Politics

గుప్పిట తెరుచుకోని తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా-తాజావార్తలు

గుప్పిట తెరుచుకోని తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా-తాజావార్తలు

* ఎమ్మెల్యేల కోటాలో పోటీ చేయనున్న తెలంగాణ రాష్ట్రసమితి ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. విశ్వసనీయ సమాచారం మేరకు జాబితా తుదిరూపుకొచ్చినా సోమవారం అర్థరాత్రి వరకు అధికారికంగా విడుదల కాలేదు. ఉదయం నుంచి గుత్తా సుఖేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి, తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, కౌశిక్‌రెడ్డి, కోటిరెడ్డి, ఆకుల లలిత, ఎర్రోళ్ల శ్రీనివాస్‌, మధుసూదనాచారి, మరికొందరు ఆశావహులతో సుదీర్ఘ మంతనాలు జరిగినా.. ఒకటి, రెండు స్థానాలపై చివరి నిమిషంలో మార్పులు, చేర్పులు చోటుచేసుకున్నట్లు తెలిసింది. సిద్దిపేట మాజీ కలెక్టర్‌ వెంకట్రామరెడ్డి పేరు సైతం పరిశీలనకు వచ్చింది. గవర్నర్‌ కోటాలో ఆయన ఎంపిక విషయమై చర్చించినట్లు తెలిసింది. వడబోత అనంతరం జాబితాను ఖరారు చేసిన ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు కేసీఆర్‌..అభ్యర్థులకు సమాచారం ఇచ్చి వారిని మంగళవారం నామినేషన్లు దాఖలు చేయాలని ఆదేశించారు. ఎమ్మెల్యేల కోటాలో ఆరు, గవర్నర్‌ నామినేటెడ్‌ కోటాలో ఒక స్థానానికి అభ్యర్థుల ఎంపికపై సోమవారం ఉదయం నుంచే సీఎం ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు, మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డిలతో పాటు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ తదితరులు ఇందులో పాల్గొన్నట్లు తెలిసింది. అర్ధరాత్రి వరకు మంతనాల అనంతరం ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వచ్చింది. ఖరారయిన అభ్యర్థులకు నామినేషన్‌ పత్రాలు సిద్ధం చేసుకోవాలని సమాచారం అందింది. పోటీ తీవ్రంగా ఉన్నందున ఆరు స్థానాలకు అభ్యర్థుల ఖరారుపై గులాబీ పార్టీ అధిష్ఠానం ఆచితూచి కసరత్తు చేసింది. గుత్తా సుఖేందర్‌రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్‌రావు, కడియం శ్రీహరి, కౌశిక్‌ రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్‌ మధుసూదనచారి, ఆకుల లలిత తదితరుల పేర్లను పరిశీలించింది.

* లంకాధీశుడు రావణుడి వద్ద నిజంగానే విమానాలు ఉన్నాయా? ఇతిహాసగాథ కూడా ఈ విషయాన్ని సుస్పష్టంగా చెప్పింది. అయితే, నిజమా? కాదా? అని తెలుసుకోవడానికి శ్రీలంక ప్రభుత్వం గతంలోనే ఓ పరిశోధక బృందాన్ని ఏర్పాటు చేసింది. అయితే, కరోనా కారణంగా ఆగిపోయిన పరిశోధనలు తిరిగి ప్రారంభంకానున్నాయి. విశేషమేమిటంటే.. ఈ కీలకమైన పరిశోధనలో భారత ప్రభుత్వం కూడా పాల్గొనాలని శ్రీలంక పరిశోధన బృందం కోరుతోంది.

* రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడటంలో కేసీఆర్ సర్కారు విఫలమైందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు విమర్శించారు. నల్గొండ జిల్లా పర్యటనలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వాహన శ్రేణిపై తెరాస కార్యకర్తలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఈ దాడులు పూర్తిగా సీఎం కేసీఆర్ కనుసన్నల్లోనే జరుగుతున్నాయని మండిపడ్డారు. రైతుల దగ్గరికి భాజపా నాయకులు వెళ్తే కేసీఆర్ వెన్నులో వణుకు పుడుతోందని వెల్లడించారు. తెరాస వైఫల్యాల పై రైతులు, ప్రజలు, భాజపా కార్యకర్తలు తిరగబడే రోజు దగ్గర్లనే ఉందని వ్యాఖ్యానించారు. రైతులను మోసం చేసిన కేసీఆర్ సర్కారు తగిన మూల్యం చెల్లిస్తుందన్నారు.

* రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ వర్చువల్‌ సమీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌, వివిధ శాఖల ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు. రాష్ట్రానికి సంబంధించిన పెట్టుబడులు, మౌలిక వసతులపై సమీక్షలో చర్చించారు. ఓర్వకల్లు విమానాశ్రయానికి రాష్ట్రం ఖర్చు పెట్టిన నిధులివ్వాలని బుగ్గన కోరారు. ‘ఉడాన్‌’ కింద రూ.176 కోట్లు రియంబర్స్‌ చేయాలని విజ్ఞప్తి చేశారు. విజయనగరంలో జిల్లాలోని భోగాపురం విమానాశ్రయం ప్రారంభమయ్యాక విశాఖ విమానాశ్రయం మూసేయాలన్నారు. విశాఖలో 30 ఏళ్ల పాటు పౌరవిమానాలు మూసేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని బుగ్గన కోరారు. వివిధ ప్రాజెక్టులకు వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ కార్పస్‌ ఏర్పాటు చేయాలని కోరారు. దేశంలో రూ.20వేల కోట్లతో వీజీఎఫ్‌ ఏర్పాటు చేస్తే ఉపయోగకరమని ఏపీ అభిప్రాయం వ్యక్తం చేసింది. కడప స్టీల్‌ ప్లాంట్‌కు 20 ఏళ్ల సుంకాలు, సీజీఎస్‌టీ, ఆదాయపన్ను, దిగుమతి సుంకాలు రియంబర్స్‌ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈశాన్య రాష్ట్రాల మాదిరిగానే ఏపీ పరిశ్రమలకు పన్ను ప్రోత్సాహకాలు ఇవ్వాలన్నారు. కేంద్రానికి ఇచ్చిన భూముల్లో ప్లాంట్లు రాకుంటే వాటిని తిరిగి రాష్ట్రానికి ఇవ్వాలని బుగ్గన కోరారు.

* భారత్‌కు నిజమైన స్వాతంత్య్రం 2014లో వచ్చిందని, 1947లో వచ్చింది భిక్ష మాత్రమేనంటూ బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోన్న విషయం తెలిసిందే. స్వాతంత్ర్య సమరయోధులను అవమానించిన కంగనాను అరెస్టు చేయాలని, ఇటీవల ప్రదానం చేసిన ‘పద్మశ్రీ’ అవార్డునూ వెనక్కు తీసుకోవాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. తాజాగా బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ ఈ వ్యవహారంపై స్పందించేందుకు నిరాకరిస్తూనే.. కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి ప్రకటనలను ఎగతాళి చేయడంతోపాటు విస్మరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

* రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు విషయంపై తెరాస, భాజపా మధ్య రాజకీయ వేడి కొనసాగుతోంది. ఇప్పటికే అగ్రనేతల మధ్య మాటల యుద్ధానికి దారితీసిన ఈ అంశం.. ఇప్పుడు క్షేత్రస్థాయిలోనూ కాక రేపుతోంది. నల్గొండ జిల్లాలో ఆర్జాలబావి ఐకేపీ కేంద్రాన్ని పరిశీలించేందుకు వెళ్లిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పర్యటనలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. నల్ల జెండాలు ప్రదర్శిస్తూ తెరాస కార్యకర్తలు ఐకేపీ కేంద్రం వద్ద నిరసన చేపట్టారు. బండి సంజయ్‌ అక్కడికి రాగానే ఆయనకు వ్యతిరేకంగా తెరాస శ్రేణులు ఆందోళనకు దిగారు. బండి సంజయ్‌ గోబ్యాక్‌ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో తెరాస శ్రేణులపైకి దూసుకెళ్లేందుకు భాజపా కార్యకర్తలు యత్నించారు. తెరాస శ్రేణులను పోలీసులు అక్కడి నుంచి చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అనంతరం ఉద్రిక్తతల మధ్యే ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బండి సంజయ్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడారు.

* న్యూజిలాండ్‌ జట్టుతో ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్న రోహిత్ శర్మతో తనకున్న బంధం ప్రత్యేకమైనదని టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ అన్నాడు. అందుకే మైదానంలో తన వ్యూహాలను స్వేచ్ఛగా పంచుకోగలుగుతానని పేర్కొన్నాడు. ‘రోహిత్ భాయ్‌తో నా బంధం ప్రత్యేకమైనది. రితిక (రోహిత్ భార్య) నన్ను తమ్ముడిలా చూసుకుంటుంది. మేమంతా ఓ కుటుంబంలా కలిసి మెలిసి ఉంటాం. అందరం కలిసి అప్పుడప్పుడూ డిన్నర్‌కి వెళ్తుంటాం. మా ఇద్దరి మధ్య బంధం క్రికెట్‌కు మించినది. అందుకే మైదానంలో ఆడుతున్నప్పుడు కూడా నా వ్యూహాలను రోహిత్‌తో స్వేచ్ఛగా పంచుకోగలుతాను’ అని చాహల్ పేర్కొన్నాడు.

