DailyDose

ఎల్బీనగర్ శివారులో “ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ” తరహా శవాలు-నేరవార్తలు

* హైదరాబాద్ నగర శివారుల్లో గుర్తు తెలియని మృతదేహాల లభ్యం కలకలం రేపుతోంది. ఎల్బీనగర్ పరిధిలో ఐదు రోజుల్లోనే మూడు శవాలు లభించడం.. పోలీసులకు సవాలుగా మారింది. నగర శివారుల్లో ఏం జరుగుతుందో.. అంతుచిక్కని పరిస్థితి నెలకొంది. ఈ నెల 12న రెండు మృతదేహాలను పోలీసులు గుర్తించారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపుర్‌మెట్‌ వద్ద ఔటర్‌ రింగ్‌ రోడ్డు.. సర్వీసు రోడ్డు నుంచి కొహెడ వెళ్లే మార్గం సమీపంలోని కాలువలో ఓ వివాహిత మృతదేహం దొరికింది. మృతురాలు వయసు 30 ఏళ్లు ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆమె మృతికి గల కారణాలను లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలానికి డాగ్ స్క్వాడ్‌తో పాటు క్లూస్‌ టీమ్‌ను తీసుకొచ్చి ఆధారాలను సేకరించారు. హత్య చేసి కాలువలో పడేశారా..? ఆత్మహత్యా..? అనే కోణంలో విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వస్తేనే వాస్తవాలు బయటకు వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. ఎల్బీనగర్‌లోని బైరామల్‌గూడ వద్ద నాలాలో అదే రోజు గుర్తుతెలియని యువకుడి మృతదేహం లభించింది. అతడి ముఖం చిద్రమై.. గుర్తుపట్టడానికి వీలులేని స్థితిలో ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యువకుడిది హత్యా.. ఆత్మహత్యా..? అనేది తేల్చకపోయినా పోస్టుమార్టం నివేదిక కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు. గతంలో పాతబస్తీలో ఇదే నాలా పక్కన హత్యలు చేసి మృత దేహాలను మంటల్లో కాల్చేసిన ఘటనలు ఉండటంతో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. మరోవైపు.. మంగళవారం ఇబ్రహీంపట్నం శేరిగూడలోని ఓ వెంచర్‌లో.. వ్యక్తి మృతదేహం కుళ్లిన స్థితిలో ఉండటం పోలీసులు గుర్తించారు. పక్కనే కత్తి, ఖాళీ మద్యం సీసా పడి ఉన్నాయి. వారం రోజులుగా వెంచర్‌కు ఎవరెవరు వచ్చారనే వివరాలను సేకరిస్తున్న పోలీసులు.. కేసును ఛేదించే పనిలో నిమగ్నమయ్యారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఓఆర్ఆర్‌ సర్వీసు రోడ్డులో గస్తీ ముమ్మరం చేశారు.

* డబుల్‌ రిజిస్ట్రేషన్‌ వ్యవహారంలో అరెస్టయిన సంధ్యా కన్వెన్షన్‌ ఎండీ శ్రీధర్‌రావును చర్లపల్లి జైలుకు పోలీసులు తరలించారు. ఉప్పరపల్లి కోర్టు శ్రీధర్‌రావుకు 14 రోజుల పాటు రిమాండ్‌ విధించింది. రాయదుర్గంలో కమర్షియల్‌ కాంప్లెక్స్‌ నిర్మించిన శ్రీధర్‌రావు వాటిని విక్రయించే వ్యవహారంలో డబుల్‌ రిజిస్ట్రేషన్‌ చేసి కోట్ల రూపాయలు వసూలు చేయడంపై పలువురు బాధితులు పోలీసులను ఆశ్రయించారు. శ్రీధర్‌రావుపై రాయదుర్గం, నార్సింగి, గచ్చిబౌలి, బంజారాహిల్స్‌ పరిధిలో మొత్తం ఏడు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో సైబరాబాద్‌ పోలీసుల బెంగళూరులో శ్రీధర్‌రావును అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరు పర్చి, చర్లపల్లి జైలుకు తరలించారు.

