Business

ఓలా స్కూటర్ల వెనుక మహిళా శక్తి-వాణిజ్యం

ఓలా స్కూటర్ల వెనుక మహిళా శక్తి-వాణిజ్యం

* రాష్ట్రం ఏదైనా కానీ.. వాహనం కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌ పూర్తయ్యాక దేశంలో ఏ మూలకైనా అందులో ప్రయాణించవచ్చు. లైసెన్స్‌, వాహనానికి సంబంధించిన పత్రాలు ఉంటే చాలు. ఇదే ఆలోచనతో వాహనాలతో పొరుగు రాష్ట్రాలకు వెళ్తున్న తెలుగువారికి ఇబ్బందులు తప్పట్లేదు. వాహనాల నంబర్లు అసలువి కావని, నకిలీ పత్రాలతో వస్తున్నారంటూ పోలీసు, రవాణాశాఖ అధికారులు నిలిపివేస్తున్నారు. వాహనదారులు ఆధారాలు చూపినా సానుకూలంగా స్పందించట్లేదు. ఇటీవల హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారి ఉత్తర్‌ప్రదేశ్‌లోని పుణ్యక్షేత్రాలు చూసొద్దామని కుటుంబంతో కారులో బయల్దేరారు. అయోధ్య వద్ద తనిఖీల్లో ఆయన వాహనం నిలిపివేశారు. చివరికి 5-6 గంటల తర్వాత ఇక్కడి నుంచి రవాణాశాఖ అధికారులు స్పందించాక ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల తెలంగాణ నుంచి సరకుతో ఒక లారీ పంజాబ్‌ చేరింది. సరిహద్దుల వద్ద తనిఖీల్లో పత్రాలు సరైనవి కాదంటూ తిరకాసు పెట్టారు. జరిమానా చెల్లించాలంటూ ఒత్తిడి చేశారు.

* దేశంలో పెట్రోల్‌ ధరలు (Petrol Price) రోజురోజుకు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. లీటరు ధర వంద రూపాయల మార్కు దాటిన అనంతరం ఇవి మరింత వేగంగా పైపైకి ఎగబాకుతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లోని ఓ జిల్లాలో ఏకంగా లీటరు పెట్రోల్‌ ధర రూ.120 మార్కును దాటింది. ఇక్కడే కాకుండా దేశంలో చాలా ప్రాంతాల్లోనూ పెట్రోల్‌ (Petrol), డీజిల్‌ (Diesel) ధరలు రూ.110కిపైగా ఉండడం వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది. మధ్యప్రదేశ్‌లోని అనుప్పూర్‌ జిల్లా కేంద్రంలో లీటరు పెట్రోల్‌ ధర రూ.120.4కు చేరగా.. డీజిల్‌ ధర రూ.110కి చేరువయ్యింది. వీటితో పాటు ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన బాలాఘాట్‌లోనూ లీటరు పెట్రోల్‌ రూ. 119.23పైసలుగా నమోదైంది. రాజధాని భోపాల్‌లోనూ లీటరు ధర రూ.116.62గా ఉంది. మంగళవారం నాడు పెట్రోల్‌పై 36పైసలు పెరగడంతో మరుసటి రోజు రికార్డు స్థాయిలో లీటరు పెట్రోల్‌ ధర రూ.120 మార్కును దాటినట్లు స్థానిక డీలర్‌ అభిషేక్‌ జైశ్వాల్‌ పేర్కొన్నారు. డీజిల్‌పై 37 పైసలు పెరగడంతో దాని ధర రూ.109.17కి చేరిందన్నారు. దాదాపు 250కి.మీ దూరంలో ఉన్న జబల్‌పూర్‌ ఆయిల్‌ డిపో నుంచి అనుప్పూర్‌ జిల్లా కేంద్రానికి పెట్రోల్‌ సరఫరా అవుతుందని.. అందుకే ఇతర జిల్లాలతో పోలిస్తే ఇక్కడ ఇంధన ధరలు మరింత ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు.

