Agriculture

బటన్ నొక్కి రైతులకు డబ్బులు జమచేసిన జగన్-తాజావార్తలు

బటన్ నొక్కి రైతులకు డబ్బులు జమచేసిన జగన్-తాజావార్తలు

* శ్రీ‌వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకటరమణ, అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ, మండలి ఫౌండేషన్ అధ్యక్షుడు బుద్ధప్రసాద్‌, శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి శ్రీవారి సేవలో పాల్గొన్నారు.

* వైఎస్సార్‌ రైతుభరోసా, వైఎస్సార్‌ సున్నావడ్డీ, వైఎస్సార్‌ యంత్ర సేవాపథకం ఈ మూడు పథకాలకు సంబంధించి రూ.2,190 కోట్లను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం తన క్యాంప్‌ కార్యాలయంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా రైతులు, రైతు గ్రూపుల ఖాతాల్లో జమ చేశారు.

* తెలంగాణ ఆర్టీసీ డిజిటల్‌ చెల్లింపుల విధానంలో మరో అడుగు ముందుకేసింది. హైదరాబాద్‌లోని మహాత్మాగాంధీ బస్‌ స్టేషన్‌లో క్యూఆర్‌ కోడ్‌, యూపీఐ ద్వారా చెల్లింపులు చేసే విధానానికి శ్రీకారం చుట్టింది. ఎంజీ బస్‌ స్టేషన్‌లోని టికెట్‌ కేంద్రాల్లో క్యూఆర్‌ కోడ్‌, యూపీఐ ద్వారా చెల్లింపుల సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. టికెట్‌ రిజర్వేషన్‌, పార్సిల్‌, కార్గో సర్వీసులకు ఈ డిజిటల్‌ పేమెంట్స్‌ సేవలు వర్తించనున్నాయి. సికింద్రాబాద్‌లోని జూబ్లీ బస్‌ స్టేషన్‌ (జేబీఎస్‌)లో ఈ తరహా చెల్లింపు సేవలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి.

* ఉస్మానియా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు హెల్మెట్లు ధరించి వినూత్నంగా నిరసన తెలిపారు. సోమవారం ఓ పీజీ విద్యార్థినిపై ఫ్యాన్ విరిగి పడిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో వైద్య విద్యార్థినికి స్వల్ప గాయాలు కావటంతో ఉస్మానియా జూడాలు ఉదయం కొద్ది సేపు మౌన దీక్ష చేపట్టారు. అనంతరం సూపరిండెంట్‌కి ఘటనపై ఫిర్యాదు చేసి ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని కోరారు. ఈ ఘటన తర్వాత ఆస్పత్రిలో శిథిలమైన సీలింగ్‌ ఫ్యాన్లు చూసి వైద్యులు ఆందోళనకు గురవుతున్నారు. ఫ్యాన్లు ఎప్పుడు మీద పడతాయోననే భయంతోనే వైద్యులు విధులకు హాజరవుతున్నారు. మరికొందరు పీజీ విద్యార్థులు ఆస్పత్రిలో హెల్మెట్ ధరించి నిరసన తెలిపారు. ఉస్మానియాలో రోగులు, వైద్య సిబ్బదికి రక్షణ లేకుండా పోయిందని వారు ఆరోపించారు.

* కర్ణాటక రాజధాని బెంగళూరులో ఓ ముఠా పిల్లలపై పైశాచికత్వానికి పాల్పడింది. ముగ్గురు విద్యార్థులను చెట్టుకు కట్టేసి వారిని కొడుతూ బలవంతంగా ధూమపానం చేయించారు. తమను విడిచిపెట్టాలని ఆ చిన్నారులు మొరపెట్టుకున్నా వారు కనికరించలేదు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. తూర్పు బెంగళూరులోని మహదేవపురాలో ఉన్న ప్రభుత్వ పాఠశాల మైదానంలో విద్యార్థులు ఆడుకుంటున్నారు. అక్కడికి చేరుకున్న ఓ గ్యాంగ్‌ ఐదో తరగతి చదువుతున్న ముగ్గురు పిల్లలను పట్టుకొని (11-13 ఏళ్లలోపు వారు) చెట్టుకు కట్టేశారు. వారితో బలవంతంగా బీడీలు తాగించారు. తమను విడిచిపెట్టాలని ఏడ్చి మొరపెట్టుకున్నా ఆ ముఠా కనికరం చూపలేదు. సాయంత్రం ఎప్పుడో వదిలేయడంతో ఇంటికి వెళ్లిన ఓ విద్యార్థి విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపాడు. దీంతో వారు స్థానిక కార్పొరేటర్‌ వద్దకు చేరుకొని తమ పిల్లలకు రక్షణ లేకుండాపోయిందని భయాందోళన వ్యక్తం చేశారు. అనంతరం కార్పొరేటర్‌ సాయంతో పోలీసులను ఆశ్రయించారు.