* బావా బామ్మర్దులిద్దరు కలిసి వందలాది మంది రత్నాకర్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌(ఆర్‌బీఎల్‌) క్రెడిట్‌ కార్డుదారులను మోసగించి రూ.3 కోట్లు కొల్లగొట్టిన ఉదంతమిది. సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ ఎం.స్టీఫెన్‌ రవీంద్ర బుధవారం విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం… దిల్లీలోని ఉత్తమ్‌నగర్‌లో ఉంటున్న దీపక్‌చౌదరి ఏడాది నుంచి ఓ కాల్‌సెంటర్‌ నిర్వహిస్తూ.. రుణాలిప్పిస్తానంటూ మోసాలకు పాల్పడుతున్నాడు. ఈ విషయాన్ని దీపక్‌ బావ, ఆర్‌బీఎల్‌ బ్యాంకు అధికారి భాటియా గుర్తించాడు. తన బ్యాంక్‌లోని లక్షల మంది క్రెడిట్‌ కార్డుదారుల సమాచారం(డేటా) ఇస్తానని, ఇద్దరం కలిసి మోసాలు చేద్దామంటూ ప్రతిపాదించాడు. అంగీకరించిన దీపక్‌చౌదరి 6 నెలల క్రితం దిల్లీలోని వేర్వేరు ప్రాంతాల్లో.. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లలోని హోటళ్లలో కాల్‌సెంటర్లు ఏర్పాటు చేశాడు. భారీ ఎత్తున టెలీకాలర్లను నియమించాడు. వారు ఆర్‌బీఎల్‌ వినియోగదారుల సేవాకేంద్రాల అధికారుల పేర్లతో ఆర్‌బీఎల్‌ క్రెడిట్‌ కార్డుదారులకు ఫోన్లు చేయడం ప్రారంభించారు. రుణపరిమితి పెంచుతాం, బీమా సౌకర్యం కల్పిస్తాం, కార్డు అప్‌డేట్‌ చేసుకోండి అంటూ ప్రతిపాదించేవారు. స్ఫూఫింగ్‌ పరిజ్ఞానంతో ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ వినియోగదారుల సేవాకేంద్రం ఫోన్‌ నంబర్‌ బాధితుల ఫోన్లలో కనిపిస్తుండడంతో టెలీకాలర్లు చెప్పిన మాటలను వందలమంది నమ్మారు. కోడ్‌ నంబర్‌ వస్తుంది అని చెప్పగానే… ఓటీపీలు చెప్పేశారు. ఇలా బాధితుల నుంచి ఎంత వీలైతే అంత సొమ్మును స్వాహా చేసేశారు. ఈ మొత్తాన్ని తమ ఖాతాల్లో వేసుకుంటే పోలీసులకు దొరికిపోతామని అంచనా వేసి సొంత ఈ-కామర్స్‌ సైట్లను సృష్టించారు. బాధితులు ఆ వెబ్‌సైట్‌లో వస్తువులు, దుస్తులు, పరికరాలు, యంత్రాలు కొన్నట్టుగా చూపించారు. ఇందుకోసం నిందితులు విశాల్‌కుమార్‌, క్రిషన్‌, కరణ్, గౌరవ్‌, దుర్గేశ్‌ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ రూపొందించారు. బాధితుల నుంచి కొట్టేసిన నగదును తీసుకునేందుకు నకిలీ ఆధార్‌, పాన్‌, ఓటర్‌ కార్డులు సమీకరించుకున్నారు. వీటి ఆధారంగా సిమ్‌కార్డులు తీసుకుని దిల్లీలోని వేర్వేరు బ్యాంకుల్లో ఖాతాలను తెరిచారు. సొంత ఈ-కామర్స్‌ సైట్లలోని నగదును బ్యాంక్‌ ఖాతాల్లో జమచేసి ఎప్పటికప్పుడు డబ్బును విత్‌డ్రా చేసుకుంటున్నారు.

* బరువు తగ్గడానికి చాలా కారణాలు ఉంటాయి. ఆరోగ్యం కోసం కొందరు.. అందం కోసం కొందరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ, ఓ వ్యక్తి కేవలం తన పాత యజమాని ఇంట్లో దొంగతనం చేయడం కోసమే 5 కిలోల బరువు తగ్గాడు. పక్కా ప్రణాళికతో రూ.లక్షలు చోరీచేసి పరారైనా.. చివరికి పోలీసులకు చిక్కాడు. వివరాల్లోకి వెళితే..రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌కి చెందిన మోతీ సింగ్‌ చౌహన్‌.. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో మోహిత్‌ మరాడియా అనే వ్యక్తి ఇంట్లో సహాయకుడిగా పని చేసి.. మూడేళ్ల కిందట మానేశాడు. అయితే, మోహిత్‌ ఇంట్లో భారీగా నగదు, నగలు ఉండటం గమనించిన మోతీ సింగ్‌ ఎలాగైనా ఆ ఇంట్లో చోరీ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం పని చేస్తున్న సమయంలోనే ఇంట, బయట సీసీ కెమెరాలు ఎక్కడ ఉన్నాయి? ఏ చోట నుంచి ఇంట్లోకి చొరబడే అవకాశాలున్నాయనే విషయాలను గమనించాడు. చివరికి ఓ గాజు కిటికీ ద్వారా ఇంట్లోకి ప్రవేశిస్తే.. సీసీకెమెరాలో కనిపించదని తెలుసుకున్నాడు. కానీ, అతడు కాస్త లావుగా ఉండటంతో ఆ సన్నటి కిటికీ గుండా వెళ్లే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఎలాగైనా ఆ కిటికీలో నుంచి దూరి దొంగతనం చేయాలని భావించిన మోతీ.. మూడు నెలలపాటు రోజుకు ఒక్కపూటే ఆహారం తింటూ 5 కిలోల బరువు తగ్గాడు. ఆ తర్వాత తన పాత యజమాని ఇంట్లో లేని సమయం చూసి చోరీకి పాల్పడ్డాడు. మొత్తం రూ.13.14లక్షలు విలువ చేసే నగదు, నగలు ఎత్తుకెళ్లాడు.