DailyDose

పంజాగుట్ట మృతదేహం కేసులో పురోగతి-నేరవార్తలు

పంజాగుట్ట మృతదేహం కేసులో పురోగతి-నేరవార్తలు

* అడిగిన వెంటనే తువ్వాలు ఇవ్వలేదన్న కోపంతో భార్యను దారుణంగా హత్య చేశాడో భర్త. మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌ జిల్లా హీరాపుర్‌ గ్రామంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడు అటవీ శాఖలో తాత్కాలిక ఉద్యోగిగా పనిచేస్తున్న రాజ్‌కుమార్‌ బాహేగా పోలీసులు గుర్తించారు. శనివారం సాయంత్రం స్నానం ముగించుకున్న రాజ్‌కుమార్‌.. భార్య పుష్పా బాయ్‌ (45)ను తువ్వాలు అడిగాడు. ప్రస్తుతం తాను పనిలో ఉన్నానని, కాసేపు ఆగాలని ఆమె చెప్పింది. కొన్ని నిమిషాల తర్వాత తువ్వాలు అందించింది. అప్పటికే కోపంతో ఊగిపోతున్న రాజ్‌కుమార్‌.. అక్కడే ఉన్న పారతో భార్య తలపై దాడి చేశాడు. అడ్డు వచ్చిన కుమార్తెను బెదిరించాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన పుష్ప అక్కడికక్కడే మృతిచెందింది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

* ఫలక్‌నుమాలో డ్యాన్సర్ అనుమానాస్పద మృతి. యువతి మృతదేహం నగ్నంగా పడేసిన దుండగులు. అత్యాచారమా లేక గ్యాంగ్ రేప్ జరిగిందా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు

* ఒడిశాలో పూరీ జిల్లాలోని నాథపుర్ గ్రామంలో భూవివాదం హింసాత్మకంగా మారింది. గ్రామంపై కొందరు దుండగులు 20కిపైగా బాంబులు విసిరారు. ఈ ఘటనలో 30 ఇళ్లు దగ్ధమయ్యాయి. నాథపుర్ గ్రామంలో.. 35 మౌజా ప్రాంతంలోని ఓ భూ వివాదం నేపథ్యంలో దుండగులు ఈ బాంబు దాడులకు పాల్పడ్డారని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 30 ఇళ్లు దగ్ధమవ్వగా.. పలు వాహనాలు దెబ్బతిన్నాయని, పలువురికి గాయాలయ్యాయని వివరించారు. దాడి సమాచారం తెలిసిన వెంటనే పూరీ అదనపు ఎస్పీ నేతృత్వంలో గ్రామానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గ్రామంలో శాంతి భద్రతలను పరిరక్షించేందుకు పోలీసులను భారీగా మోహరించారు.

* చోరీకి యత్నించాడనే ఆరోపణతో యువకుడిని నడిరోడ్డుపై ఓ పోలీసు వాలంటీర్‌ చితకబాదిన ఘటన పశ్చిమబెంగాల్‌లో వెలుగుచూసింది. కోల్‌కతాలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. బస్సులో తన బ్యాగును ఆ యువకుడు దొంగిలించడానికి యత్నించాడని.. ఓ మహిళ ఆరోపించింది. దీంతో స్థానికులు అతడిని పట్టుకుని చితకబాదారు. అయితే.. సమీపంలో విధులు నిర్వహిస్తున్న పోలీసు వాలంటీర్ తన్మయ్ బిశ్వాస్.. ఆ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నాడు. అతడిని మరింత దారుణంగా కొట్టాడు. కాలుతో ఛాతీపై తన్నాడు. ఈ ఘటనపై పోలీసు శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే తన్మయ్ బిశ్వాస్‌ను విధుల నుంచి తప్పించింది.

