Business

భారత్‌లో క్రిప్టోపై పన్ను-వాణిజ్యం

భారత్‌లో క్రిప్టోపై పన్ను-వాణిజ్యం

* పెట్టుబ‌డులు, ట్రేడింగ్‌లో ఇప్పుడు క్రిప్టో క‌రెన్సీల హ‌వా సాగుతున్న‌ది. న‌కిలీ వార్త‌లు కూడా హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఈ న‌కిలీ వార్త‌ల బారిన మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా అధినేత ఆనంద్ మ‌హీంద్రా ప‌డ్డారు. ఆయ‌న క్రిప్టో క‌రెన్సీల్లో పెట్టుబ‌డులు పెట్టార‌ని… క్రిప్టోల్లో పెట్టుబ‌డుల ద్వారా వేగంగా డ‌బ్బు సంపాద‌న‌కు స‌ల‌హాలు కూడా ఇచ్చార‌ని వార్త‌లొచ్చాయి. వీటిపై ఆనంద్ మ‌హీంద్రా రియాక్ట‌య్యారు. తాను క్రిప్టో క‌రెన్సీల్లో పెట్టుబ‌డులు పెట్టిన‌ట్లు వ‌చ్చిన వార్త‌లు త‌న‌ను దిగ్భ్రాంతికి గురి చేశాయ‌ని, ఈ వార్త‌లు పూర్తిగా అవాస్త‌వం అని ఆనంద్ మ‌హీంద్రా స్ప‌ష్టం చేశారు. క్రిప్టో క‌రెన్సీలో రూపాయి పెట్టుబ‌డి కూడా పెట్ట‌లేద‌ని ట్వీట్ చేశారు. ఈ మేర‌కు ఓ ఆన్‌లైన్ మీడియా సంస్థ‌లో వ‌చ్చిన క‌థ‌నాన్ని త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో షేర్ చేశారు. ఇది పూర్తిగా అనైతికం.. ఈ వార్త గురించి కొంద‌రు న‌న్ను అప్ర‌మ‌త్తం చేశార‌ని తెలిపారు.

* క్రిప్టోకరెన్సీలను పన్ను పరిధిలోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఈ డిజిటల్‌ కరెన్సీల లాభాలపై పన్ను వేసేలా ఆదాయం పన్ను (ఐటీ) చట్టాల్లో మార్పులు చేయాలని యోచిస్తున్నది. రాబోయే ఆర్థిక సంవత్సరానికి (2022-23)గాను వచ్చే ఏడాది పార్లమెంట్‌లో ప్రకటించే బడ్జెట్‌లో ఈ సవరణల్ని ప్రతిపాదించాలనీ భావిస్తున్నది. రెవిన్యూ కార్యదర్శి తరుణ్‌ బజాజ్‌ పీటీఐకిచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు వెల్లడించారు. కాగా, ఇప్పటికే కొందరు క్రిప్టోకరెన్సీల ద్వారా అందుకుంటున్న ఆదాయంపై మూలధన లాభాల పన్ను చెల్లిస్తున్నారని బజాజ్‌ చెప్పారు. క్రిప్టోకరెన్సీని ఓ ఆస్తిగా భావిస్తున్నారన్నారు. అయితే వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) చట్టంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జీఎస్టీలో ఇతర సేవలు అన్నది ఉందని, వాటికి ఏ రేటు వర్తిస్తుందో అదే జీఎస్టీ రేటు క్రిప్టోకరెన్సీ లావాదేవీలకూ ఉంటుందని స్పష్టం చేశారు. క్రిప్టోకరెన్సీ మదుపరైనా, బ్రోకరైనా, ట్రేడింగ్‌ వేదికైనా దాన్నిబట్టే పన్ను వసూళ్లుంటాయన్నారు.

