DailyDose

సైనికాధికారులకు పాక్ యువతి వల.ఆర్యన్‌కు బెయిల్-నేరవార్తలు

సైనికాధికారులకు పాక్ యువతి వల.ఆర్యన్‌కు బెయిల్-నేరవార్తలు

* ఆర్యన్​ ఖాన్​కు బెయిల్​ మంజూరు.క్రూజ్‌ నౌక డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన బాలీవుడ్‌ స్టార్‌ షారుక్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌కు బెయిల్‌ మంజూరైంది.బాంబే హైకోర్టు గురువారం ఆర్యన్‌తో పాటు అర్బాజ్‌ మర్చంట్‌, మూన్‌మూన్‌ ధమేచాలకు బెయిల్‌ మంజూరు చేసింది.దీంతో దాదాపు 20 రోజులకు పైగా జైలులో ఉన్న ఆర్యన్‌ ఖాన్‌ జైలు నుంచి విడుదలయ్యేందుకు మార్గం సుగమమైంది.బెయిల్‌ పిటిషన్‌పై బాంబే హైకోర్టులో మూడు రోజుల నుంచి సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. ఆర్యన్‌ ఖాన్‌ తరఫున ప్రముఖ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ  వాదనలు వినిపించారు. ఈ వాదనల సందర్భంగా ఆయన పలు కీలక అంశాలను ప్రస్తావించారు.కుట్రపూరితంగానే ఆర్యన్‌ను ఎన్‌సీబీ అధికారులు ఈ కేసులో ఇరికించారన్నారు. ఆర్యన్‌ వద్ద ఎలాంటి డ్రగ్స్‌ లభించలేదని.. డ్రగ్స్‌ తీసుకున్నట్టు కూడా వైద్య పరీక్షల ఆధారాలేవీ లేవని కోర్టుకు తెలిపారు.  మరి అలాంటప్పుడు ఆర్యన్‌ ఏవిధంగా సాక్ష్యాధారాలను ప్రభావితం చేస్తారన్నారు.తనతో పాటు కలిసి వచ్చిన ఓ వ్యక్తి వద్ద డ్రగ్స్‌ దొరికితే.. ఆర్యన్‌ను ఎలా అరెస్టు చేస్తారు? 20 రోజులకు పైగా ఎలా జైలులో ఉంచుతారు? అని వాదనలు వినిపించారు.అతడి వయస్సును దృష్టిలో ఉంచుకొని ఆర్యన్‌కు బెయిల్‌ మంజూరు చేయాలని న్యాయస్థానాన్ని  కోరారు. ఎన్‌సీబీ తరఫున గురువారం ఏఎస్‌జీ అనిల్‌ సింగ్‌ వాదనలు వినిపించారు. ఆర్యన్‌ డ్రగ్స్‌ వాడటం తొలిసారేమీ కాదని వాదించారు.డ్రగ్స్‌ విక్రేతలను చాలా సార్లు సంప్రదించాడనీ.. డ్రగ్స్‌ విక్రయించే ప్రయత్నంలోనూ ఉన్నట్టు తేలిందన్నారు. వాదోపవాదాలు విన్న బాంబే హైకోర్టు ఆర్యన్‌తో పాటు సహ నిందితులుగా ఉన్న అర్బాజ్‌, మూన్‌మూన్‌లకు బెయిల్‌ మంజూరు చేసింది.రేపో, ఎల్లుండో జైలు నుంచి విడుదలయ్యే అవకాశం!ఈ కేసులో పూర్తిస్థాయి కోర్టు ఆర్డర్‌ శనివారం వెలువడే అవకాశం ఉంది. ఆర్యన్‌ ఖాన్‌, అర్బాజ్‌ మర్చెంట్‌, మూన్‌మూన్‌ ధమేచాలో జైలు నుంచి రేపు లేదా ఎల్లుండి విడుదలై బయటకు వచ్చే అవకాశం ఉందని ముకుల్‌ రోహత్గీ మీడియాకు తెలిపారు.ఆర్యన్‌ ఖాన్‌ కేసులో ఏరోజు ఏం జరిగిందంటే..అక్టోబర్‌ 2న ముంబయి-గోవా క్రూజ్‌ నౌకలో రేవ్‌ పార్టీపై ఎన్‌సీబీ అధికారులు  దాడులు చేశారు. ఆర్యన్‌ ఖాన్‌తో పాటు  అతడి స్నేహితుడు అర్బాజ్‌ మెర్చంట్‌, మూన్‌మూన్‌ ధమేచాలతో పాటు మరో ఐదుగురిని అరెస్టు చేశారు.