* సివిల్‌ వివాదాల్లో పోలీసులు జోక్యం చేసుకోవడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు స్పష్టం చేసింది. మహిళా కార్యదర్శులు సివిల్‌ వివాదాలు పరిష్కరించవచ్చునని ఏపీ ప్రభుత్వం పేర్కొనడంపై ఉన్నత న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తం చేసింది. గ్రామ సచివాలయాల్లో మహిళా కార్యదర్శులను పోలీసులుగా నియమించడంపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా సంరక్షణ కార్యదర్శులను పోలీసు శాఖలో ‘మహిళా పోలీసు’లుగా పరిగణిస్తూ ప్రభుత్వం జీవో 59ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. రెవెన్యూ శాఖలో 15 వేల మందిని మహిళా కార్యదర్శులుగా నియమించి పోలీసు విధులు అప్పగించడంపై పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీ పోలీసు చట్టం, రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ఆ జీవో ఉందని విశాఖకు చెందిన ఆరేటి ఉమామహేశ్వరరావు పిటిషన్‌లో పేర్కొన్నారు.

* హుజూరాబాద్ నియోజక‌వ‌ర్గంలో బీజేపీ అభ్య‌ర్థి ఈట‌ల రాజేంద‌ర్‌ను ఓడించాల‌ని తెలంగాణ‌లోని బీసీ సంఘాలు తీర్మానం చేశాయి. ఒక్క హుజురాబాద్‌లోనే కాదు ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో కూడా బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. అక్కడ కూడా బీజేపీని ఓడిస్తాం అని బీసీ సంఘాలు హెచ్చ‌రించాయి. బీసీల‌కు అన్యాయం చేస్తున్న బీజేపీకి ఓటు వేయద్దు అని పిలుపునిచ్చాయి. తెలంగాణ‌ రాష్ట్రంలో అమలవుతున్న ఒక్క పథకం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమ‌లు కావ‌డం లేద‌ని పేర్కొన్నాయి. కర్ణాటక, మ‌హారాష్ట్రాల బీజేపీ నేతలు స్వయంగా తెలంగాణ‌లో త‌మ గ్రామాల‌ను కలుపుకోవాలి డిమాండ్ చేస్తున్నారు అని బీసీ సంఘాలు గుర్తు చేశాయి.

* పార్ల‌మెంట్ శీతాకాల స‌మావేశాల షెడ్యూల్ ఖ‌రారైంది. న‌వంబ‌ర్‌ 29 నుంచి డిసెంబ‌ర్‌ 23 వ‌ర‌కు ఈ స‌మావేశాలు జరుగ‌నున్నాయి. కేంద్ర ప్ర‌భుత్వ వ‌ర్గాలు ఈ విష‌యాన్ని వెల్ల‌డించాయి. ఈ స‌మావేశాల్లో ప్ర‌భుత్వం ఆర్థిక రంగానికి చెందిన రెండు కీల‌క బిల్లుల‌ను ప్ర‌వేశ‌పెట్ట‌నుంది. పెన్ష‌న్ ఫండ్ రెగ్యులేట‌రీ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ (PFRDA) చ‌ట్టం-2013 స‌వ‌ర‌ణ బిల్లు, అదేవిధంగా బ్యాంకింగ్ రెగ్యులేష‌న్ చ‌ట్టం-1949 స‌వ‌ర‌ణ బిల్లు ఈ స‌మావేశాల్లో టేబుల్‌పైకి రానున్నాయి.