Movies

స్టూవర్టుపురం దొంగ “టైగర్ నాగేశ్వరరావు” బయోపిక్‌లో రవితేజ

అగ్ర కథానాయకుడు రవితేజ సినిమాల జోరును పెంచారు. ఇప్పటికే నాలుగు సినిమాలతో బిజీగా ఉన్న ఆయన బుధవారం మరో చిత్రాన్ని ప్రకటించారు. వంశీ దర్శకత్వంలో రవితేజ నటించనున్న కొత్త చిత్రం ‘టైగర్‌ నాగేశ్వరరావు’. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ‘అక్కడ దొంగలు, దోపిడీదారులు ఉండేవారు. అదే విధంగా టైగర్‌ నాగేశ్వరరావు కూడా’ అని చిత్ర బృందం ట్వీట్ చేసింది. స్టువర్టుపురం దొంగల ముఠాలో నాగేశ్వరరావు ఒకడు. అతని తెగింపునకు గుర్తుగా ‘టైగర్‌’ పేరుతో పిలిచేవారు. 1970 దశకంలో అధికారులకు నాగేశ్వరరావు ముచ్చెమటలు పట్టించాడు. చిక్కినట్టే చిక్కి తప్పించుకునేవాడు. ఒకానొక సమయంలో మద్రాస్‌ జైలు నుంచి కూడా తెలివిగా తప్పించుకున్నాడు. 1987లో పోలీసులు అతడిని మట్టుబెట్టారు. టైగర్‌ నాగేశ్వరరావు జీవితం గురించి గతంలో ఓసారి దర్శకుడు వంశీ మాట్లాడుతూ.. ‘నాగేశ్వరరావు కేవలం దొంగగా మాత్రమే చాలా మందికి తెలుసు. ఆయన జీవితంలో అంతకుమించిన కోణాలు ఎన్నో ఉన్నాయి. అతడిది రాబిన్‌హుడ్‌ తరహా జీవితం. దోచుకొచ్చిన సొత్తును పేదలకు దానం చేసేవాడు. స్టువర్టుపురంలో పుట్టిన కారణంగా నాగేశ్వరరావు చదువుకు దూరమయ్యాడు. అందుకే ఎంతో మంది విద్యార్థుల చదువుకు ధన సాయం చేశాడు. ఇలా ఎన్నో కోణాలు నాగేశ్వరరావులో ఉన్నాయి’ అని వంశీ పంచుకున్నారు. ‘దొంగాట’ చిత్రానికి ముందే తాను ఈ బయోపిక్‌ గురించి పరిశోధన చేసినట్లు తెలిపారు. అభిషేక్‌ అగర్వాల్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాశ్‌కుమార్‌ స్వరాలు సమకూర్చనున్నారు. కథానాయిక ఇతర నటీనటుల వివరాలను చిత్ర బృందం త్వరలోనే వెల్లడించనుంది.