Movies

టామ్‌బాయ్‌

టామ్‌బాయ్‌

మంగళూరు సోయగం పూజా హెగ్డే. ‘ముకుంద’లో గోపికమ్మగా మురిపించింది. ‘రంగస్థలం’లో జిగేల్‌ రాణిలా మెరిసిపోయింది. ‘అల వైకుంఠపురములో’ ఇలకు దిగొచ్చిన రంభే!‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’తో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చిన హాట్‌ బ్యూటీ పూజా హెగ్డే మనోగతం..

ఒకే రకమైన పాత్రలు చేయడం నాకు అస్సలు నచ్చదు. పోలికలేని క్యారెక్టర్స్‌కే మొగ్గు చూపుతాను. ప్రతి హీరోయిన్‌లానే పెద్ద సినిమాల్లో చేసి మంచిపేరు తెచ్చుకోవాలనే
ఆశ నాకూ ఉంది. నా కెరీర్‌ అనుకున్నట్టుగానే సాగుతున్నందుకు సంతోషంగా ఉంది. చిన్నప్పటినుంచీ నేను టామ్‌బాయ్‌ టైపు.

ఒక్క సినిమా సక్సెస్‌ కాగానే పారితోషికం పెంచేశానని రకరకాలుగా మాట్లాడుకున్నారు. నేను అవన్నీ పట్టించుకోను. కష్టనష్టాలు తట్టుకుని విజయం సాధించడం మాటలు కాదు. హీరోల పారితోషికం విషయంలో రాని చర్చలు, మా విషయంలోనే ఎందుకన్నది నాకు అర్థం కాదు.

ఏ హీరో,హీరోయిన్‌ అయినా చేసిన ప్రతి సినిమా ఆడుతుందన్న గ్యారెంటీ ఉండదు. అలా అని, జయాపజయాలను లెక్కించుకుంటూ కూర్చుంటే కెరీర్‌లో ముందుకెళ్లలేం.
నేను ఒక ప్రాజెక్ట్‌ ఒప్పుకొనేటప్పుడు నా పాత్రకంటే కథకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాను.

మనం ఈ లోకంలోకి రావడానికి ముందే, సమాజంలో మన పాత్ర ఏమిటనేది విధి నిర్ణయించి ఉంటుంది. సృష్టికర్త స్క్రిప్ట్‌ ప్రకారమే నేను నటినయ్యాను. విధాత
రాసిపెట్టి ఉంటేనే ఏదైనా జరుగుతుంది. అదృష్టం లేకపోతే, ఏ రంగంలోనైనా రాణించడం కష్టమే. నా శ్రమ, పట్టుదలకు అదృష్టం జత కావడం వల్లే ఈ రోజు ఇంతమంది
నన్ను అభిమానిస్తున్నారు.

ఇండస్ట్రీకి వచ్చాక నాలో చాలా మార్పులు వచ్చాయి. ఓర్పు, సహనం పెరిగాయి. కొన్నిసార్లు గంటల తరబడి మేకప్‌ వేసుకోవాలి. ప్రతి షాట్‌కూ గ్యాప్‌! వేరే
ఆర్టిస్ట్‌ల కాంబినేషన్లో సీన్స్‌ తీసేటప్పుడు, చాలాసేపు వెయిట్‌ చేయాల్సి ఉంటుంది. సినీ పరిశ్రమలో సహనం చాలా అవసరం. ఏ మాత్రం తేడా వచ్చినా పొగరుబోతు, కోపం ఎక్కువ ..అని ముద్ర వేస్తారు.

ప్రస్తుతం విజయ్‌ ‘బీస్ట్‌’, ప్రభాస్‌ ‘రాధేశ్యామ్‌’, చిరంజీవి ‘ఆచార్య’తోపాటు బాలీవుడ్‌లో సల్మాన్‌ ఖాన్‌తో ఒక చిత్రంలో నటిస్తున్నాను. ఇలాగే, ఎప్పుడూ అందరినీ అలరిస్తూ సక్సెస్‌ఫుల్‌గా సాగిపోవాలన్నది నా ఆశ.