Business

హెల్మెట్ కొంటే బీమా ఉచితం-వాణిజ్యం

హెల్మెట్ కొంటే బీమా ఉచితం-వాణిజ్యం

* ఉత్తర భారతదేశంలో దీపావళి పండగను ఐదు రోజుల పాటు సంబరంగా జరుపుకొనే సంప్రదాయం ఉంది. ఈ పండగలోని మొదటి రోజునే ధన త్రయోదశిగా పిలుస్తారు. దీనినే ‘ధన్‌తేరాస్‌’ అని కూడా అంటారు. హిందువులు లక్ష్మీదేవిని ఐశ్వర్య దేవతగా పూజిస్తారు. క్షీరసాగర మధనంలో ధనత్రయోదశి రోజున లక్ష్మీదేవి పాలసముద్రం నుంచి ఉద్భవించిందని హిందూ పురాణాలు చెబుతున్నాయి. అందుకనే ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తారు. అలాగే ఈరోజున బంగారం కొంటే శుభప్రదం అని.. సంవత్సరం మొత్తం ఆ ఇల్లు ఐశ్వర్యంతో కళకళలాడుతుందని విశ్వసిస్తుంటారు. అందుకే ఏటా ఈ పర్వదినాన బంగారు, వెండి అమ్మకాలు రికార్డు స్థాయిలో జరుగుతుంటాయి. అయితే, గత ఏడాది కరోనా ప్రభావంతో బంగారు దుకాణాలన్నీ వెలవెలబోయాయి. ఈ నేపథ్యంలో ఈసారి వినియోగదారులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా వివిధ బంగారు విక్రయ సంస్థలు ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించాయి.

* వరుస నష్టాల నుంచి సోమవారం కోలుకున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నేడు మళ్లీ నేలచూపులు చూశాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన సూచీలు కాసేపటికే కిందకు దిగజారుతూ వెళ్లాయి. అలా చివరి గంట వరకు ఒడుదొడుకుల్లో కొనసాగి.. చివరకు నష్టాలతో ట్రేడింగ్‌ ముగించాయి. సెన్సెక్స్‌ 30 సూచీలోని కీలక కంపెనీలన్నీ నష్టాలు మూటగట్టుకున్నాయి. అలాగే లోహ ఇంధనం వంటి కీలక రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఆసియా మార్కెట్లు నేడు మిశ్రమంగా ముగిశాయి. ఐరోపా మార్కెట్లు సైతం మిశ్రమంగా కదలాడుతున్నాయి. అమెరికా ఫ్యూచర్‌ మార్కెట్లు పూర్తిగా నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

* ఎఫ్‌సీ, పిజ్జా హట్‌ వంటి ప్రముఖ ఆహార సంస్థల్ని నిర్వహిస్తున్న సఫైర్‌ ఫుడ్స్‌ ఇండియా ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌ నవంబరు 9న ప్రారంభమై 11న ముగియనుంది. యాంకర్‌ ఇన్వెస్టర్లకు బిడ్డింగ్‌ నవంబరు 8న ప్రారంభం కానుంది. ఈ పబ్లిక్‌ ఇష్యూలో ఉన్న వాటాలన్నీ ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద వస్తున్నవే కావడం గమనార్హం. ప్రమోటర్లు, వాటాదారులకు చెందిన మొత్తం 1,75,69,941 షేర్లను విక్రయించనున్నారు. దీంట్లో 75 శాతం షేర్లను క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ బయ్యర్స్‌(క్యూఐబీ), 15 శాతం నాన్‌ ఇన్‌స్టిట్యూషినల్‌ బయ్యర్స్‌, మిగలిన 10 శాతం వాటాలను రిటైల్‌ మదుపర్లకు అందుబాటులో ఉంచారు.

* ద్విచ‌క్ర వాహ‌న‌దారుల‌కు ర‌హ‌దారి భ‌ద్ర‌త‌పై అవ‌గాహ‌న పెంచేందుకు ఐసీఐసీఐ లాంబార్డ్ జ‌న‌ర‌ల్ ఇన్సూరెన్స్, వేగా హెల్మెట్ కంపెనీతో చేతులు కలిపింది. వేగా హెల్మెట్ ప్ర‌తి ఆన్‌లైన్ కొనుగోలుపై రూ.ల‌క్ష వ్య‌క్తిగ‌త ప్ర‌మాద బీమా పాల‌సీని ఐసీఐసీఐ లాంబార్డ్ ద్వారా వినియోగ‌దారులు పొందనున్నారు. హెల్మెట్ కొన్న‌వారికి బీమా సౌక‌ర్యం క‌ల్పించ‌డం దేశంలో ఇదే మొద‌టిసారి. ఈ బీమా ర‌క్ష‌ణ ప్ర‌పంచ‌వ్యాప్తంగా వ‌ర్తిస్తుంది. ఇటీవల బీమాకు ప్రాముఖ్య‌ం పెరిగిన విషయం తెలిసిందే. ప్ర‌మాద బీమా పాలసీ ఉంటే.. అవాంఛ‌నీయ సంఘ‌ట‌నలు జ‌రిగిన‌పుడు పాలసీదారుడి కుటుంబ‌ స‌భ్యుల‌కు ఆర్ధిక భ‌ద్ర‌త‌ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఐసీఐసీఐ కూడా ‘రైడ్ టు సేఫ్టీ’ కింద రహదారి భద్రతకు సంబంధించిన అనేక కార్యక్రమాలను చేపట్టింది. ఇందులో భాగంగా హెల్మెట్‌ కొనుగోలుకు ఇన్సూరెన్స్‌ సదుపాయం కల్పించేందుకు ముందుకొచ్చింది.

* ప్రముఖ సప్లయ్‌ చైన్‌ సంస్థ ‘డెలివరీ’ ఐపీఓకి దరఖాస్తు చేసుకుంది. ఈ మేరకు ముసాయిదా పత్రాలను మంగళవారం సెబీకి సమర్పించింది. మొత్తం రూ.7,460 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీంట్లో రూ.5,000 కోట్ల విలువ చేసే తాజా షేర్లు కాగా.. రూ.2,640 కోట్ల విలువ చేసే షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌) కింద ప్రస్తుత వాటాదార్లు విక్రయించనున్నారు.