Politics

మంగళవారం మరదలమ్మపై మంత్రి వివరణ. కేటీఆర్‌కు అనసూయ ప్రశ్నలు-తాజావార్తలు

మంగళవారం మరదలమ్మపై మంత్రి వివరణ. కేటీఆర్‌కు అనసూయ ప్రశ్నలు-తాజావార్తలు

* చిన్నారుల భద్రత విషయంలో కొన్ని పాఠశాలలు అనుసరిస్తోన్న తీరుపై నటి, ప్రముఖ వ్యాఖ్యాత అనసూయ అసహనం వ్యక్తం చేశారు. పిల్లల్ని తిరిగి స్కూళ్లకు పంపించాలంటూ కొన్ని పాఠశాలల యాజమాన్యాలు తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకువస్తున్నాయని ఆమె అన్నారు. పిల్లల భద్రతపై స్కూల్స్‌ ఎలాంటి భరోసా ఇవ్వడం లేదంటూ శుక్రవారం ఉదయం ఆమె మంత్రి కేటీఆర్‌కు ట్వీట్‌ చేశారు. ‘‘కేటీఆర్‌ సర్‌.. కరోనా కారణంగా మొదట మనం లాక్‌డౌన్‌ ఫాలో అయ్యాం. దేశవ్యాప్తంగా కేసులు క్రమంగా తగ్గుతుండటంతో లాక్‌డౌన్‌ని తొలగించారు. దేశంలో వ్యాక్సినేషన్‌ కూడా వేగంగా సాగుతోంది. కానీ, వ్యాక్సిన్‌ తీసుకోని చిన్నారుల పరిస్థితి ఏమిటి? స్కూల్‌లో పిల్లలకు ఏం జరిగినా యాజమాన్యానిది బాధ్యత కాదని చెబుతూ తల్లిదండ్రులు మొదట ఓ అంగీకారపత్రాన్ని తప్పకుండా అందజేయాలని స్కూల్స్‌ ఎందుకు ఒత్తిడి తెస్తున్నాయి? చెప్పండి సర్‌.. ఇదెక్కడి న్యాయం? ఎప్పటిలాగానే ఈ విషయాన్ని కూడా మీరు సమీక్షిస్తారని భావిస్తున్నాను’’ అని అనసూయ ట్వీట్‌ చేశారు.

* రాష్ట్రాన్ని పాలించే అర్హత వైకాపా ప్రభుత్వానికి లేదని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో తెదేపా అధినేత చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా కుప్పం బస్టాండ్‌ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. ‘‘విశాఖ ఏజెన్సీలో 25వేల ఎకరాల్లో గంజాయి పండిస్తున్నారు. రూ.8వేల కోట్ల విలువైన గంజాయి సరఫరా చేస్తున్నారు. చర్యలు తీసుకోమని కోరితే తెదేపా కార్యాలయాలపై దాడులు చేస్తున్నారు. అక్రమ కేసులు పెడుతున్నారు. దిల్లీలో రాష్ట్రపతిని కలిసి రాష్ట్ర పరిస్థితులు వివరించాం. రాష్ట్రంలో ప్రభుత్వ ఉగ్రవాదం ఉందని రాష్ట్రపతికి తెలిపా. తెదేపా కార్యకర్తలపై పోలీసులు కేసులు పెడుతున్నారు. డీజీపీ కార్యాలయం పక్కనే ఉన్న తెదేపా కార్యాలయంపై దాడులు చేయిస్తున్నారు. నాపై బాంబులు వేస్తామని అంటున్నారు. బాంబులకు భయపడే వ్యక్తిని కాదు. అక్రమ కేసులకు భయపడి పార్టీ మూసేయాలా? పేదల కోసం ధర్మపోరాటం చేస్తున్న నన్ను ప్రజలే కాపాడుకుంటారు. రాష్ట్రంలో వింత వింత మద్యం బ్రాండ్లు తెచ్చారు. నాసిరకం బ్రాండ్లతో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. ఎన్నికల ముందు మద్యపాన నిషేధం హామీ ఇచ్చారు. కరోనా సమయంలో కూడా మద్యం షాపులు తెరిచారు. జగన్‌ అధికారంలోకి వచ్చాక కొత్తరకం మద్యం బ్రాండ్లు తెచ్చి.. రేట్లు విపరీతంగా పెంచేశారు’’ అని చంద్రబాబు విమర్శించారు.

