Sports

డ్రగ్స్ కేసులో కొత్త మలుపు-తాజావార్తలు

* హుజూరాబాద్‌ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఇల్లందకుంటలో ఏర్పాటు చేసిన సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెరాస సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి బల్మూరి వెంకట్‌కు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ‘‘ఎస్‌ఆర్‌ఎస్‌పీ ప్రాజక్టు ద్వారా సాగునీరందించి ఈ ప్రాంత రైతులను అభివృద్ధి చేసింది కాంగ్రెస్‌ పార్టీ. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినా.. లక్షన్నర కోట్లు ఖర్చు పెట్టినా.. అని కేసీఆర్‌ చెబుతున్నారు. కానీ, పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. వరి వేస్తే ఉరి వేసుకున్నట్టేనన్న కేసీఆర్‌కు ఎందుకు ఓటు వేయాలి. రైతులు పండించిన పంటను కొనే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు. ధాన్యం కొనలేని ఈ ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరమా? కాళేశ్వరం పేరుమీద రూ.లక్షన్నర కోట్లు కాంట్రాక్టర్లకు ఇచ్చి.. అందులో రూ.30వేల కోట్లు సంపాదించుకున్నారు. అ డబ్బుతో హైదరాబాద్‌ చుట్టుపక్కల ఫామ్‌హౌస్‌లు కట్టుకున్నారు. 57 ఏళ్లు నిండిన వారికి పింఛను ఇస్తామని కేసీఆర్‌ చెప్పారు.. కానీ 65 ఏళ్లు దాటిన వారికీ పింఛను రాలేదు. కొత్త పింఛన్లు మంజూరు చేయట్లేదు, పండించిన వరిని క్వింటా రూ.2వేలకు కొనుగోలు చేయడం లేదు.. రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేయలేదు. ఈ ప్రాంత అభివృద్ధికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదు’’ అని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

* ముంబయి డ్రగ్స్‌ వ్యవహారం కొత్తమలుపులు తిరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఈ ఆపరేషన్‌కు నేతృత్వం వహించిన ఎన్‌సీబీ అధికారి సమీర్‌ వాంఖడేను టార్గెట్‌ చేస్తూ మహారాష్ట్ర మంత్రులు ఇప్పటికే ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై వాంఖడే ఇదివరకే దీటుగా బదులిచ్చారు. తాజాగా ఈ వ్యవహారంలో సాక్షిగా ఉన్న ప్రభాకర్‌ సెయిల్‌ అనే వ్యక్తి దర్యాప్తు సంస్థ ఎన్‌సీబీపైనే సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసులో పరారీలో ఉన్న గోసవీ-దర్యాప్తు సంస్థ మధ్య రహస్య ఒప్పందం, ముడుపుల వ్యవహారం నడుస్తోందనే అనుమానాలు వ్యక్తం చేస్తూ సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాకుండా ఈ డ్రగ్స్‌ కేసులో ఎన్‌సీబీ తనతో బ్లాంక్‌ పంచనామాపై బలవంతంగా సంతకం చేయించుకుందని ఆరోపించాడు.

* కథానాయికలపై అభ్యంతరకర వీడియోలు పెడితే ఉపేక్షించేది లేదని నటుడు, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు హెచ్చరించారు. తెలుగు ఫిల్మ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌ సన్మాన కార్యక్రమంలో మీడియాను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కొన్ని యూట్యూబ్‌ ఛానళ్లు నటుల పట్ల దారుణంగా ప్రవరిస్తున్నాయని, అసభ్యకరంగా వ్యవహరించే అలాంటి ఛానళ్లపై చర్యలు తప్పవన్నారు. యూట్యూబ్‌ ఛానళ్ల థంబ్‌నైల్స్‌ హద్దులు మీరుతున్నాయని మండిపడ్డారు. నటీమణులు మన ఆడపడుచలని, వారిని గౌరవించాలని విజ్ఞప్తి చేశారు. హీరోయిన్లపై అభ్యంతరకర వీడియోలు పెడితే ఉపేక్షించమన్నారు. యూట్యూబ్‌ ఛానళ్ల నియంత్రణకు ప్రత్యేక లీగల్‌ సెల్‌ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. పరిధి దాటే ఇలాంటి యూట్యూబ్‌ ఛానళ్లని నియంత్రిండం తన ఎజెండాలో ఓ అంశమని పేర్కొన్నారు. తెలుగు మీడియా ఎప్పుడూ హద్దులు దాటలేదని, తన కుటుంబానికి, చిత్ర పరిశ్రమకి సహకారం అందిస్తూనే ఉందని చెప్పారు.

* భారత్​తో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా మరో ఎత్తుగడ వేసింది. సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత పేరుతో నూతన సరిహద్దు చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. సరిహద్దుల్లో చైనా ప్రజలు నివసించేలా, పని చేసుకునేలా ప్రోత్సహించనున్నట్లు ఆ చట్టంలో డ్రాగన్‌ వెల్లడించింది. మౌలిక సదుపాయాల కల్పన సహా సరిహద్దు రక్షణ.. ఆర్థిక, సామాజిక అభివృద్ధి కోసం పాటుపడనున్నట్లు తెలిపింది. సరిహద్దులు, ప్రాదేశిక సమగ్రతకు వ్యతిరేకంగా చేపట్టే పనులను అడ్డుకునేందుకు చైనా ఎలాంటి చర్యలైనా చేపడుతుందని చట్టంలో పేర్కొంది. డ్రాగన్‌ తీసుకొచ్చిన తాజా చట్టం భారత్​తో సరిహద్దు వివాదంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. చైనా జాతీయ పీపుల్స్ కాంగ్రెస్ స్టాండింగ్ కమిటీ సభ్యుల సమావేశం​ శనివారం ముగిసింది. కాగా ఈ సమావేశంలోనే నూతన చట్టానికి ఆమోదం తెలిపినట్లు ఆ దేశ అధికార మీడియా వెల్లడించింది. కాగా ఈ చట్టం వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమలులోకి రానుంది. సమానత్వం, పరస్పర విశ్వాసం, స్నేహపూర్వక సంప్రదింపులు అనే సూత్రాల ద్వారా సరిహద్దు వ్యవహారాలను నిర్వహించనున్నట్లు చట్టంలో చైనా పేర్కొంది. చర్చలతోనే పొరుగు దేశాలతో వివాదాలను పరిష్కరించుకుంటామని వెల్లడించింది.

* కేంద్రంలోని భాజపా ప్రభుత్వం అన్నింటి ధరలు పెంచుతూ సామాన్యులపై భారం వేస్తోందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ధరల పెరుగుదల పాపం ముమ్మాటికీ భాజపాదే అని అన్నారు. తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు మద్దతుగా మంత్రి హరీశ్ రావు హుజూరాబాద్ నియోజకవర్గంలోని మాచనపల్లిలో ప్రచారం నిర్వహించారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తూనే భాజపా, కాంగ్రెస్ నాయకుల విమర్శలను తనదైన శైలిలో తిప్పికొట్టారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో భాజపా, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని విమర్శించారు.

* ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల వ్యవధిలో 37,744 పరీక్షలు నిర్వహించగా.. 400 కొవిడ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో కొవిడ్‌ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,343కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 516 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో ఇప్పటివరకు 20,44,132 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 5,102 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో చిత్తురు, గుంటూరు, కృష్ణ, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.

* హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో తన గలుపును ఎవరూ అడ్డుకోలేరని భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ ధీమా వ్యక్తం చేశారు. హుజూరాబాద్‌లో ప్రజలను భయపెట్టి తెరాస ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తోందని ఈటల తెరాస అబద్ధాలను ప్రజలు నమ్మబోరని స్పష్టం చేశారు. వీణవంక మండలం వల్బాపూర్‌లో ఈటల ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

* ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలు క్షీణించడంతో పాటు ఆర్థిక సంక్షోభం ఏర్పడినందున రాష్ట్రపతి పాలన విధించాలని తెదేపా మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీశ్వర్‌రావు అన్నారు. బలిజిపేటలో ఆయన ఆదివారం విలేకర్లతో మాట్లాడారు. ఇదే అంశంపై తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు వివరించనున్నారన్నారు. అధికార పార్టీ నాయకులు తెదేపాపై చేస్తున్న విధ్వంసక చర్యలు దురదృష్టకరమని తెలిపారు. కేంద్రప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం ఈ చర్యలపై మౌనంగా ఉండటం సరికాదని చెప్పారు. రాష్ట్రంలో మాదకద్రవ్యాల మూలాలు వైకాపా పాలన అసమర్థత వల్లే పెరిగిపోయాయని ఆరోపించారు. కార్యక్రమంలో తెదేపా అరకు పార్లమెంటు కార్యదర్శి ఎం.అప్పారావు, పార్టీ మండల నాయకులు వి.రామకృష్ణ, పి.రాము, జి.రామ్మూర్తి, ఎస్‌.రామారావు, సింహాచలం నాయుడు పాల్గొన్నారు.

* భారతీయ జనతా పార్టీని ఓడించేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకంకావాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. భాజపాను, విభజన అజెండాను ఓడించేందుకు అందరం కలిసి పోరాడాలన్నారు. ఈనెల 28నుంచి రెండు రోజులపాటు గోవా పర్యటనకు సిద్ధమైన దీదీ.. బెంగాల్ ఎన్నికల్లో సాధించిన ఉత్సాహంతో భాజపా పాలిత రాష్ట్రాల్లోనూ పాగా వేసేందుకు పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే శనివారం ఓ ట్వీట్‌ చేశారు. ‘ఈనెల 28వ తేదీన గోవాలో నా తొలి పర్యటనకు సిద్ధమయ్యా. భాజపాను, వారి విభజన ఎజెండాను ఓడించేందుకు ప్రజలు, సంస్థలు, రాజకీయ పార్టీలు కలిసి రావాలని పిలుపునిస్తున్నా. గత పదేళ్లుగా గోవా ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు’ అంటూ ట్వీట్‌ చేశారు.

* తెలంగాణ నినాదం ఇతర పార్టీలకు రాజకీయ అంశంలా ఉందని.. తెరాసకు మాత్రం రాష్ట్ర అభివృద్ధే లక్ష్యం అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ అన్నారు. ఆదివారం మంత్రి పువ్వాడ అజయ్‌ మీడియాతో మాట్లాడారు. తెరాస విజయ పరంపర భవిష్యత్తులోనూ కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. వరంగల్‌లో జరగబోయే సభ చరిత్రలో నిలిచిపోతుందని స్పష్టం చేశారు. అడవుల పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించనున్నట్లు మంత్రి చెప్పారు.

* కడప జిల్లా బద్వేల్‌ ఉప ఎన్నికకు సంబంధించి ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. నియోజకవర్గం పరిధిలోని పోరుమామిళ్ల, బి.కోడూరులో ఆశా వర్కర్లకు ఫోన్లు, వాచీలు పంపిణీ చేస్తున్నారంటూ ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. వైద్య సిబ్బంది, స్థానిక నేతలపై చర్యలు తీసుకోవాలని సోము వీర్రాజు ఫిర్యాదులో పేర్కొన్నారు.

* కడప జిల్లా బద్వేల్‌ ఉప ఎన్నికకు సంబంధించి ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. నియోజకవర్గం పరిధిలోని పోరుమామిళ్ల, బి.కోడూరులో ఆశా వర్కర్లకు ఫోన్లు, వాచీలు పంపిణీ చేస్తున్నారంటూ ఈసీ దృష్టికి తీసుకెళ్లారు.

* కొలంబియా మోస్ట్‌వాంటెడ్‌ మాదకద్రవ్యాల సరఫరాదారు డైరో అంటోనియో సుగా(ఒటోనియల్‌)ను అధికారులు అరెస్టు చేశారు. కొలంబియా అధ్యక్షుడు ఇవాన్‌ డ్యూక్‌ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. అతన్ని అదుపులోకి తీసుకోవడానికి సైన్యం , వాయుసేన సంయుక్తంగా ఆపరేషన్‌ నిర్వహించాల్సి వచ్చింది. అతనిపై ప్రభుత్వం 8లక్షల డాలర్ల బహుమతిని ప్రకటించింది.

* టీ20 ప్రపంచకప్‌లో మరికాసేపట్లో టీమ్‌ఇండియా-పాకిస్థాన్‌ జట్లు పోటీపడుతున్నాయి. అయితే, కీలక పోరుకుముందు పాక్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ తమ జట్టు సారథి బాబర్‌ అజామ్‌కు ఓ విలువైన సూచన చేశాడు. ‘‘బాబర్‌ నీకో ముఖ్య విషయం చెప్పాలి. కోహ్లీసేనతో బరిలోకి దిగినప్పుడు నువ్వు అస్సలు భయపడకూడదు, ధైర్యంగా ఆడు’’ అని చెప్పాడు.