* పంజాగుట్ట పీఎస్ పరిధిలోని ద్వారకాపురిలో లభించిన చిన్నారి మృతదేహం కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. బాలికది హత్యగా తేల్చిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా విచారణ జరుపుతున్నారు. ఓ మహిళ.. వ్యక్తి, బాబుతో కలిసి లకిడీకాపూల్ వైపు నుంచి ఆటోలో వచ్చి ద్వారకాపురిలోని ఓ దుకాణం ముందు ఈ నెల 4వ తేదీన చిన్నారి మృతదేహాన్ని వదిలి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. కర్ణాటక నుంచి వచ్చిన బస్సులో లకిడీకాపూల్‌లో దిగిన నలుగురు అక్కడ ఆటో మాట్లాడుకున్నారు. ఓ కుటుంబంలా ఆటోలో వచ్చి ద్వారకాపురి కాలనీలో మృతదేహాన్ని పడేసి మెహదీపట్నం వైపు వెళ్లినట్లు సీసీ కెమెరాల్లో నమోదైంది. దీంతో పోలీసులు మెహదీపట్నంతో పాటు లకిడీకాపూల్‌లో ఉన్న ట్రావెల్స్‌ కార్యాలయాల్లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. బాలిక కడుపుతో పాటు.. వీపుపై గాయాలున్నట్లు ఉస్మానియా ఆస్పత్రి వైద్యుల పోస్టుమార్టం రిపోర్టులో తేలిన విషయం తెలిసిందే. బాలికను పడేసి వెళ్లిన మహిళ, ఆమె వెంట వచ్చిన వ్యక్తి, బాబు ఎవరనేదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మహిళ ఆచూకీ కోసం 10 పోలీస్ బృందాలతో గాలిస్తున్నారు. ఆమె కర్ణాటక వైపు వెళ్లే అవకాశం ఉండటంతో సరిహద్దు పోలీసులను అప్రమత్తం చేశారు.

* రూ.కోటి బీమా పరిహారం పొందేందుకు మరణ నాటకానికి తెరతీశాడు ఓ ప్రబుద్ధుడు. చివరకు అసలు విషయాన్ని కనిపెట్టిన పోలీసులు నలుగురిని అరెస్ట్‌ చేశారు. మధ్యప్రదేశ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలోని దేవాస్‌కు చెందిన హనీఫ్‌(46).. 2019, సెప్టెంబరులో ఓ కంపెనీ నుంచి రూ.కోటి విలువైన బీమా పాలసీ తీసుకున్నాడు. 2 వాయిదాలు కట్టిన తర్వాత అతనికి దుర్బుద్ధి పుట్టింది. తాను మరణించినట్లు పత్రాలు సృష్టించి రూ.కోటి కొట్టేయాలని భావించాడు. వెంటనే షకీర్‌ మన్సూరి అనే వైద్యుడి సాయంతో.. మరణ ధ్రువీకరణపత్రం సృష్టించాడు. ఆ పత్రం సహాయంతో హనీఫ్‌ భార్య భార్య రెహానా, కుమారుడు ఇక్బాల్‌ రూ.కోటి బీమా పరిహారం పొందేందుకు దరఖాస్తు సమర్పించారు. మరోవైపు, ఈ వ్యవహారంపై అనుమానం వ్యక్తం చేసిన సదరు కంపెనీ.. దేవాస్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టారు. విచారణలో హనీఫ్‌ సజీవంగానే ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు నవంబర్‌ ఏడో తేదీన ఫోర్జరీ కేసులో భాగంగా.. హనీఫ్, అతని భార్య రెహానా, కుమారుడు ఇక్బాల్‌తోపాటు నకిలీ మరణ ధ్రువపత్రాన్ని సృష్టించిన వైద్యుడు షకీర్‌ మన్సూరిని అరెస్ట్‌ చేశారు. షకీర్‌ వైద్య డిగ్రీపైనా విచారణ చేస్తున్నట్లు దేవాస్‌ స్టేషన్‌ బాధ్యుడు ఉమ్రావ్‌ సింగ్‌ తెలిపారు.