Movies

శెభాష్…ప్రణీత

శెభాష్…ప్రణీత

ప్రజలకు సేవా చేసేందుకు ముందుండే నటుల్లో ప్రణీత ఒకరు. ఆ సంకల్పంతోనే ‘ప్రణీత ఫౌండేషన్‌’ని ప్రారంభించారు. కొవిడ్‌ ఫస్ట్‌వేవ్‌, సెకండ్‌వేవ్‌ సమయంలో ఎంతోమందికి ఎన్నో విధాలుగా సాయం చేసిన ప్రణీత.. మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. కన్నడ నటుడు దివంగత పునీత్‌ రాజ్‌కుమార్‌ గుర్తుగా ఒకరోజు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పునీత్‌ ఈ సమాజానికి ఎన్నో మంచి పనులు చేశారని, ఆ బాటలో నడవటమే ఆయనకు మనమిచ్చే ఇచ్చే అసలైన నివాళి అని అన్నారు. ‘అప్పూ సర్‌.. చిన్నారుల నుంచి వృద్ధుల వరకూ అవసరమైన వారందరికీ సాయం చేశారు. వారి విద్య, వైద్య ఖర్చులను భరించారు. ఇలా ఎన్నో మంచి పనులు చేశారు. అలాంటి గొప్ప వ్యక్తి అడుగుజాడల్లో నడవటమే ఆయనకు మనమిచ్చే అసలైన నివాళి’ అని పేర్కొన్నారు. బెంగళూరు నగరంలోని అంబేడ్కర్‌ భవన్‌లో ఈ క్యాంపును ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. నవంబర్‌ 3న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు ఎవరైనా ఉచితంగా వైద్య పరీక్షలు చేయించుకోవచ్చన్నారు. పునీత్‌ రాజ్‌కుమార్‌ గుండెపోటుతో అక్టోబరు 29న మరణించారు. ఆయన అకాల మరణం భారతీయ చలన చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు నింపింది. సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా ఆయన చేసిన సేవల్ని కొనియాడుతున్నారు. ప్రణీత ఓ అడుగు ముందుకేశారు.