శుక్రవారం బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కమలమ్మ శాసన సభ్యురాలిగా బద్వేలు నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేసారని చెప్పారు. అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వానికి ఓటర్లు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. శాసన సభలో కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా అడుగు పెట్టేలా ఓటర్లు ఆశీర్వదించాలని ఆయన కోరారు. ఈ ప్రచారంలో శైలజనాథ్ తో పాటు కడప పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు నీలి శ్రీనివాసరావు, అనంతపురం జిల్లా అధ్యక్షుడు బండ్లపల్లి ప్రతాప్ రెడ్డి, ఎన్. యెస్.యు.ఐ రాష్ట్ర అధ్యక్షుడు నాగ మధు, ధ్రువకుమార్ రెడ్డి మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

* అక్టోబర్ నెల నుంచి క్రమంగా కేసులు పెరిగి, 2022 జనవరి – ఏప్రిల్ మధ్య కట్టడి చేయలేనంత తీవ్ర స్థాయికి కరోనా చేరే అవకాశం ఉందని ఎయిమ్స్ డైరెక్టర్ అంచనా వేశారు.దీంతో ఖచ్చితంగా ప్రజలు సూచనలు పాటించాలని ఎయిమ్స్ ఆరోగ్య గణాంక నిపుణులు హెచ్చరించారు.టూరిస్ట్‌ల సంఖ్య పెరగడం, సభలు, సమావేశాలతో ప్రజలు గుమిగూడటం మూడో ఉద్ధృతికి దారి తీయొచ్చని తెలిపారు. ఇటీవల టూరిస్ట్ లు పెరిగిన మనాలి, డార్జిలింగ్‌ ప్రాంతాల్లో కొవిడ్‌ కేసులు పెరిగాయని పేర్కొన్నారు.రాష్ట్రాలు ఆంక్షలను పాటించకపోతే మూడో ఉద్ధృతి ఆటోమేటిక్‌గా పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. భారత్‌లో మూడో వేవ్‌లో కొన్ని ప్రాంతాల్లో రోజువారీ కేసులు 103శాతం వరకూ ఉండొచ్చనే అంచనా వేశారు.

* కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ డిమాండ్ చేశారు.వైకాపా పట్టించుకోకపోతే అధికార మార్పిడి తర్వాత జనసేన ఆ ప్రక్రియ మెుదలు పెడుతుందని చెప్పారు.అణగారిన వర్గాల ఆశాజ్యోతి సంజీవయ్య అని తెలిపిన పవన్.. ఆయన పేరు ఒక్క పథకానికీ పెట్టలేదని విమర్శించారు.

* ఈనెల 30, 31 తేదీల్లో గో మహాసమ్మేళనం నిర్వహించబోతున్నట్లు తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

* జీఎస్టీ కౌన్సిల్‌ 45వ సమావేశాన్ని గురువారం వర్చువల్‌లో నిర్వహించారు. ఐటీ సవాళ్లు, ఆదాయ సమీకరణపై జీఎస్టీ విధానంలో సంస్కరణల కోసం కన్వీనర్‌, ఏడుగురు సభ్యులతో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు.