Business

14ఏళ్ల తర్వాత పెరిగిన అగ్గిపెట్టె ధర-వాణిజ్యం

14ఏళ్ల తర్వాత పెరిగిన అగ్గిపెట్టె ధర-వాణిజ్యం

* దేశంలో ఇంధన ధరలు మరోసారి పెరిగాయి.లీటర్​ పెట్రోల్​పై 35 పైసలు, డీజిల్​పై 36 పైసలు పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి.18 నెలల వ్యవధిలో పెట్రోల్ ధర లీటరుకు రూ.36.35, డీజిల్​పై లీటరుకు రూ.27.34 మేర పెరిగింది.★ ఇంధన ధరల పెంపు కొనసాగుతూనే ఉంది.★ తాజాగా పెట్రోల్​, డీజిల్​పై మరోసారి ధరలను పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి.★ లీటర్​ పెట్రోల్​పై 35 పైసలు​, డీజిల్​పై 36 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.★ దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.107.59కు చేరగా.. డీజిల్​ ధర రూ.96.32కు పెరిగింది.★ ముంబయిలో లీటర్​ పెట్రోల్​​ ధర రూ.113.46కు చేరగా.. లీటర్​ డీజిల్​​ ధర రూ.104.38 వద్ద కొనసాగుతోంది.★ కోల్​కతాలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.108.11గా ఉంది. లీటర్​ డీజిల్ ధర రూ.99.43 వద్ద కొనసాగుతోంది.

* ఈ ఏడాదిలో అదీ 6 నెలల వ్యవధిలో బిట్‌కాయిన్‌ విలువ తీవ్ర ఒడుదొడుకులకు లోనైందో చెప్పడానికి ఈ అంకెలే నిదర్శనం. టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ తమ కార్ల కొనుగోళ్ల చెల్లింపులకు బిట్‌కాయిన్‌ను స్వీకరిస్తామంటూ చేసిన ప్రకటనతో, బిట్‌కాయిన్‌ విలువ అమాంతం దూసుకెళ్లి ఏప్రిల్‌ మధ్యలో 64895 డాలర్ల వద్ద అప్పటికి జీవనకాల గరిష్ఠాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత మళ్లీ టెస్లా అధినేతే బిట్‌కాయిన్‌ చెల్లింపులు స్వీకరించబోమని ప్రకటించడం, చైనా బ్యాంకులు కూడా బిట్‌కాయిన్‌ విషయంలో కఠినంగా వ్యవహరించడంతో మేలో ఈ ఊహాజనిత కరెన్సీ విలువ ఒక్కసారిగా కుప్పకూలి 30000 డాలర్లకు పతనమైంది. మళ్లీ జూన్‌ నుంచి క్రమంగా పెరుగుతూ వచ్చినా.. అక్టోబరులో దూకుడు అధికమైంది. తాజాగా బిట్‌కాయిన్‌ ఆధారిత ఎక్స్ఛేంజీ ట్రేడెడ్‌ ఫండ్‌ (ఈటీఎఫ్‌) న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలో నమోదుకావడంతో.. గత గరిష్ఠమైన 64895 డాలర్ల విలువను బిట్‌కాయిన్‌ అధిగమించింది. 66000 డాలర్ల మైలురాయిని అందుకోవడమే కాకుండా కొత్త జీవనకాల గరిష్ఠమైన 66,975 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

* అగ్గి పెట్టె ధరలు 14 ఏళ్ల తరవాత పెరగనున్నాయి. ఇప్పటివరకు రూ.1కి విక్రయిస్తున్న అగ్గిపెట్టెను డిసెంబరు 1 నుంచి రూ.2 చొప్పున విక్రయిస్తామని తయారీ సంస్థలు ప్రకటించాయి. అగ్గిపుల్లల తయారీలో వినియోగించే 14 రకాల ముడి పదార్థాల ధరలు పెరగడమే ఇందుకు కారణమని వివరించాయి. రెడ్‌ ఫాస్ఫరస్‌ ధర రూ.425 నుంచి రూ.810కి, మైనం ధర రూ.58 నుంచి రూ.80కి పెరిగిందని పేర్కొన్నారు. బాక్స్‌ బోర్డులు, పేపర్‌, పొటాషియం క్లోరేట్‌, గంధకం వంటి ధరలు కూడా పెరిగాయని చెబుతున్నారు. ఇంధన ధరల వల్ల రవాణా ఛార్జీలు భారమయ్యాయని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో, అగ్గిపెట్టె తయారీదార్లకు సంబంధించి 5 సంఘాలు శివకాశీలో సమావేశమై, ధరలు పెంచాలని నిర్ణయించాయి. ఒక అగ్గిపెట్టె ధరను 50 పైసల నుంచి రూ.1కి పెంచుతూ 2007లో నిర్ణయం తీసుకోగా, మళ్లీ ఇప్పుడు పెంచుతున్నారు. ఇప్పటివరకు 600 అగ్గిపెట్టెల బాక్సును రూ.270-300కి తయారీదార్లు విక్రయిస్తుండగా, ఇకపై రూ.430-480కి పెంచాలని నిర్ణయించినట్లు నేషనల్‌ స్మాల్‌ మ్యాచ్‌బాక్స్‌ మాన్యుఫాక్చరర్స్‌ అసోసియేషన్‌ కార్యదర్శి వి.ఎస్‌.సేతురథినమ్‌ తెలిపారు. దీనికి అదనంగా 12 శాతం జీఎస్‌టీ, రవాణా ఛార్జీలు కూడా ఉంటాయన్నారు. తమిళనాడులో అగ్గిపెట్టెల తయారీ పరిశ్రమపై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా 4 లక్షల మంది ఉపాధి పొందుతున్నారని అంచనా.

* జులై- సెప్టెంబరు త్రైమాసికానికి ఐసీఐసీఐ బ్యాంక్‌ స్టాండలోన్‌ పద్ధతిలో అత్యధిక త్రైమాసిక లాభాన్ని ప్రకటించింది. అన్ని విభాగాల్లో రుణాల వృద్ధికి తోడు మొండి బకాయిలు తగ్గడంతో నికరంగా రూ.5,511 కోట్ల లాభాన్ని నమోదుచేసింది. 2020-21 ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ.4,251 కోట్లు మాత్రమే. ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.23,651 కోట్ల నుంచి రూ.26,031 కోట్లకు పెరిగింది. ఏకీకృత ప్రాతిపదికన కూడా బ్యాంక్‌ రూ.6,092 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఇది కూడా ఐసీఐసీఐ బ్యాంక్‌కు ఒక త్రైమాసికంలో అత్యధిక లాభమే. 2020-21 ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ.4,882 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం రూ.39,289.60 కోట్ల నుంచి స్పల్పంగా పెరిగి రూ.39,484.50 కోట్లకు చేరింది. స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి 5.17 శాతం నుంచి 4.82 శాతానికి, నికర నిరర్థక ఆస్తులు 1 శాతం నుంచి 0.99 శాతానికి మెరుగయ్యాయి.

* కార్ఖానా జిందా తిలిస్మాత్‌ సంస్థ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, దేశ విపణిలోకి జిందా తిలిస్మాత్‌ బామ్‌ను సంస్థ మేనేజింగ్‌ పార్ట్‌నర్లు సుహైలుద్దీన్‌ ఫారుఖీ, ఇమాదుద్దీన్‌ ఫారూఖీలు శనివారం ఇక్కడ ఆవిష్కరించారు. సుహైలుద్దీన్‌ ఫారుఖీ మాట్లాడుతూ వందేళ్లుగా జిందా తిలిస్మాత్‌ ఉత్పత్తులు ప్రజల నమ్మకాన్ని చూరగొన్నాయన్నారు. ప్రకృతి సిద్ధ ఉత్పత్తులతో రూపొందించిన జిందా బామ్‌ తల, వీపు, ఛాతి, కండరాల నొప్పులను, ముక్కు కారడం, తుమ్ములను దూరం చేస్తుందన్నారు. శరీరం మీద బామ్‌ రుద్దిన కొద్ది సేపు మంట పుట్టినా, తదుపరి ఆ ప్రాంతాన్ని చల్లబర్చడం ఈ బామ్‌ ప్రత్యేకతన్నారు. విదేశాలకూ ఎగుమతి చేయనున్నట్లు చెప్పారు. త్వరలోనే టూత్‌పేస్ట్‌, ఇన్‌హేలర్‌ను ూర్కెట్‌లోకి తెస్తామని ఇమాదుద్దీన్‌ ఫారూఖీ వెల్లడించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో తయారీ కేంద్రం ఉండగా, చేవెళ్ల ప్రాంతంలో మరొకటి ప్రారంభించే యోచన చేస్తున్నట్లు చెప్పారు. ఎగుమతికి ఆదరణ పెరిగితే దుబాయ్‌లో కూడా మరో కేంద్రాన్ని ప్రారంభిస్తామన్నారు. జిందా తిలిస్మాత్‌ ప్రచారకర్త, టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా ఆన్‌లైన్‌లో మాట్లాడుతూ తమ ఇంటిల్లిపాది జిందా తిలిస్మాత్‌ ఉత్పత్తులను చిన్నప్పటి నుంచి వాడుతున్నామన్నారు.