* హుజూరాబాద్‌ ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్‌ గోయల్‌ తెలిపారు. రేపు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుందని చెప్పారు. పోలింగ్‌ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించినట్లు పేర్కొన్నారు. దివ్యాంగుల కోసం వీల్‌ఛైర్స్‌ ఏర్పాటు చేశామన్నారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక కోసం 32 మంది సూక్ష్మ పరిశీలకులు, ఈవీఎంల పరిశీలనకు అందుబాటులో ఆరుగురు ఇంజినీర్లు, భద్రత కోసం 20 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించినట్లు వెల్లడించారు. ఓటర్లు ఓటు వేసే సమయంలో మాస్క్‌ ధరించి, భౌతిక దూరాన్ని పాటించాలన్నారు. రాజకీయ పార్టీల నుంచి అనేక ఫిర్యాదులు వచ్చాయని.. వాటిలో కొన్ని ఫిర్యాదులపై చర్యలు తీసుకున్నామన్నారు. ఇప్పటివరకు రూ.3.50 కోట్లు స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. ఓటర్లను ప్రలోభపెట్టే పనులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని.. డబ్బుల పంపిణీ ఆరోపణలపై ఎప్పటికప్పుడు విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. తప్పుడు వార్తలు వ్యాప్తి చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 2018 ఎన్నికల్లో హుజూరాబాద్‌లో 84.5 శాతం ఓటింగ్‌ నమోదైందని.. ఈసారి ఓటింగ్‌ శాతం పెరగాలని కోరుకుంటున్నట్లు సీఈఓ శశాంక్‌ గోయల్‌ పేర్కొన్నారు.

* విశాఖలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జనసేన పార్టీ ఈనెల 31న భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధమైంది. కూర్మన్నపాలెం స్టీల్‌ ప్లాంట్‌ ఆర్చ్‌ వద్ద సభా వేదిక ఏర్పాటు చేయాలని జనసేన నిర్ణయించింది. సభావేదిక మార్చాలని పోలీసులు సూచించారు. పోలీసుల ఆదేశాలను పట్టించుకోకుండా సభ అక్కడే జరిపితీరుతామని జనసేన శ్రేణులు కరపత్రాలు పంచారు. ఈనేపథ్యంలో జనసేన సభకు పోలీసుల అనుమతి ఉంటుందా? లేదా? అనే ఉత్కంఠ నెలకొంది.

* ఆంధ్రాలోనూ పార్టీ పెట్టాలని కోరుతున్నారని తెరాస ప్లీనరీ సందర్భంగా ఆపార్టీ అధినేత కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. దీనిపై నిన్న మంత్రి పేర్ని నాని కౌంటర్‌ ఇవ్వగా.. పేర్ని నాని, కేసీఆర్‌ వ్యాఖ్యలపై ట్విటర్‌ వేదికగా రేవంత్‌ రెడ్డి స్పందించారు. తాజా పరిణామాల నేపథ్యంలో మంత్రి పేర్ని నాని తనదైన శైలిలో మరోసారి స్పందించారు. తెలంగాణలో రాజకీయ శూన్యత వల్లే కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయని ఏపీ సమాచారశాఖ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు.

* పశ్చిమ్ బెంగాల్‌లో భాజపాపై అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్న టీఎంసీ.. దేశ రాజకీయాల్లో పాగా వేసేందుకు పావులు కదుపుతోంది. అందులో భాగంగానే ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ మూడు రోజుల పాటు గోవాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్‌ టీఎంసీలో చేరారు. ఈ విషయాన్ని పార్టీ ట్విటర్ వేదికగా వెల్లడించింది. ఆయనతో పాటు నటి నఫీసా ఆలీ కూడా ఈ రోజు పార్టీలో చేరారు.

* ‘మంగళవారం మరదలమ్మా’ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వివరణ ఇచ్చారు. ‘‘నేను ఎవరి పేరుతో ఆ వ్యాఖ్యలు చేయలేదు. ఏకవచనం వాడలేదు. చివరన అమ్మా అని కూడా అన్నాను’’ అని మంత్రి వివరించారు. ఈ వ్యాఖ్యల వల్ల ఎవరికైనా బాధ కలిగితే విచారం, పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు. తాను అన్న మాటలు.. సంస్కారవంతులకు సంస్కారంగానే అర్థమవుతాయన్నారు. . ‘‘వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ (వైతెపా) అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల నా కుమార్తె కంటే పెద్దది.. నా సోదరి కంటే చిన్నది. తన తండ్రి సమకాలికుడైన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎకవచనంతో సంబోధించడం సంస్కారమేనా?’’ అని ప్రశ్నించారు. ఈ విషయంలో తెరాస పార్టీ శ్రేణులు సరైన సమయంలో స్పందిస్తాయన్నారు. వారి మౌనం, సంయమనం, సంస్కారానికి నిదర్శనమన్నారు.