* అమెరికా టెక్నాలజీ దిగ్గజం ఐబీఎం భారత్‌లో భారీ విస్తరణ ప్రణాళికను ప్రకటించింది. దేశంలో మరిన్ని సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లు ఏర్పాటుచేస్తామని, డిజిటలైజేషన్‌ ప్రయాణంలో ప్రభుత్వంతో జతకలవాలని చూస్తున్నామని ఐబీఎం చైర్మన్‌, సీఈవో అర్వింద్‌ కృష్ణ చెప్పారు. ఇండియా పర్యటనకు వచ్చిన కృష్ణ శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, టెలికం మంత్రి అశ్విని వైష్ణవ్‌, ఐటీ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ల్ని కలసి స్కిల్లింగ్‌, వర్క్‌ఫోర్స్‌ డెవలప్‌మెంట్‌తో సహా భాగస్వామ్యం కుదుర్చుకునే అంశాల్ని చర్చించారు. ఈ సందర్భంగా ఐబీఎం చైర్మన్‌ మీడియాతో మాట్లాడుతూ భారత్‌లో తమ కంపెనీ ఇప్పటికే బాగా విస్తరించిందని, హైదరాబాద్‌, బెంగళూరు, పుణెల్లో పెద్ద సెంటర్లు ఉన్నాయని, ఢిల్లీలో చిన్న ఆర్‌ అండ్‌ డీ సెంటర్‌ ఉందన్నారు. అహ్మదాబాద్‌, కొచ్ఛిల్లో సెంటర్ల ఏర్పాటును తాజాగా ప్రకటించామన్నారు. మరో కొన్ని సెంటర్లు తెరవాలన్న ప్రణాళిక ఉందని, వాటిని ముందుగా వెల్లడించనని చెప్పారు. ఐబీఎం కన్సల్టింగ్‌ ఈ వారం ప్రారంభంలోనే హైదరాబాద్‌లో కొత్త బీపీవో కేంద్రాన్ని ప్రారంభించిన సంగతి గమనార్హం. ఇండియాతో సహా వివిధ దేశాల్లో వ్యాపార విస్తరణకు అంతర్జాతీయంగా మూడేండ్లలో 35 బిలియన్‌ డాలర్ల నగదును సంపాదించాలని తమ కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు అర్వింద్‌ కృష్ణ వెల్లడించారు.

* ఎస్‌1, ఎస్‌1 ప్రో పేరిట ఎలక్ట్రిక్‌ స్కూటర్లను తీసుకొచ్చిన ఓలా.. టెస్ట్‌ రైడ్స్‌ సదుపాయాన్ని మరిన్ని నగరాలకు, పట్టణాలకు విస్తరించాలని నిర్ణయించింది. ప్రస్తుతం బెంగళూరు, దిల్లీ, అహ్మదాబాద్‌, కోల్‌కతా నగరాలకే మాత్రమే పరిమితమైన ఈ సదుపాయం రాబోయే రోజుల్లో వెయ్యి నగరాలు, పట్టణాలకు విస్తరించనున్నట్లు ఆ సంస్థ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. నవంబర్‌ 19 నుంచి చెన్నై, హైదరాబాద్‌, కోచి, ముంబయి, పుణె నగరాల్లో ఈ సేవలను ప్రారంభించినట్లు తెలిపింది. నవంబర్‌ 27 నాటికి తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన విశాఖపట్నం, విజయవాడతో పాటు సూరత్‌, తిరువనంతపురం, కోళికోడ్‌, కోయంబత్తూర్‌, వడోదర, భువనేశ్వర్‌, తిరుప్పూర్‌, జైపూర్‌, నాగ్‌పూర్‌లోనూ టెస్ట్‌ రైడ్‌ సదుపాయం తీసుకురానున్నట్లు ఓలా తెలిపింది. డిసెంబర్‌ 15 నాటికి మరిన్ని ప్రాంతాల్లో టెస్ట్‌ రైడ్‌ సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొంది. ఇప్పటికే వేలాది మంది వినియోగదారులు ఓలా టెస్ట్‌ రైడ్స్‌ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారని, స్కూటర్‌ పనితీరుపట్ల సంతృప్తి వ్యక్తంచేశారని ఓలా ఎలక్ట్రిక్‌ చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ అరున్‌ శిర్దేష్‌ముఖ్‌ పేర్కొన్నారు. ఈ ఏడాది ఆగస్టు ఓలా ఎస్‌1, ఎస్‌1 ప్రోను విడుదల చేయగా.. సెప్టెంబర్‌ నుంచి వీటి అమ్మకాలు ప్రారంభమయ్యాయి. నవంబర్‌ 10 నుంచి నాలుగు నగరాల్లో టెస్ట్‌ రైడ్‌ సదుపాయం ప్రారంభమైంది. ఎవరైతే ఎలక్ట్రిక్‌ స్కూటర్లను కొనుగోలు లేదా రిజర్వ్‌ చేసుకున్నారో వారికి టెస్ట్‌ రైడ్‌ చేసే సదుపాయాన్ని ఓలా కల్పిస్తోంది.