ScienceAndTech

ఏపీలో విద్యుత్ చెత్తబండి

ఏపీలో విద్యుత్ చెత్తబండి

ప్రజలకు, వాతావరణానికి హాని కలిగించే వ్యర్థాల తొలగింపులో అత్యుత్తమ విధానాలు అమలు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్‌ (క్లాప్‌) కింద రాష్ట్రంలో ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాలను తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో కలిసి సీఎం శుక్రవారం సమీక్షించారు. నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో పరిశుభ్రత కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఈ సందర్భంగా సీఎం ఇంకా ఏమన్నారంటే… ‘గ్రేడ్‌ 2, 3 నగర పంచాయతీలు, పట్టణాలు, నగరాలకు క్లాప్‌ కింద నిర్దేశించిన వాహనాలను చేరవేయాలి. ప్రతి ఇంటికీ చెత్త బుట్టలు అందించాలి. చెత్త సేకరణ, తరలింపు కోసం అన్ని ప్రాంతాలకూ విద్యుత్‌ వాహనాలను వీలైనంత త్వరగా ఏర్పాటు చేసుకోవాలి. నగరాలు, పట్టణాల్లో చెత్త కేంద్రాల వల్ల సమీపంలోని ఇళ్లకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు చెత్త తొలగిస్తూ, ఆ ప్రాంతంలో దుర్వాసన రాకుండా చూడాలి. క్లాప్‌ అమలును పర్యవేక్షిస్తున్న కమాండ్‌ కంట్రోల్‌ రూంలో సమర్థులైన అధికారులను పెట్టాలి. ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో పూర్తిస్థాయిలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలి. గ్రామాల్లో చెత్త బుట్టలు లేనివాళ్లకు వాటిని అందించాలి. పల్లెల్లో పారిశుద్ధ్యంపైనా నివేదికలు తెప్పించుకుని ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలి. గ్రామ క్లినిక్‌లలో నీరు, గాలిలో కాలుష్యంపై పరీక్షలు చేయించాలి. క్రమం తప్పకుండా తాగునీటి ట్యాంకులు పరిశుభ్రం చేయించాలి.వ్యాధులు సోకకుండా తీసుకోవాల్సిన చర్యలపై నిరంతరం దృష్టి పెట్టాలి’ అని సీఎం అన్నారు. ‘పట్టణాల్లో మురుగునీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలి. ప్రజా మరుగుదొడ్లు నిర్మించడమే కాదు..వాటిని పరిశుభ్రంగా ఉంచేలా ప్రత్యేక దృష్టి పెట్టాలి’ అని సీఎం సూచించారు.