DailyDose

నాగశౌర్య నార్సింగి ఫాంహౌజ్‌లో కొత్త కోణం-నేరవార్తలు

నాగశౌర్య నార్సింగి ఫాంహౌజ్‌లో కొత్త కోణం-నేరవార్తలు

* ఛత్తీష్‌గడ్ లో లొంగిపోయిన మావోయిస్టులు.ఛత్తీష్‌గడ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో 14 మంది మావోయిస్టులు లొంగిపోయారు.జిల్లా ఎస్పీ డాక్టర్ అభిషేక్ పల్లవ్ ఎదుట సరెండర్ అయ్యారు.ఇంటింటికి తిరిగి చేసిన ప్రచారానికి ఆకర్షితులై ఇప్పటివరకు 454మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిశారని జిల్లా ఎస్పీ తెలిపారు.లొంగిపోయిన వారిలో 117మంది రివార్డ్ కలిగిన మావోలు ఉన్నట్లు ఆయన వెల్లడించారు.లొంగిపోయినవారు ఎల్‌ఓఎస్‌, మిలిషియా సభ్యులుగా పనిచేసినట్లు తెలిపారు.వీరికి పునరావాసం క్రింద తక్షణం పదివేల రూపాయల చెక్‌ను అందజేశారు.

* రంగారెడ్డి జిల్లా మంచిరేవుల ఫామ్ హౌస్‌లో పేకాట ఆడుతున్న కేసులో అరెస్టయిన 30మంది నిందితులను నార్సింగి పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. విచారణ జరిపిన కోర్టు నిందితులకు 14రోజులు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. నిందితులను చంచల్‌గూడ జైలుకు తరలించారు. అయితే, ఈ కేసులో ప్రధాన నిందితుడు గుత్తా సుమన్‌ని పోలీసులు ఏడు రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోరారు. దీనిపై రేపు కోర్టులో వాదనలు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ‘‘ఈ కేసులో ప్రధాన నిందితుడైన గుత్తా సుమన్‌ కొన్నేళ్లుగా స్టార్‌ హోటళ్లు, ఫామ్‌ హౌస్‌లలో క్యాసినో నిర్వహిస్తున్నాడు. పోలీసులకు చిక్కకుండా ప్రణాళికలు వేసేవాడు. రూ.లక్షలు పెట్టి పేకాట ఆడేవారిని ఆకర్షించేవాడు. పేకాట ఆడేవారితో వాట్సప్‌ గ్రూపులు తయారు చేశాడు. వాట్సాప్‌ చాటింగ్‌లో పేకాట ఆడే స్థలాన్ని షేర్‌ చేసేవాడు. ముందుగా డబ్బు కట్టిన వారికి కాయిన్లు ఇచ్చేవాడు. రెడ్‌ కాయిన్‌కు రూ.5వేలు, గ్రీన్‌ కాయిన్‌కు రూ.2వేలు, బ్లూ కాయిన్‌కు రూ.వెయ్యి చొప్పున ఇచ్చేవాడు. పేకాటరాయుళ్లకు కాయిన్ల ద్వారా ఆహారం, మద్యం సరఫరా చేసేవాడు. డిజిటల్‌ రూపంలో నగదు తీసుకొంటున్నాడు. ఆరు నెలలుగా మాదాపూర్‌ పరిసరాల్లో క్యాసినోలు నిర్వహిస్తున్నాడు. బర్త్‌డేల పేరుతో శివార్లులో ఫామ్‌ హౌస్‌లు అద్దెకు తీసుకున్నాడు. అతడిపై తెలుగు రాష్ట్రాల్లోని పలు పోలీస్‌ స్టేషన్లలో కేసులు ఉన్నాయి. పంజాగుట్ట, కూకట్‌పల్లి, గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్లలో అతడిపై కేసులు ఉన్నాయి. బర్త్‌డే పేరుతో మంచిరేవులలో ఫాం హౌస్‌ అద్దెకు తీసుకున్నాడు. తనకు తెలిసిన 29మందిని అక్కడకు పిలిచాడు. నాలుగు గదుల్లో పేకాటకు ఏర్పాట్లు చేశాడు. పేకాట రాయుళ్ల వద్ద డబ్బు తీసుకొని క్యాసినో కాయిన్లు ఇచ్చాడు. పక్కా సమాచారంతో నిన్న రాత్రి నార్సింగి పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు’’ అని వివరించారు.

* మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని దమోహ్‌ జిల్లాలో ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజేశ్‌ ముండా తాగిన మత్తులో చేసిన నిర్వాకానికి అధికారులు సస్పెండు చేశారు. ఈయన తనతోపాటు నృత్యం చేయాలంటూ తరగతి గదిలోని విద్యార్థినులను బలవంతపెట్టడమే కాకుండా ఆ దృశ్యాల వీడియో చిత్రీకరణ కూడా చేశాడు. దమోహ్‌కు 80 కిలోమీటర్ల దూరాన ఉన్న మధియదో గ్రామంలోని మిడిల్‌ స్కూలులో శుక్రవారం ఈ సంఘటన జరిగింది. విద్యార్థినుల తల్లిదండ్రులు తమకు ఫిర్యాదు చేసినట్లు డీఈవో ఎస్‌.కె.మిశ్రా ఆదివారం మీడియాకు తెలిపారు. ఈ ఉదంతంపై విచారణకు ఆదేశించిన జిల్లా కలెక్టర్‌ కృష్ణ చైతన్య నివేదిక అందాక సస్పెన్షన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. హెచ్‌ఎంను పతేరా బ్లాక్‌ ఆఫీసుకు అటాచ్‌ చేసినట్లు డీఈవో తెలిపారు.

* అత్తింటి వేధింపులు తాళలేక ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని బలవన్మరణం చెందిన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో దేవివిహార్‌లో ఆదివారం చోటుచేసుకుంది. దేవునిపల్లి ఎస్సై రవికుమార్‌ కథనం ప్రకారం.. కార్తీక అలియాస్‌ శిరీష(32)కు హరిప్రసాద్‌(35)తో 2013లో వివాహమైంది. వీరికి కవలలు జన్మించారు. బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అయిన ఆమె కరోనా నేపథ్యంలో ఇంటి నుంచే పనిచేస్తున్నారు. కొన్నాళ్లుగా భర్తతోపాటు అత్త బాలరాజవ్వ మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారు. ఇంటి నిర్మాణానికి పుట్టింటి నుంచి డబ్బులు తేవాలని ఒత్తిడి చేసేవారు. ఈ క్రమంలో మనస్తాపం చెందిన ఆమె అందరూ నిద్రిస్తున్న సమయంలో ఆదివారం తెల్లవారుజామున ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. పుట్టింటి వారు తమ కూతుర్ని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. పిల్లలకు బంగారు భవిష్యత్తు అందించాలని పరితపించేదని, కానీ ఆశలు తీరకుండానే ఆయువు తీశారని కన్నీరుమున్నీరయ్యారు.

* గండిపేట మండలం మంచిరేవుల గ్రీన్‌ల్యాండ్స్‌లోని ఓ భవనంలో నడుస్తున్న ఓ జూద శిబిరంపై ఆదివారం సైబరాబాద్‌ పోలీసులు దాడి చేసి 30 మందిని అరెస్టు చేశారు. రూ.6.70 లక్షలు, 33 చరవాణులు, 3 కార్లు సీజ్‌ చేశారు. ఈ మేరకు సమాచారం అందుకున్న మాదాపూర్‌ ఎస్‌ఓటీ పోలీసులు ఆదివారం సాయంత్రం మంచిరేవుల గ్రీన్‌ల్యాండ్స్‌లోని భవనంపై దాడులు చేశారు. ఈ భవనం ఓ యువ హీరోకు చెందినదిగా కలకలం రేగినా, తర్వాత ఆ హీరో తండ్రి సినిమా షూటింగ్‌ కోసం అద్దెకు తీసుకున్నట్లుగా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. వారికి తెలిసిన ఓ వ్యక్తి పార్టీ చేసుకునేందుకు భవనాన్ని తీసుకున్నట్లు గుర్తించారు. నిందితుల్లో ప్రముఖులు ఉన్నట్లు తెలిసింది.

* రంగారెడ్డి జిల్లా మంచిరేవుల వద్ద ఫాంహౌస్‌లో పేకాట కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే ప్రధాన నిందితుడు, ఏపీకి చెందిన గుత్తా సుమన్‌ సహా 30 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఫాంహౌస్‌ను సినీనటుడు నాగశౌర్య తండ్రి వద్ద అద్దెకు తీసుకున్నట్లు తెలుస్తున్న నేపథ్యంలో పూర్తి సమాచారం కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. బర్త్‌డే వేడుకకు ఒకరోజుకు అద్దెకు ఫాంహౌస్‌ను సుమన్‌కు ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు విజయవాడలో గుత్తా సుమన్‌పై భూకబ్జా కేసు ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీలో ఆయన చేపట్టే కార్యకలాపాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎన్జీవో పేరుతో సుమన్‌ డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించారు. అక్కడ ఆయన పలు స్థిరాస్తి మోసాలకు పాల్పడినట్లు నార్సింగి పోలీసుల దర్యాప్తు వెల్లడైనట్లు తెలుస్తోంది. నిందితులంతా ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉన్నారు.

* కేరళలో విషాదం చోటుచేసుకుంది. కోచికి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ మిస్‌ కేరళ అన్షీ కబీర్ (24)‌, 2019లో ఆమెతో పోటీలో పాల్గొని రన్నరప్‌గా నిలిచిన అంజనా షాజన్‌ (25) దుర్మరణం చెందారు. కోచికి సమీపంలోని వైటిల్లా వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఓ ద్విచక్రవాహనాన్ని తప్పించే క్రమంలో పల్టీలు కొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జయింది. ఈ దుర్ఘటనలో డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. అయితే, ప్రమాదం సమయంలో కేవలం డ్రైవర్‌ మాత్రమే సీటు బెల్టు ధరించినట్టు పోలీసులు భావిస్తున్నారు. అన్సు కబీర్‌ది తిరువనంతపురం కాగా.. అంజనా షాజన్‌ కోచికి చెందినవారు.

* రాజస్థాన్‌లోని భరత్‌పుర్‌ ప్రత్యేక జడ్జి జితేంద్ర గొలియా 14 ఏళ్ల బాలుడిని లైంగికంగా వేధిస్తున్నట్లు సంచలన ఆరోపణలు వచ్చాయి. బాధితుడి తల్లి ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏసీబీ కేసులు పరిశీలించే ఈ జడ్జితోపాటు ఆయన సహాయకులు ఇద్దరు తన కుమారుణ్ని లైంగికంగా వేధిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తుపాకీతో కాల్చి చంపుతానని జడ్జి వితంతువునైన తనను బెదిరించినట్లు ఆరోపించారు. హైకోర్టు ఆదేశాలతో జడ్జిపై తక్షణం సస్పెన్షన్‌ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ కేసులో బాలుణ్ని బెదిరించిన ఏసీబీ అధికారి పరమేశ్వర్‌లాల్‌ యాదవ్‌ కూడా సస్పెండ్‌ అయ్యారు.