అక్టోబర్‌ 3న ఎన్‌సీబీ జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడే ఆర్యన్‌ ఖాన్‌ అరెస్టును ధ్రువీకరించారు. డ్రగ్స్‌కు సంబంధించిన కేసులో అరెస్టు చేసినట్టు తెలిపారు. అదేరోజు ఆర్యన్‌తో పాటు ఏడుగురికి వైద్య పరీక్షలు నిర్వహించారు.అక్టోబర్‌ 4న ఆర్యన్‌ ఖాన్‌తో పాటు ఈ కేసులో నిందితుల బెయిల్‌ పిటిషన్‌పై తొలిసారి వాదనలు జరిగాయి. అయితే, ఎన్‌సీబీ అక్టోబర్‌ 11 వరకు తమ కస్టడీకి అప్పగించాలని వాదించింది. ఆర్యన్‌ డ్రగ్స్‌ తీసుకున్నట్టు ఆధారాల్లేవని అతడి తరఫున్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే, అక్టోబర్‌ 7వరకు కస్టడీని పొడిగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది.అక్టోబర్‌ 7న ముంబయి ప్రత్యేక న్యాయస్థానం ఆర్యన్‌ ఖాన్‌తో పాటు ఏడుగురు నిందితులకు 14 రోజుల పాటు జ్యుడీషియల్‌ కస్టడీకి పంపుతూ ఆదేశాలు ఇచ్చింది.అక్టోబర్‌ 8న ఆర్యన్‌ ఖాన్‌ను ముంబయిలోని ఆర్థర్‌ రోడ్డులో ఉన్న జైలుకు తరలించారు.అక్టోబర్‌ 10న బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ షారుక్‌ ఖాన్‌ డ్రైవర్‌ వాంగ్మూలాన్ని ఎన్‌సీబీ రికార్డు చేసింది.అక్టోబర్‌ 11న బెయిల్‌ పిటిషన్‌పై విచారణను అక్టోబర్‌ 13కు న్యాయస్థానం వాయిదా వేసింది. రిప్లై దాఖలు చేయాలంటూ ఎన్‌సీబీని ఆదేశించింది.అక్టోబర్‌ 14న ఆర్యన్‌ బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును రిజర్వులో ఉంచింది. దీంతో ఆర్యన్‌ ఖాన్‌ ఈ నెల 20వరకు జైలులోనే ఉండాల్సి వచ్చింది.అక్టోబర్‌ 20న విచారణలో ఆర్యన్‌కు ఎన్‌డీపీఎస్‌ ప్రత్యేక న్యాయస్థానం బెయిల్‌ నిరాకరించింది. ఈ కేసును ప్రాథమికంగా చూస్తే నిందితుడు తరచూ మాదకద్రవ్యాల అక్రమ కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్టుగా కనిపిస్తోందని అభిప్రాయపడింది. నిషిద్ధ  డ్రగ్స్‌ను చేరవేసేవారితో అతడు టచ్‌లో ఉన్నట్టుగా వాట్సాప్‌ చాట్‌ సంభాషణలను బట్టి తెలుస్తోందని న్యాయమూర్తి వీవీ పాటిల్‌ వ్యాఖ్యానించారు. బెయిల్‌పై విడుదలైతే ఇలాంటి మరో నేరం చేయరని చెప్పలేం..గనక బెయిల్ ఇవ్వలేం అని స్పష్టంచేశారు. దీంతో ఆర్యన్‌ తరఫు న్యాయవాది బెయిల్‌ కోసం బాంబే హైకోర్టును ఆశ్రయించారు.అక్టోబర్‌ 26న బాంబే హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఆర్యన్‌ తరఫున మాజీ ఏజీ ముకుల్‌ రోహత్గీ, సతీశ్‌ మానెశిందే వాదనలు వినిపించారు. ఈ కేసులో ఆర్యన్‌ని కావాలనే ఇరికించి 20 రోజుల పాటు జైలులో ఉంచారని వాదించారు. తదుపరి వాదనలను ఈ నెల 27కు న్యాయస్థానం వాయిదా వేసింది.

* తూర్పుగోదావరి జిల్లా చింతూరు పరిధిలో రూ.2 కోట్ల విలువైన గంజాయిని మోతుగూడెం వద్ద పోలీసులు పట్టుకున్నారు. చింతూరు ఏఎస్పీ కృష్ణకాంత్‌ బుధవారం విలేకరులతో మాట్లాడుతూ… ‘మోతుగూడెం పోలీస్‌స్టేషన్‌ వద్ద తనిఖీలు చేస్తుండగా విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల సరిహద్దుల నుంచి హైదరాబాద్‌కు కొబ్బరికాయల మాటున తరలిస్తున్న 2,000 కిలోల గంజాయిని పట్టుకున్నాం. గంజాయితో పాటు వ్యాన్‌, కారు, 2 వేల నగదును స్వాధీనం చేసుకున్నాం’ అని వివరించారు. ఖమ్మం జిల్లా లింగాపురం మండలం కొత్తపల్లికి చెందిన న్యాయవాది కడియం గురుసాగర్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం, గంట్రావుపల్లెకు చెందిన పొగిడాల పర్వతాలుతో పాటు మరొకరిని అరెస్టు చేశామన్నారు.

* నగరంలోని హిమాయత్‌నగర్‌లో యువతి(మాజీ మిస్‌ తెలంగాణ) ఇంట్లో ఆత్మహత్యకు యత్నించారు. ఉరి బిగించుకున్న ఆమె ఆన్‌లైన్‌లో పోస్ట్‌ పెట్టారు. దీన్ని గమనించిన యువతి స్నేహితులు పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే స్పందించిన పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని యువతిని రక్షించారు. అనంతరం ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

* తండ్రి మందలించాడన్న మనస్తాపంతో ఓ విద్యార్థి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురం జిల్లా తాడిపత్రిలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. బంధువులు, రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని విజయ్‌నగర్‌ కాలనీకి చెందిన హమాలీ కుమారుడు నవీన్‌ (21) పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో పాలిటెక్నిక్‌ రెండో సంవత్సరం చదువుతున్నాడు. అయితే, నవీన్‌ రాత్రి సమయాల్లో ఆలస్యంగా ఇంటికి వెళ్తుండేవాడు.

* బాలేశ్వర్‌ జిల్లా (ఒడిశా)లోని చాందీపూర్‌లోని అయిదుగురు డీఆర్‌డీఓ ఉద్యోగులకు వలపు వల విసిరి (హనీట్రాప్‌) రహస్యాలు సేకరించిన పాకిస్థాన్‌కు చెందిన యువతి.. రాజస్థాన్‌ జోధ్‌పూర్‌లోని మిలటరీ ఇంజినీర్‌ సర్వీసెస్‌ నుంచి రహస్యాలు రాబట్టేందుకు ప్రయత్నించిందని ఒడిశా క్రైం బ్రాంచ్‌ బుధవారం వెల్లడించింది. సామాజిక మాధ్యమాల ద్వారా అక్కడ పనిచేస్తున్న ఉద్యోగితో పరిచయం పెంచుకొని, ప్రలోభ పెట్టి రహస్యాలు తెలుసుకోవాలనుకుందని వివరించింది. ఈ ఘటనపై రాజస్థాన్‌ క్రైం బ్రాంచ్‌ కేసు నమోదు చేసి, ఒడిశా క్రైం బ్రాంచ్‌ను సంప్రదించిందని వెల్లడించింది. ఇటీవల చాందీపూర్‌ డీఆర్‌డీవో రహస్యాలు, ఫొటోలు లీక్‌ చేసిన ఆరోపణల్లో క్రైం బ్రాంచ్‌ అయిదుగురు ఉద్యోగులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వీరిని విచారించగా ఈ కుట్ర వెనుక పాకిస్థాన్‌కు చెందిన యువతి ఉన్నట్లు బయటపడింది. ఇప్పటికీ సదరు యువతికి చెందిన కొన్ని ఖాతాలు యాక్టివ్‌గా ఉన్నాయని, వాటి ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామన్న ఒడిశా క్రైం బ్రాంచ్, యువతిని గుర్తించేందుకు ఇంటర్‌పోల్‌ సహాయం తీసుకున్నట్లు తెలిపింది.