Movies

జగన్ సర్కార్ ప్లాన్‌కు సినీ ఎగ్జిబిటర్లు ఓకే

జగన్ సర్కార్ ప్లాన్‌కు సినీ ఎగ్జిబిటర్లు ఓకే

ఆంధ్రప్రదేశ్‌లో ఆన్‌లైన్ టిక్కెట్ విధానాన్ని స్వాగ‌తించారు ఏపీ సినీ ఎగ్జిబిట‌ర్లు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చే కొత్త విధానానికి పూర్తి స్థాయిలో స‌హ‌క‌రిస్తామ‌న్నారు. ఆన్ లైన్ విధానం, థియేట‌ర్ల స‌మ‌స్యల‌పై ఎగ్జిబిట‌ర్లతో మంత్రి పేర్ని నాని స‌మావేశం అయ్యారు. థియేట‌ర్లకు గ్రేడింగ్ సిస్టం, టిక్కెట్ల రేట్ల పెంపుపై సీఎంతో చ‌ర్చించిన త‌ర్వాత నిర్ణయం తీసుకుంటామ‌ని మంత్రి హామీ ఇచ్చార‌ని ఎగ్జిబిట‌ర్లు చెప్పారు. ఏపీ ప్రభుత్వం ఆన్‌లైన్ సినిమా టికెట్ల పై వేగంగా ముందుకెళ్తోంది. కొత్త విధానం అమలు, థియేటర్ల సహకారంపై ఎగ్జిబిటర్లతో ప్రభుత్వం సమావేశాలు ఏర్పాటు చేస్తోంది. మొదటగా పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల ఎగ్జిబిటర్లతో సమావేశం నిర్వహించారు మంత్రి పేర్ని నాని. మూడు జిల్లాల్లో సుమారు 300 థియేటర్లు ఉన్నాయి. ఆన్‌లైన్ టిక్కెట్ విధానంపై ప్రభుత్వ నిర్ణయానికి ఎగ్జిబిటర్లు అంగీకారం తెలిపారు. అయితే, గతంలో కొన్ని ప్రైవేట్ యాప్‌లతో మరో ఐదేళ్లు అగ్రిమెంట్ చేసుకున్న అంశాన్ని ఎగ్జిబిటర్లు ప్రస్తావించారు. న్యాయపరమైన సమస్యలు రాకుండా ఆయా సంస్థలతో కూడా మాట్లాడతామని మంత్రి హామీ ఇచ్చారు. ఇక, చిన్న ఊర్లలోని థియేటర్లలో గ్రేడింగ్‌ సిస్టమ్‌ పెట్టాలని థియేటర్‌ యజమానులకు మంత్రి పేర్ని నాని సూచించారు. థియేటర్లు నుంచి ఎఫ్డీసీ వసూలు చేస్తున్న న్యూస్ రీల్స్ మీద రెంటల్ చార్జీ కూడా రద్దు చేయడానికి మంత్రి హామీ ఇచ్చినట్లు ఎగ్జిబిటర్లు తెలిపారు. ఇదిలావుంటే, మిగిలిన జిల్లాల ఎగ్జిబిటర్లతో కూడ సమావేశాలు పూర్తి అయిన తర్వాత ఆన్‌లైన్ టిక్కెట్ విధానంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు టికెట్ రేట్ల విషయంలో సీఎంతో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు.