Editorials

న్యాయమూర్తుల నియామకాల్లో రికార్డు దిశగా….

న్యాయమూర్తుల నియామకాల్లో రికార్డు దిశగా….

దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టుల్లో ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల నియామకాలను వేగంగా భర్తీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇలా ఈ ఏడాదిలోనే ఇప్పటివరకు 110 మంది జడ్జీల నియామకం పూర్తయింది. 2016లో అత్యధికంగా 126 మంది న్యాయమూర్తుల నియామకంతో అరుదైన రికార్డు ఉంది. ఈ ఏడాది కూడా న్యాయమూర్తుల భర్తీ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్న దృష్ట్యా మరో రెండు నెలల్లో మునుపటి రికార్డును దాటవేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశంలో ఉన్న మొత్తం 25 హైకోర్టుల్లో 1098 న్యాయమూర్తులను నియమించేందుకు అవకాశం ఉంది. కానీ, నవంబర్‌ 1వ తేదీ నాటికి కేవలం 692 మంది జడ్డీలు మాత్రమే విధుల్లో ఉన్నారు. మరో 406 న్యాయమూర్తుల స్థానాలు ఖాళీగానే ఉన్నాయి. గతకొంతకాలంగా వీటి నియామకాల వేగం పుంజుకొంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 110మంది హైకోర్టు న్యాయమూర్తులను నియమించారు. వివిధ హైకోర్టులు సిఫార్సు చేసిన జాబితాలను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని కొలీజియం ఆగస్టు 8 నుంచి సెప్టెంబర్‌ 1 మధ్యకాలంలోనే 100 పేర్లను పరిశీలించింది. అనంతరం 12 హైకోర్టుల్లో నియమించేందుకు 68పేర్లతో కూడిన జాబితాను కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. ఇలా కేవలం హైకోర్టుల్లోనే కాకుండా సుప్రీంకోర్టులోనూ ఖాళీగా ఉన్న స్థానాలు కూడా వేగంగానే భర్తీ అవుతున్నాయి. ఈ మధ్యే కొత్తగా తొమ్మిది మంది న్యాయమూర్తుల నియామకం పూర్తైన విషయం తెలిసిందే. ఆగస్టు 26నాడు ఒక్క రోజులోనే తొమ్మిదిమంది నియమించడం కూడా రికార్డేనని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. సుప్రీంకోర్టులో గరిష్ఠ న్యాయమూర్తుల సంఖ్య 34 కాగా.. ప్రస్తుతం సుప్రీం కోర్టులో ఒక స్థానం ఖాళీగా ఉంది.