* తెరాస అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ఆ పార్టీ శాసనసభాపక్షం రేపు సమావేశం కానుంది. ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వం, భాజపా వైఖరిపై సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక తీరు, రాష్ట్ర భాజపా మరోతీరు వ్యవహరిస్తూ రైతులను అయోమయానికి గురి చేస్తోందని తెరాస ఆరోపిస్తోంది. ఈనెల 12న నియోజకవర్గాల వారీగా ధర్నాలు కూడా నిర్వహించింది. కేంద్రం స్పష్టతనిచ్చే వరకూ ఆందోళనలు కొనసాగిస్తామని తెరాస ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. రేపు జరగనున్న సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణను ఖరారు చేయనుంది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో దిల్లీలో రైతుదీక్ష లేదా ధర్నా చేపట్టాలని తెరాస భావిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం వైఖరి, రాష్ట్రానికి జరగుతున్న అన్యాయం, భాజపా అనుసరిస్తున్న విధానాలు, విపక్షాల ప్రచారాన్ని ఎలా తిప్పికొట్టాలనే విషయాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. దిల్లీ స్థాయి ఆందోళనతో పాటు.. రాష్ట్రంలో ఏ రూపంలో ఆందోళన కొనసాగించాలో రేపు వ్యూహాలను ఖరారు చేయనున్నట్లు సమాచారం.

* భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన అనుచరులతో కలిసి నల్గొండ జిల్లా రైతులపై దాడులకు దిగి అరాచకం సృష్టించారని రాష్ట్ర రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. బండి సంజయ్ పర్యటన ఆంతర్యమేంటో చెప్పాలని రాజేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో పల్లా మీడియాతో మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లపై భాజపా వైఖరేంటో స్పష్టం చేసిన తర్వాతే బండి సంజయ్ తిరగాలన్నారు. రైతుల కల్లాల సందర్శన పేరుతో రైతుల రక్తం కళ్ల చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులకు పాల్పడిన భాజపా నాయకులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ తన అనుచరులతో కలిసి రైతులపై దాడి చేసి.. వారిపైనా దాడి జరిగినట్లు ప్రచారం చేసుకుంటున్నారని ఆక్షేపించారు. కేసీఆర్‌ను కదిలించే ప్రయత్నం చేస్తే ప్రళయం వస్తుందని హెచ్చరించారు. రైతుల విషయంలో బండి సంజయ్ తీరు మార్చుకోకపోతే రైతులు తగిన బుద్ధి చెబుతారన్నారు.

* రాష్ట్రంలో గొర్రెల పంపిణీపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం తగని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని పశు సంక్షేమ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. గొల్ల, కురుమల కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం కావాలనే లక్ష్యంతో 2017లో గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించామన్నారు. అప్పుడు రూ.వెయ్యి కోట్లు ఇస్తామని హామీ ఇచ్చిన కేంద్రం ఇప్పటివరకు నెరవేర్చలేదన్నారు. ఈ పథకం కింద మొదటి విడతలో ప్రభుత్వ పూచీకత్తుపై ఎన్‌సీడీసీ ద్వారా రూ.3,549.98 కోట్లు రుణం తీసుకున్నామని తెలిపారు. ఆ అప్పుకు సంబంధించి ఇప్పటిదాకా అసలు, వడ్డీ కలిపి 9 వాయిదాల్లో రూ.2,900.74 కోట్లు ఎన్‌సీడీసీకి చెల్లించామని స్పష్టం చేశారు.

* చిత్తూరు జిల్లాలోని కుప్పం ఓటర్లను తెదేపా నేతలు ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన సజ్జల.. తెదేపా ప్రలోభాలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించారు. కుప్పం ఎన్నికను సాధారణ ఎన్నికల్లా భావించి.. తెదేపా అధినేత చంద్రబాబు అనవసర హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతి బూత్‌లో తెదేపా అభ్యర్థి, ఏజెంట్‌ ఉంటారని.. వారు ఉన్నప్పటికీ గొడవలు చేసి ప్రభుత్వంపై బురద జల్లేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. కుప్పంలో తెదేపా ఏజెంట్లుగా నలుగురు రౌడీ షీటర్లు ఉన్నారన్నారు.

* హరియాణాలోని కర్నాల్‌ పట్టణంలో ఓ యువకుడు తనకు పెళ్లి చేయాలంటూ.. మద్యం మత్తులో సెల్‌ఫోన్ టవర్ ఎక్కి హల్‌చల్ చేశాడు. వివాహం చేస్తానని మాట ఇవ్వకపోతే ఇక్కడి నుంచి దూకేస్తానని కుటుంబసభ్యులను బెదిరించాడు. స్థానికులు కిందకు దింపే ప్రయత్నం చేసినా యువకుడు ఒప్పుకోలేదు. సమాచారం అందుకున్న పోలీసులు.. అతడి స్నేహితుల సాయంతో అతికష్టం మీద కిందకి దించారు. ఈ డ్రామా సుమారు రెండు గంటల పాటు నడిచింది.