* కన్నడ నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ మరణంతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. కన్నడ చిత్ర పరిశ్రమతో పాటు, తెలుగు, తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమల్లోని నటులు, సాంకేతిక నిపుణులు ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేసుకున్నారు. శుక్రవారం ఉదయం వ్యాయామం చేస్తున్న ఆయనకు గుండె పోటు రావడంతో విక్రమ్‌ ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. సినీ నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ అకాల మరణంతో భారతీయ చలన చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ఆయన లేరనే వార్త యావత్‌ సినీ అభిమానుల్ని విస్మయానికి గురి చేసింది. రాజ్‌కుమార్‌.. బాల నటుడిగా తన నట ప్రస్థానాన్ని మొదలుపెట్టి కన్నడ పవర్‌స్టార్‌గా ఎదిగారు. ‘స్టార్‌డమ్‌ తెరపై ఉన్నంత వరకే బయట కాదు’ అంటూ ఎంతోమంది హృదయాల్ని గెలుచుకున్నారు. తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితులయ్యారు. పలు రీమేక్‌ కథలతో పరోక్షంగా, డబ్బింగ్‌ చిత్రాలతో ప్రత్యక్షంగా ఇక్కడి వారిని అలరించారు. తెలుగు ప్రేక్షకులతోనే కాదు టాలీవుడ్‌ అగ్ర హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌ తదితరులతో పునీత్‌తో మంచి అనుబంధం ఉంది.

* దేశంలో కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణ సమయంలో ఆత్మహత్యలు మరింత పెరిగినట్లు కనిపిస్తోంది. గతేడాది దేశవ్యాప్తంగా మొత్తం లక్షన్నర మందికిపైగా ప్రాణాలు తీసుకున్నట్లు జాతీయ నేర గణాంకాల సంస్థ (NCRB) నివేదిక వెల్లడించింది. నిత్యం 418 మంది బలవన్మరణానికి పాల్పడినట్లు తెలిపింది. దేశంలో వివిధ కారణాల వల్ల ప్రాణాలు తీసుకుంటున్న వారిసంఖ్య గతేడాదితో పోలిస్తే దాదాపు 10 శాతం మరణాలు ఎక్కువ నమోదయ్యాయి. 2019లో మొత్తం లక్షా 39వేల మంది ప్రాణాలు తీసుకోగా 2020లో ఈ సంఖ్య లక్షా 53 వేలకు పెరిగింది. ప్రతి పదిలక్షల జనాభాకు 10.4గా ఉన్న ఆత్మహత్యల రేటు 11.3కి పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

* వ్యాయామం చేసేవారు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కసరత్తులు చేసే సమయంలో డీహైడ్రేషన్‌కు గురైనా, హైబీపీ, లో-బీపీ లేదంటే విపరీతమైన చెమట వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు.

* సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ వెంట్రామిరెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తూ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌ రావు పిలుపు మేరకు భాజపా కార్యకర్తలు శుక్రవారం కలెక్టరేట్‌ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో సిద్దిపేట సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డిని ముందస్తుగా తన నివాసం వద్ద అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. కలెక్టరేట్‌ వద్ద ఆందోళనకు దిగిన కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముట్టడి నేపథ్యంలో సిద్దిపేట టౌన్‌లోని ప్రతి చౌరస్తాలో పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు కలెక్టరేట్‌లో పనిచేసే ఉద్యోగులు ఆలస్యంగా రావడంతో లోపలికి అనుమతించలేదు.

* కన్నకొడుకే కసాయిగా మారాడు. తల్లి పేరు మీద ఉన్న భూమిని తన పేరు మీద రాయాలంటూ ఒత్తిడి చేసిన తనయుడు ఏకంగా మాతృమూర్తిని కడతేర్చిన ఘటన చందూర్‌ మండలం లక్ష్మాపూర్‌లో గురువారం చోటు చేసుకుంది. బోధన్‌ ఏసీపీ రామారావు కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన సాయవ్వకు(60) ముగ్గురు కుమార్తెలు, ఒక కొడుకు నారాయణ ఉన్నారు. అందరికీ పెళ్లిళ్లు జరిగి వేరుపడ్డారు. వ్యవసాయం చేసే కొడుకు దగ్గరే సాయవ్వ ఉంటోంది. ఆమె పేరు మీదున్న నాలుగెకరాల భూమిని తనకు రాయాలని గత కొంత కాలంగా తల్లితో నారాయణ గొడవ పడుతున్నాడు. బుధవారం రాత్రి ఈ విషయమై మాటామాటా పెరిగి సాయవ్వ గొంతునులిమి హత్య చేశాడు. మృతదేహాన్ని ఇంటి బయట పడేసి పరారయ్యాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు సీఐ అశోక్‌రెడ్డి, ఎస్సై అనిల్‌రెడ్డి తెలిపారు.