* రష్యా నుంచి ఎస్‌-400 ట్రయంఫ్‌ దూరశ్రేణి క్షిపణులను కొనుగోలు చేయకుండా భారత్‌పై ఆంక్షలు విధించొద్దని అమెరికాలో ఇద్దరు కీలక చట్టసభ సభ్యులు ఆ దేశ అధ్యక్షుడు బైడెన్‌కు లేఖ రాశారు. ఈ మేరకు క్షిపణుల కొనుగోలుకు అడ్డంకిగా మారే అవకాశం ఉన్న ‘కౌంటరింగ్‌ అమెరికాస్‌ అడ్వర్సరీస్‌ థ్రూ సాంక్షన్స్‌ యాక్ట్‌ (కాట్సా)’ ఆంక్షల్ని భారత్‌పై అమలు చేయొద్దని కోరారు. ఇది భారత్‌తో పాటు అమెరికా జాతీయ భద్రతకు కూడా సంబంధించిన అంశమని డెమోక్రాటిక్‌ పార్టీకి చెందిన మార్క్‌ వార్నర్‌, రిపబ్లికన్‌ పార్టీకి చెందిన జాన్‌ కోర్నిన్‌ అధ్యక్షుడు బైడెన్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. కాట్సా చట్టంలోని నిబంధనల ప్రకారం ఆంక్షల నుంచి మినహాయింపునిచ్చే అధికారం అధ్యక్షుడికి ఉందన్నారు.

* వ్యాపార వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తున్న డిజిటల్‌ ఆర్థిక సేవల సంస్థ పేటీఎం ఐపీఓ పరిమాణం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. తొలుత రూ.16,600 కోట్లు సమీకరించే అవకాశం ఉందని భావించినా.. అది రూ.18,300 కోట్లకు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. సంస్థలో అతిపెద్ద వాటాదారుగా ఉన్న అలీబాబా గ్రూప్‌ కంపెనీ యాంట్‌ఫిన్‌, సాఫ్ట్‌ బ్యాంక్‌ విక్రయించాలనుకుంటున్న వాటాలను మరింత పెంచడమే ఇందుకు కారణమని పేర్కొన్నాయి.

* రెండు నెలల క్రితం ఎలక్ట్రిక్‌ స్కూటర్ల మార్కెట్లోకి అడుగుపెట్టిన ‘ఓలా ఎలక్ట్రిక్‌’.. అరంగేట్రంలోనే రికార్డు విక్రయాలతో సరికొత్త చరిత్ర సృష్టించింది. అయితే ఈ ఓలా స్కూటర్ల (Ola Scooters)కు మరో ప్రత్యేకత కూడా ఉంది. వీటిని తయారుచేస్తున్న వారంతా మహిళలే. ఇందుకు సంబంధించి ఓ ప్రత్యేక వీడియోను ఆ సంస్థ సీఈవో భవీష్‌ అగర్వాల్‌ (Bhavish Aggarwal) ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు. అందులో ఓలా ఫ్యాక్టరీలో స్కూటర్‌ తయారీ కోసం మహిళలు ఎలా కష్టపడుతున్నారో చూపించారు. వీడియో చివర్లో ‘‘హరిత శక్తి కోసం నారీ శక్తి’’ అంటూ సందేశమిచ్చారు. తమిళనాడులో ‘ఫ్యూచర్ ఫ్యాక్టరీ’ (Future Factory) పేరుతో ఓలా అతిపెద్ద తయారీ యూనిట్‌ను ప్రారంభించిన ఓలా సంస్థ.. దీని నిర్వహణ బాధ్యతను పూర్తిగా మహిళలకే అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో దాదాపు 10 వేల మందికి పైగా మహిళలు విధులు నిర్వహిస్తారని తెలిపింది. తొలి విడత మహిళా ఉద్యోగులు ఇప్పటికే విధుల్లో చేరి ఓలా ఎస్‌ 1 (Ola S1), ఎస్‌ 1 ప్రో (Ola S1 Pro) తయారీ ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ఫ్యాక్టరీలో ఇంకా నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. అవి పూర్తయ్యాక ఏటా కోటి వాహనాలను ఉత్పత్తి చేయాలని ఓలా (Ola) లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు ఈ ఏడాది సెప్టెంబర్లో‌ ఓలా స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేసి విక్రయాలు ప్రారంభించింది. తొలి రెండు రోజుల్లోనే ఏకంగా రూ. 1100 కోట్ల విలువ చేసే స్కూటర్లను విక్రయించి రికార్డు సృష్టించింది. వీటికి ఆర్డర్లు విపరీతంగా రావడంతో విక్రయాల ప్రక్రియను నిలిపివేసింది. దీపావళి (Diwali) పర్వదినాన్ని పురస్కరించుకుని నవంబరు 1న మళ్లీ అమ్మకాలు చేపట్టనున్నట్లు కంపెనీ వెల్లడించింది.